జోగులాంబ గద్వాల : ప్రభుత్వ ఆసుపత్రులకు ( Hospitals ) వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ( Collector Rizwan Basha ) ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.
ఐసీయూ, ఇతర వార్డులను సందర్శించి రోగులతో మాట్లాడారు. రోగుల ఆరోగ్య సమస్యలను తెలుసుకొని వారికి అందుతున్న వైద్య సేవలపై వాకబు చేశారు. గద్వాల ఆసుపత్రికి మంజూరైన వివిధ వైద్య, ఇతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్న వాటిని పూర్తిస్థాయిలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చి నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పరిసరాలను పరిశీలించగా పొదలు పెరగడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
వినియోగించని పాత మంచాలు, ఇతర వైద్య సామాగ్రిని ఎక్కడపడితే అక్కడ పడేయడం సరికాదని ఇలాంటి స్క్రాప్ ను వేలంపాట నిర్వహించి విక్రయించాలన్నారు. ఎగ్జామినేషన్ ట్రీట్మెంట్ విభాగంలో మానిటర్ యంత్రం పనిచేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఆసుపత్రిలో పలు మరమ్మతులకు,విద్యుత్, ఇతర పనులకు రూ.50 లక్షల నిధులను కేటాయించినప్పటికీ సకాలంలో పనులు ప్రారంభించకపోవడంపై సంబంధిత అధికారులపై మండిపడ్డారు.
చాలా రోజులుగా విధులకు హాజరుకాని వైద్యులను సరెండర్ చేయాలన్నారు. ఏజెన్సీ ద్వారా అవుట్సోర్సింగ్ విధానంలో సెక్యూరిటీ, శానిటేషన్ కోసం పెద్ద ఎత్తున సిబ్బందిని నియమించారని, వారి సేవలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని పర్యవేక్షకురాలు ఝాన్సీ లక్ష్మికి సూచించారు. ఆయన వెంట ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్ కుమార్ రెడ్డి, రాజ్ కుమార్, పంచాయతీరాజ్ శాఖ ఈఈ ప్రభాకర్, వైద్యశాఖ ఏఈ రహీం, వైద్యాధికారులు, తదితరులున్నారు.