సిద్దిపేట, జనవరి 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి): విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతున్నది.అర్ధాకలితో విద్యార్థులు విద్యనభ్యసించాల్సిన దుస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ హయాంలో విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో మధ్యాహ్న భోజనంలో భాగంగా విద్యార్థులకు వారంలో మూడు రోజుల పాటు గుడ్డును పెట్టారు. ఇప్పడు కూడా అదే విధానం కొనసాగుతున్నది. కానీ, ప్రస్తుత ప్రభుత్వం భోజన నిర్వాహకులకు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గుడ్డు పెట్టడం లేదని తెలిసింది. బిల్లులు పెండింగ్‌తో పాటు గుడ్డు ధరలు విపరీతంగా పెరగడంతో చాలాచోట్ల గుడ్డు మెనూ సరిగా అమలు కావడం లేదంటూ విద్యార్థులు చెబుతున్నారు. సిద్దిపేట జిల్లాలో 1013 ప్రభుత్వ పాఠశాలల్లో 86,197 మంది విద్యార్థులు, మెదక్ జిల్లాలో 902 ప్రభుత్వ పాఠశాలల్లో 91,715 మంది విద్యార్థులు, సంగారెడ్డి జిల్లాలో 1247 ప్రభుత్వ పాఠశాలల్లో 1.17 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.
పూర్తిగా అమలు కాని మెనూ …
ప్రభుత్వ పాఠశాలల్లో గుడ్డు మెనూ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు.దీనికి ప్రధాన కారణం మార్కెట్లో గుడ్డు ధరలు పెరగడంతో ప్రభుత్వం తక్కువ ధర కట్టివ్వడంతో పాటు నెలల తరడబడి బిల్లులు పెండింగ్‌లో ఉండడం ప్రధాన కారణం అని తెలుస్తోంది. ప్రాథమిక బడులతో పాటు ఆదర్శ పాఠశాలలు, ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తున్నారు. వీరి ఆకలి తీర్చడంతో పాటు వారానికి మూడు రోజులు మధ్యాహ్న భోజనంలో గుడ్డును పెడుతున్నారు. సోమ, బుధ, శుక్రవారాల్లో విద్యార్థులకు గుడ్డు పెట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వం భోజన నిర్వాహకులకు ఒక గుడ్డుకు రూ. 5 చెల్లిస్తున్నది. మార్కెట్లో గుడ్డు ధర రూ. 7 నుంచి రూ.7.50 ధర పలుకుతున్నది. దీంతో అదనంగా రూ.2 నుంచి రూ 2.50 వరకు భారం భరించాల్సి వస్తున్నదని భోజన నిర్వాహకులు వాపోతున్నారు. పైగా బిల్లులు సకాలంలో రావడం లేదని భోజన నిర్వహణ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో బయట అప్పులు తెచ్చి గుడ్డు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని వారు చెబుతున్నారు. తాము చేసిన కష్టం వడ్డీ చెల్లింపులకే సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్ని రకాలుగా తాము ఇబ్బందులు ఎదుర్క్కొంటున్నామని వారు తెలుపుతున్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలంటే వారికి పూర్తిస్థాయిలో మధ్యాహ్న భోజన మెనూ అమలు చేయాలి. నెలల తరబడి బిల్లులు పెండింగ్‌తో పాటు విపరీతంగా పెరిగిన ధరలతో వారంలో మూడు రోజులు పూర్తిస్థాయిలో గుడ్డు పెట్టలేక పోతున్నామని కార్మికులు చెబుతున్నారు. కొన్ని పాఠశాలల్లో వారంలో మూడు రోజులు గుడ్డు అమలు అవుతున్నది. ఎక్కువ విద్యార్థులు ఉన్న చోట వారంలో మూడు రోజులు గుడ్డు పెట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులు విడుదల చేయడంతో పాటు గుడ్డు ధరలను మార్కెట్ ధరలకు అనుగుణంగా చెలించాలని భోజన నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు.
పదోతరగతి విద్యార్థులకు అందని అల్పాహారం
పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం అల్పాహారం అందించడం లేదు. ఉదయమే దూర ప్రాంతాల నుంచి పాఠశాలకు విద్యార్థులు చేరుకుంటారు. పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతుండడంతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వీరు ఉదయమే 8.30 గంటలకు వరకు పాఠశాలకు చేరుకోవాలి. పాఠశాలకు సమయానికి చేరుకోవాలి కాబట్టి ఉదయం ఏడు గంటలకే దూర ప్రాంతాల విద్యార్థులు పాఠశాలకు బయలు దేరుతారు. వీరు ఇంటి వద్ద ఏం తినకుండానే పాఠశాలకు వస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యార్థులకు ఉదయం స్నాక్స్ అందించే వారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కొన్ని పాఠశాలల్లో మాత్రం దాతల సహకారంతో స్నాక్స్ అందిస్తున్నారు. ఉదయం ఏడు గంటలకు వచ్చిన పిల్లలు మధ్యాహ్నం వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు అర్ధాకలితో విద్యను అభ్యసించాల్సి వస్తున్నది. సాయంత్రం కూడా స్నాక్స్ ఇవ్వడం లేదు. మధ్యాహ్న భోజనంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తున్నది. ఉదయం 7 గంటలకు ఇంటి నుంచి వచ్చిన విద్యార్థి రాత్రి 7గంటల వరకు చేరుకుంటున్నారు. దీంతో ఒక్కపూటకే పరిమితం అవుతున్నారు. దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. విద్యార్థులకు కడుపు నిండా భోజనం పెట్టాల్సిన ప్రభుత్వం విద్యార్థులను అర్ధాకలితో అలమటిస్తున్నది.