సిర్గాపూర్, మే 18: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిల భవనంలో అసౌకర్యాల మధ్య కొనసాగుతున్నది. ఈ పురాతన భవనంలో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. పెచ్చులూడుతున్నాయి. దీంతో సిబ్బం ది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో అప్పటి నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి చొరవ చూపి పీహెచ్సీ నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. స్థానిక పీహెచ్సీ భవనం సముదాయంలోని ఖాళీ స్థలంలో అధునాతన సౌకర్యాలతో నూతన భవనం నిర్మించేందుకు ప్రాతిపాదించి 15వ ఫైనాన్స్ కింద రూ. 1.56 కోట్లు మంజూరు చేయించారు.
అనంతరం 2023 జనవరి 2న అప్పటి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుతో కలిసి ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. టెండర్లు పూర్తి చేసి కొత్త భవనానికి శ్రీకారం చుట్టారు. భవన సముదాయాన్ని పూర్తిగా నిర్మాణం చేపట్టారు. అయితే భవనంలో కొన్ని పనులు పెండింగ్‌లో మిగిలాయి. ఎలక్ట్రిక్, కంపౌండ్ నిర్మాణం, తదితర పనులు చేపట్టాల్సి ఉంది. కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించక పోవడంతో కొద్దిపాటి పనులు పూర్తికాక భవనం ప్రారంభానికి నోచుకోవడం లేదని తెలిసింది.
శిథిల భవనంలో భయం గుప్పిట్లో విధులు
సిర్గాపూర్‌లో ఐదు దశాబ్దాల కితం నిర్మించిన పీహెచ్సీ భవనం శిథిలావస్థకు చేరింది. భవనానికి అక్కడక్కడ పెచ్చులూడుతున్నాయి. బీఆర్ఎస్ హయాం లో ఈ పురాతన భవనానికి మూడేండ్ల క్రితం మరమ్మతులు చేశారు. పెయింటింగ్ చేయించారు. అయినా పాత భవనంలో భయం గుప్పిట్లో వైద్యసిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
ఈ భవనంలో పూర్తి స్థాయిలో వైద్యసేవల సౌకర్యాలు, ప్రసవ గది, ఆపరేషన్ థియేటర్, ఫార్మసీ, ల్యాబ్ గదులు, లేబర్ గది తదితర సౌకర్యాలు సక్రమంగా లేకపోవడంతో వైద్య సిబ్బంది, రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల జరిగిన భూభారతి సదస్సుకు వచ్చిన సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతికి స్థానికులు పీహెచ్సీ నూతన భవనం ప్రారంభించాలని విన్నవించారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి నూతన భవనాన్ని త్వరితగతిన ప్రారంభించాలని వైద్య సిబ్బంది, రోగులు కోరుతున్నారు.