కాళేశ్వరం ప్రాజెక్టు మీద, తెలంగాణ అప్పుల మీద కాంగ్రెస్ చేసిన, చేస్తున్న దుష్ప్రచారం అంతాఇంత కాదు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు గుప్పించి గోబెల్స్‌ను మించి అబద్ధాలను వల్లెవేశారు. అదే నిజమని కొందరు ప్రజలు ఆశపడ్డారు. కాంగ్రెస్‌కు అధికారాన్ని కట్టబెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిపాలన చేయాల్సిందిపోయి మళ్లీ అదే పనిగా బీఆర్ఎస్పై, కేసీఆర్ హయాంలో జరిగిన అప్పులపై అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు.
రెండున్నరేండ్ల పాలనలో విఫలమై తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొన్నందుకు మళ్లీ అదే పాత సూత్రాన్ని కాంగ్రెస్ నేతలు అందుకుంటున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ 2014లో ప్రభుత్వం ఏర్పాటుకు ముందు సమైక్య రాష్ట్రం నుంచి వచ్చిన అప్పు రూ.84,268 కోట్లు. ఇది రాష్ట్ర విభజన సందర్భంగా వారసత్వంగా వచ్చిన అప్పు. 2023 డిసెంబర్ 7 నుంచి 2024 మార్చి 31 వరకు కాంగ్రెస్ పాలనలో ఎఫ్ఆర్బీఎం ద్వారా రూ.15,118 కోట్లు తీసుకుని దానిని బీఆర్ఎస్ ప్రభుత్వ లెక్కలో వేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటికి ప్రభుత్వంపై ఉన్న మొత్తం బకాయి రూ.5,16,881 కోట్లు. సమైక్య రాష్ట్రంలో నుంచి వచ్చిన అప్పు, కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్పై నెట్టిన అప్పు తీసేస్తే మొత్తం బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో చేసిన అప్పు రూ.4,17,495 కోట్లు.
ఈ విషయాన్ని ఒకటికి పదిసార్లు మాజీ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో, బహిరంగ సభలు, అనేక సమావేశాలు, ప్రెస్మీట్ల ద్వారా ఆధారాలతో నిరూపించారు. తెలంగాణ బడ్జెట్ ఇన్ బ్రీఫ్ 2025-2026 14వ పేజీలో బీఆర్ఎస్ సర్కార్ ఎఫ్ఆర్బీఎం పరిధిలో తీసుకున్న అప్పు రూ.3,01,484 కోట్లు + రూ.1,09,335 కోట్లు = రూ.4,10,819 కోట్లు. ఇది కాంగ్రెస్ పార్టీనే తమ బడ్జెట్లో పెట్టిన లెక్క. కాగ్ రిపోర్ట్ ప్రకారం..బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు రూ.4,10,819 కోట్లు. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేతపత్రంలోని లెక్కల ప్రకారం బీఆర్ఎస్ చేసిన అప్పు రూ.4,17 లక్షల కోట్లు.
పదేపదే అబద్ధాలు చెప్తూ, సవాళ్లు విసురుతూ మంత్రులు కాలుదువ్వడం.. ఆ సవాళ్లను బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్ స్వీకరించి ఆధారాలతోపాటు చర్చకు వెళ్తే మంత్రులు తోకముడిచారు. బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేసి తమ అసమర్థతను చాటుకున్నారు. వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పుతో గొప్ప సంపదను సృష్టించింది. జిల్లాకో మెడికల్, నర్సింగ్ కాలేజీ, కలెక్టరేట్లను నిర్మించింది. అద్భుతమైన సచివాలయం, భద్రతతో కూడిన కమాండ్ కంట్రోల్ సెంటర్, కాళేశ్వరం లాంటి అనేక ప్రాజెక్టులను చేపట్టింది. రైతుబంధు, రైతు బీమాతోపాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం, ఉచిత కరెంట్, గొర్రెలు, చేపల పిల్లల పంపిణీ, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయను చేపట్టింది. తెలంగాణ సంపదను పెంచిన ఘనత కేసీఆర్‌దే.
2026 మార్చి 18న అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి చెప్పిన లెక్క ప్రకారం రెండున్నరేండ్లలో చేసిన అప్పు రూ.3,47,294 కోట్లు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇపుడు చెప్తున్న లెక్క రూ.3,85,600 కోట్లు. ఈ అప్పుతో రాష్ట్రంలో కొత్తగా కట్టిన ఒక్క ప్రాజెక్టునైనా చూపించగలరా? మేడిగడ్డ బరాజ్‌లో రెండు పిల్లర్లు కుంగితే వాటిని రిపేర్ చేయకుండా చోద్యం చూస్తూ నాశనం చేయాలని కాంగ్రెస్ సర్కార్ చూస్తున్నది. కాళేశ్వరం ద్వారా నీళ్లు వస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందనే దుర్మార్గ ఆలోచనతో ప్రాజెక్టును పడావు పెడుతున్నది. పిల్లర్ల వద్ద ఇసుక తోడటం లాంటి కుట్రలకు పాల్పడుతున్నది. ప్రతి చుక్కనూ ఒడిసి పట్టుకునే అవకాశం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ కల్పించారు. కాంగ్రెస్ సర్కార్ ఆ పని చేయకుండా ప్రాజెక్టుల నుంచి లక్షల క్యూసెక్కుల నీటిని రోజూ వృథాగా పోనిస్తున్నది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్తే అడుగడుగునా అడ్డుకునే యత్నం చేసింది. కాంగ్రెస్ దుష్టపాలన నుంచి రాష్ర్టానికి విముక్తి కల్పించాలని ప్రజలు కోరుకుంటున్నారు. త్వరలో ఓటు రూపంలో సమాధానం చెప్పి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
– తెలంగాణ విజయ్ 9491998702