ముంబై : రుతు పవనాలు దేశాన్ని సోమవారం ముంచేశాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురుగాలులకు దేశ ఆర్థిక రాజధాని ముంబై అతలాకుతలం అయిపోయింది. ఇప్పటి వరకు 16 మంది చనిపోయారు. ముంబై, థానె నగరాలు నీట మునిగాయి. రోడ్లు, రైల్వే మార్గాలు ధ్వంసం కావడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లలోకి వరద నీరు చేరింది. ముంబై, థానె నగరాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముంబై-పుణె మధ్య రైళ్లను అధికారులు రద్దు చేశారు. ముంబై-పుణె, ముంబై-అహ్మదాబాద్ రహదారులు భారీ వర్షాలకు ధ్వంసం కావడంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి. ప్రైవేట్ కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని అధికారులు సూచించారు. ప్రభుత్వ స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తున్నారు. పల్గార్ జిల్లాలో అత్యధికంగా 300 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గంటకు 70-80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
హిమాచల్ ప్రదేశ్లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఓ వాహనం మీద రాయి పడగా 14 ఏండ్ల బాలిక చనిపోయింది. చాలా ప్రాంతాల్లో వరద నీరు ముంచెత్తింది. అటు ఒడిశాలో మూడు రోజులు వానలు దంచికొట్టగా నగరాలు నీట మునిగాయి. సోనేపూర్లో ఏకంగా 328 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.