ప్రగతి పరుగులకు పర్యావరణం బలి కావడమనేది నేటియుగపు లక్షణంగా నిలుస్తున్నది. భారీ ప్రాజెక్టులు చేపట్టినపుడు సహజంగానే దానివల్ల ప్రకృతి, పర్యావరణంపై పడే ప్రభావాల గురించిన చర్చ ముందుకు వస్తుంది. ప్రగతి, పర్యావరణం ఈ రెండింటి మధ్య సమతూకం సాధించుకోవడమే నేటి యుగపు ప్రధాన సవాల్. మొదటిది ఎంత అత్యవసరం అయినప్పటికీ రెండోది ధ్వంసం కాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. అండమాన్-నికోబార్ దీవుల్లో చేపడుతున్న బృహత్తర అభివృద్ధి ప్రాజెక్టుకూ ఈ మాటలు వర్తిస్తాయి. నికోబార్ దక్షిణపు అంచున గలాథియా అఘాతం వద్ద దాదాపు రూ.80 వేల కోట్ల పైచిలుకు వ్యయంతో మెగా రేవు పట్టణం, పౌర-సైనిక విమానాశ్రయం, భారీ టౌన్షిప్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది.
భారత ప్రధాన భూభాగానికి తూర్పుగా 1,300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దీవులు పర్యావరణపరంగా చాలా సున్నితమైనవన్న సంగతి తెలిసిందే. చిన్నపాటి మార్పులు తలపెట్టినా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటిది ఓ మెగా ప్రాజెక్టుకు సిద్ధం కావడమంటే సహజంగానే సందేహాలు, ఆందోళనలు వ్యక్తమవుతాయి. ప్రాంతీయ పర్యావరణాన్ని పూర్తిగా మార్చేసే ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇదివరకే జారీ అయ్యాయి. తాజాగా జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తన ముందు దాఖలైన వ్యాజ్యాన్ని కొట్టివేయడంతో మరోసారి ఈ అంశంపైకి దేశం దృష్టి మళ్లింది.
ఇది సరుకు రవాణాలో మరో హాంకాంగ్ అవుతుందని భారత ప్రభుత్వం చెప్తుండగా, వ్యతిరేకులు మాత్రం తీవ్రస్థాయిలో పర్యావరణ విధ్వంసం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. కేంద్రం తలపెట్టిన ప్రాజెక్టుకు 244 చదరపు కిలోమీటర్ల భూమి కావాలి. అందుకు 166 చదరపు కిలోమీటర్ల వర్షాధార అడవులను నరకాల్సి ఉండటమే ఈ ఆందోళనకు మూలకారణం. కోటికి పైగా చెట్లను ప్రాజెక్టు కోసం నరికివేయబోతున్నారు. మారిన అటవీ చట్టాల మేరకు ఈ నష్టాన్ని మరోచోట భర్తీ చేస్తామని, ఇతోధికంగా చెట్లు నాటుతామని సర్కార్ అంటున్నది. గూడు చెదిరిపోయే మొసళ్లు, పగడపు దిబ్బలను సురక్షితంగా వేరే ప్రాంతాలకు తరలిస్తామని కూడా చెప్తున్నది. ప్రాజెక్టు వల్ల పర్యాటకానికి, వ్యూహాత్మకంగా రక్షణ దళాలకు తోడ్పాటు లభించే మాట వాస్తవమే అయినప్పటికీ అందుకు చెల్లిస్తున్న మూల్యం చాలా ఎక్కువ అనేది పర్యావరణవాదుల అభ్యంతరం. భూకంపాలకు అవకాశాలు ఉన్న చోట భారీ నిర్మాణాలు చేపట్టడం ఎంతవరకు సబబు? అనేది మరో ప్రశ్న.
ప్రాజెక్టు వల్ల స్థానభ్రంశం పొందేది, సమస్యల పాలయ్యేది చెట్టూపుట్ట మాత్రమే కాదు. షోంపెన్, గ్రేట్ అండమానీస్ గిరిజనులు నివసించే చోట ఈ ప్రాజెక్టు నిర్మించ తలపెట్టారు. అక్కడ కొత్తగా కట్టే టౌన్షిప్లలో స్థిరపడబోయే జనాభా సుమారు ఆరున్నర లక్షలు. అదనంగా పర్యాటకుల సంఖ్యను ఏడాదికి పది లక్షల వరకు పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తున్నది. ప్రస్తుతం అడవుల్లో జీవనం సాగిస్తున్న ఎనిమిది వేల మంది గిరిజనుల మనుగడ ఈ జనాభా విస్పోటం ఫలితంగా తీవ్ర ప్రమాదంలో పడుతుందని ఆందోళనలు వ్యక్తమవుతుండటం గమనార్హం. చరిత్రలో ఇలాంటి జనాభా మిశ్రణం విపరీత పరిణామాలకు దారితీయడం తెలిసిందే. ఈ జనమార్పిడీ వల్ల అండమాన్ తెగలు కూడా రకరకాల వ్యాధుల బారిన పడి అవసాన దశకు చేరుకున్నా అడిగే దిక్కులేదు.
ప్రాజెక్టు పూర్తయితే నికోబార్ రేవుకు సరుకు రవాణా కంటైనర్ షిప్పుల రాకపోకలు భారీగా పెరుగుతాయి. రేవు, విమానాశ్రయం, టౌన్షిప్నకు అవసరమయ్యే విద్యుత్తును స్థానికంగా గ్యాస్ ఆధారిత కేంద్రాల ద్వారానే జరగాలి. అండమాన్-నికోబార్ దీవుల్లో విద్యుత్తు తయారీకి పనికొచ్చే నదులు, వాగుల వంటి జలవనరులు లేకపోవడమే అందుకు కారణం. అదనపు అవసరాలకు సౌరశక్తిని వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్రం తొందరపాటు కూడా వివాదాస్పదం అవుతున్నది. ప్రపంచంలోనే పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాల్లో ఒకటిగా గుర్తించిన చోట ఇంతటి మెగా ప్రాజె క్టు కట్టడం ఉత్పాతాలకు ద్వారాలు తెరువడమే అనడంలో ఎలాంటి సందేహం లేదు.