న్యూఢిల్లీ, జూలై 6 : నాలుగేండ్ల సర్వీస్ ముగిసిన తర్వాత కూడా అగ్నివీర్లను పెద్ద సంఖ్యలో కొనసాగించాలని త్రివిధ దళాలు కోరుతున్నాయి. ‘అగ్నిపథ్ పథకం’లో ఎంపికైన అగ్నివీర్లను కొనసాగించే అంశంపై భారత సైన్యం కీలక సమీక్ష చేపట్టింది. ప్రస్తుతమున్న 25 శాతం రిటెన్షన్ పరిమితిని 50శాతానికి పెంచాలని ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ కోరుతుండగా, రిటెన్షన్‌ను 75శాతానికి పెంచాలని నౌకాదళం భావిస్తున్నది. ఇందుకు సంబంధించి త్రివిధ దళాలు వేర్వేరుగా తమ ప్రతిపాదనలు సిద్ధం చేయగా, దీనిపై సాధ్యాసాధ్యాల కోసం సాయుధ దళాల్లోని విభాగాలు, మిలిటరీ వ్యవహారాల శాఖ (డీఎంకే) మధ్య మరింత చర్చ జరిగే అవకాశముంది.
శిక్షణ పొందిన సిబ్బందిలో ఎక్కువమందిని కొనసాగించటం ద్వారా ఆధునిక వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞానం, కొత్త తరహా యుద్ధ వ్యూహాలపై అనుభవం ఉన్న సైనికుల సంఖ్యను పెంచుకోవచ్చునని త్రివిధ దళాలు భావిస్తున్నాయి. 2023లో శిక్షణ ప్రారంభించిన తొలి బ్యాచ్ అగ్నివీరులు ఈ ఏడాది చివరలో తమ నాలుగేండ్ల సర్వీస్‌ను పూర్తిచేసుకోనున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం, అగ్నివీరు లలో ప్రతి బ్యాచ్‌లో కేవలం 25శాతం మందిని మాత్రమే శాశ్వత సర్వీస్‌కు ఎంపికచేస్తారు. ప్రతిభ, వైద్య అర్హతలు, సంస్థాగత అవసరాల ఆధారంగా ఈ ఎంపిక ఉంటుంది.