Gaza | న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధంలో మృతుల సంఖ్య 40,000 దాటిపోయింది. మృతదేహాలను ఖననం చేయడానికి కుటుంబ సభ్యులు నానా కష్టాలు పడుతున్నారు. గాజా స్ట్రిప్‌లోని డెయిర్ అల్-బలాహ్ శ్మశాన వాటికలో సూర్యోదయం నుంచి సమాధుల తవ్వకాలు ప్రారంభమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సమాధులను కూడా తెరచి, అంతస్థులుగా సమాధులను నిర్మిస్తున్నారు.
గాజాలో మరణించిన వారి మృతదేహాలను ఇండ్ల పెరడు, మెట్ల క్రింద, రోడ్డు పక్క పార్కింగ్ లాట్స్‌లో ఖననం చేస్తున్నారు. గాజా స్ట్రిప్‌లో యుద్ధానికి ముందు ఉన్న జనాభాలో దాదాపు 2 శాతం మంది మరణించారని అధికారులు చెప్తున్నారు. వాస్తవంగా మరణించినవారి ఖననం చేసిన తేదీ, ఐడెంటిఫికేషన్ నంబర్, ఆ మృతదేహం ఎక్కడ దొరికింది? వంటి వివరాలను రాసి పెడుతున్నారు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో అనేక విషాదకర సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా జరిగిన దాడిలో నవజాత కవల శిశువులు, వారి తల్లి, అమ్మమ్మ ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ గాజా స్ట్రిప్, డెయిర్ అల్ బాలాహ్లో మంగళవారం ఈ దారుణం జరిగింది. ఆ సమయంలో ఆ బిడ్డల తండ్రి మహమ్మద్ అల్ ఖుమ్‌సన్ వారి జననాలను నమోదు చేయించి, ధ్రువ పత్రాలను తీసుకొచ్చేందుకు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లారు. ఆయన ప్రభుత్వ కార్యాలయంలో ఉండగానే వారి పొరుగింటివారు ఆయనకు ఫోన్ చేసి, “మీ ఇంటి మీద బాంబులు వేశారు” అని చెప్పారు. దీంతో ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ బిడ్డల జనన ధ్రువీకరణ పత్రాలను విలేకర్లకు చూపుతూ, గుండెలు అవిసేలా రోదించారు. తమకు అస్సెర్ (బాలుడు), అయిస్సెల్ (బాలిక) శనివారం (ఈ నెల 10న) జన్మించారని, వారితో సంతోషంగా గడపటానికి తనకు సమయం చిక్కలేదని వాపోయారు.
హమాస్ రాజకీయ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యతో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇజ్రాయెల్‌పై దాడి విషయంలో వెనక్కి తగ్గితే దైవాగ్రహానికి గురికాక తప్పదని ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు.