హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 2024 ఏప్రిల్ 1 తర్వాత పదవీ విరమణ పొందిన వారే కాదు.. పది పదిహేనేండ్ల క్రితం రిటైర్డ్ అయిన వారికి కష్టాలు తప్పడంలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పెన్షనర్లనే కాదు.. పాత పెన్షనర్లను ఇబ్బందులు పెడుతున్నది. ఇందుకు తెలుగు అకాడమీయే నిదర్శనంగా నిలుస్తున్నది. ఈ అకాడమీలో పనిచేసి రిటైర్డ్ అయిన వారి పెన్షన్లు బంద్ అయ్యాయి. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 80 మందికిపైగా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు నిలిచిపోయా యి. వీరికి సెప్టెంబర్‌లో ఇవ్వలేదు.. అక్టోబర్వి కూడా పడలేదు. దీంతో రెండు నెలలుగా రిటైర్డ్ ఉద్యోగులు కష్టాలు అనుభవిస్తున్నారు. వీరిలో చాలా మంది 2014కు ముందు రిటైర్డ్ అయిన వారున్నారు. అయితే పెన్షనర్లు ఆరాతీస్తే డబ్బుల్లేవన్న సమాధానమే వస్తున్నది.
ఆర్థికశాఖ అధికారులను కలిసినా ప్రయోజనం లేకుండాపోయింది. వాస్తవానికి తెలుగు అకాడమీ నిధుల నుంచి పెన్షన్లు ఇవ్వాలి. ప్రభుత్వానికి సంబంధమే లేదు. కానీ అకాడమీ నిధులను సర్కారు వాడుకుని, మమ్మల్ని రోడ్డున పడేసిందని రిటైర్డ్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. తెలుగు అకాడమీలో రూ.180కోట్ల నిధులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం రూ. 72కోట్లు మాత్రమే ఉన్నాయని రిటైర్డ్ ఉద్యోగులు అంటున్నారు. మిగతా వాటిని సర్కారు వాడుకుందని ఆరోపిస్తున్నారు. ఇవిపోను మరో రూ. 65కోట్లు ఇతర బ్యాంకుల్లో ఉన్నట్టు సమాచారం.
ఇంటర్‌బోర్డు నుంచి రూ. 60కోట్ల వరకు రావాల్సి ఉంది. అకాడమీ డబ్బులు వాడుకుని, మా పింఛన్లు ఇవ్వరా..? అంటూ పెన్షనర్లు ప్రశ్నిస్తున్నారు. ఏపీలోని తెలుగు అకాడమీలో రూ.50కోట్లు కార్పస్ ఫండ్ పెట్టి వడ్డీల నుంచి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు చెల్లిస్తున్నారు. మన దగ్గర సైతం కార్పస్‌ఫండ్‌ను పెట్టి, పెన్షన్లు చెల్లించాలని రిటైర్డ్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.