నారాయణఖేడ్ : సీఎం రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) జహీరాబాద్ నియోజకవర్గ పర్యటనతో జిల్లాకు ఒరిగిందేమి లేదని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి ( Mahareddy Bhupal Reddy) ఆరోపించారు.. శనివారం నారాయణఖేడ్‌లోని బీఆర్ఎస్ ( BRS ) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో చేపట్టిన పనులను మాత్రమే ప్రారంభించి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో చేపట్టాల్సిన పనుల గురించి సీఎం ప్రస్తావించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. నారాయణఖేడ్ అభివృద్ధి విషయంలోనూ సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టమైన హామీ ఇవ్వకుండా ప్రయత్నం చేస్తానని ప్రకటించడంపై విచారం వ్యక్తం చేశారు.
గతంలో సీఎం కేసీఆర్( KCR ) బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభానికి నారాయణఖేడ్ నియోజకవర్గానికి వచ్చిన సందర్భంలో మున్సిపాలిటీకి రూ.25 కోట్లతో పాటు, ప్రతి పంచాయతీకి రూ.20 లక్షల నిధులు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో అనేక హామీలిచ్చి నెరవేర్చని కారణంగా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని ఆరోపించారు. వేదికపై సీఎం ప్రసంగిస్తున్న సమయంలోనే ప్రజలు వెళ్లిపోవడమే దీనికి నిదర్శనమన్నారు.
సీఎం సభ అట్టర్ ప్లాప్ అయిందన్నారు. కాంగ్రెస్ పాలన సజావుగా ఉందనే నమ్మకం కాంగ్రెస్ నాయకులకు ఉంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలు జరపాలని సవాల్ విసిరారు. వచ్చే ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు బుద్ధి చెపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సమావేశంలో నాయకులు ఎంఏ నజీబ్, ఆహీర్, పరశురామ్, ముజామిల్, విఠల్‌రావు, జగదీశ్వర్‌చారి, లక్ష్మణ్‌నాయక్, ఉబేద్, ప్రశాంత్‌సాగర్ ఉన్నారు.