న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ పాలన డాలర్లు సంపాదించాలనుకున్న భారతీయులకు పీడ కలగా మారింది. ట్రంప్ అధికారం చేపట్టిన నాటి నుంచి అనుసరిస్తున్న విధానాలు ఆసియావాసులకు ముఖ్యంగా భారతీయులకు వ్యతిరేకంగానే ఉన్నాయి. టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ అమెరికన్ల పట్ల ప్రేమను నటిస్తున్న ట్రంప్ నిజానికి భారతీయుల పట్ల ద్వేషాన్ని వెళ్లగక్కుతున్నారు. ఇప్పటికే విద్య, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లిన భారతీయులను తిప్పి పంపేందుకు దాదాపు అన్ని ప్రయత్నాలు చేస్తున్న ట్రంప్ కొత్తవారు తమ దేశంలోకి రాకుండా నియంత్రించే చర్యలు సైతం చేపట్టారు. తాజాగా హెచ్-1బీ వీసా ఫీజును ఒక్కసారి లక్ష డాలర్లకు పెంచి ఆ వీసాపై అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులతోపాటు వారిపై ఆధారపడిన కుటుంబసభ్యులను సైతం తిప్పి పంపే ఎత్తు వేశారు. ట్రంప్ విధానాల ఫలితంగా అమెరికాలో పనిచేయాలనుకున్న భారతీయుల సంఖ్య ఇప్పటికే 40 శాతం తగ్గిపోయింది.
మరోవైపు టారిఫ్‌ల పేరిట దిగుమతులపై భారీగా సుంకాలు విధిస్తూ భారత మార్కెట్‌ను దెబ్బతీస్తున్నారు. అగ్రరాజ్యాన్ని పునర్నిర్మించే క్రమంలో తనకు ముందున్న పాలకులు ఎవరూ చేయని రీతిలో ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మిత్రదేశాలు, ఆర్థిక సహకారం, దౌత్యపరమైన నాయకత్వంతో అమెరికా గత 80 ఏండ్లుగా నిర్మించుకున్న అంతర్జాతీయ క్రమాన్ని ట్రంప్ గందరగోళంలో పడేశారు. తొలుత ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని ప్రవేశపెట్టిన ట్రంప్ ఆ పేరిట ఉద్యోగుల జీవితభాగస్వాములు, వారి పిల్లలకు మాత్రమే ప్రవేశం కల్పించి, వయోవృద్ధులైన తల్లిదండ్రులు రాకుండా అడ్డుకున్నారు. భారత్ వంటి పరాయి దేశాల నుంచి ఉద్యోగులను నియమించుకోవడం ఆపాలని, స్వదేశంలోనే మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి పెట్టాలని గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సాఫ్ట్వేర్ కంపెనీలకు సూచించారు.
హెచ్1బీ వీసాదారుల జీవితభాగస్వాములకిచ్చే హెచ్-4 వీసాలను రద్దు చేసేందుకు ప్రయత్నించారు. ఒబామా సర్కారు తెచ్చిన హెచ్-4 వీసాల వల్ల లక్ష మందికి పైగా ఉపాధి పొందారని, వీరిలో భారతీయ మహిళలే ఎక్కువగా ఉన్నారని ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది. ఇక విద్యార్థులనైతే చిన్నచిన్న కారణాలతో వీసాలు రద్దు చేసి తిప్పి పంపుతున్నారు. ట్రాఫిక్ చలాన్లు పడ్డాయని, మద్యం సేవించి వాహనం నడిపారని, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు పెట్టారన్న నెపంతో, చివరికి క్లాస్‌కు గైర్హాజరైనా విద్యార్థుల వీసాలు రద్దు చేశారు. దీంతో ఎప్పుడు ఏ కారణంతో వీసా రద్దు చేసి ఇంటికి పంపుతారో తెలియక భారతీయ విద్యార్థులు దినదినగండంగా గడుపుతున్నారు. వీసా నిబంధనలు ఉల్లంఘించారన్న నెపంతో ఇటీవలి కాలంలో 4,700 మంది భారతీయ విద్యార్థుల వీసాలను అమెరికన్ ప్రభుత్వం రద్దు చేసిందని టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనంలో పేర్కొంది.
భారతీయ విద్యార్థులు పనిచేస్తున్న ప్రదేశాలలో తనిఖీలు పెంచడంతో యజమానులు వారిని పనిలోనుంచి తీసేశారు. దీంతో పార్ట్‌టైం పనులు చేస్తూ చదువుకుంటున్న విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. విద్య, ఉపాధి కోసం వచ్చే వారినే కాకుండా పర్యాటకులను సైతం నిరుత్సాహ పరిచే చర్యలకు ట్రంప్ ఒడిగట్టారు. పర్యాటకుల వీసా అపాయింట్మెంట్ నిబంధనలను మార్చారు. పిల్లలైనా, వృద్ధులైనా సరే వ్యక్తిగతంగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిందేనని అన్నారు. తాజాగా ఈ నెలలోనే వ్యాపారులు, పర్యాటకులకు ఇచ్చే బీ1, బీ2 వసాల నిబంధనలను మార్చారు. నాన్ ఇమిగ్రెంట్ వీసాల కోసం ప్రయత్నించేవారు తమ ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లను స్వదేశంలోనే షెడ్యూల్ చేసుకోవాలని స్పష్టం చేశారు. వీరు గతంలో తమ వీసా అపాయింట్మెంట్లను విదేశాల్లో బుక్ చేసుకొనే అవకాశం ఉండేది. మొత్తంగా నిబంధనల పేరిట భారతీయుల పట్ల ట్రంప్ ప్రదర్శిస్తున్న విద్వేషాన్ని అమెరికాలోని చట్టసభ సభ్యులే కాకుండా బహుళజాతి కంపెనీల అధిపతులు సైతం వ్యతిరేకిస్తున్నారు.