విప్లవ శిఖరం నేలకొరిగింది. మావోయిస్టు పార్టీకి మాస్టర్‌మైండ్‌గా పేరున్న మద్వి హిడ్మా ఎన్కౌంటర్లో మృతిచెందాడు. గెరిల్లా పోరాటాల్లో ఆరితేరి, పార్టీకి జవసత్వాలు ఇస్తూ వచ్చిన మద్వి హిడ్మాతో పాటు ఆయన భార్య, నలుగురు దళ సభ్యులు కూడా గ్రేహౌండ్స్ తూటాలకు ఒరిగిపోయారు. అయితే ఇది కోవర్ట్ ఆపరేషన్ అని, దొరికిన వారిని పట్టుకొని కాల్చి చంపారని పౌర హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
హైదరాబాద్/ కొత్తగూడెం ప్రగతి మైదాన్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): మావోయిస్టు పార్టీ కీలక నేత, పీపుల్స్ గెరిల్లా సుప్రీం లీడర్, ఎర్రదళం సేనాధిపతి మద్వి హిడ్మా అలియాస్ సంతోష్ ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయాడు. అతనితోపాటు భార్య రాజే పోలీసుల తూటాలకు నేలకొరిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కొరకరాని కొయ్యగా మారిన సేనాధిపతి హిడ్మాపై డేగ కన్నెసి, అనేక కోవర్టు ఆపరేషన్లు జరిపిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లోని మారెడుమిల్లి అడవుల్లో అతని ప్రస్థానానికి తెరపడింది. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారెడుమిల్లి మండలం టైగర్ జోన్ ప్రాంతంలోని నల్లూరు జలపాతం వద్ద పోలీసులు మంగళవారం జరిపిన కాల్పుల్లో హిడ్మాతోపాటు ఆయన భార్య రాజే(డీవీసీఎం), లక్మల్ అలియాస్ చైతు, మల్లా అలియాస్ మల్లలు, కమ్లూ అలియాస్ కామ్లేశ్ మృతిచెందారు. దీంతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ పడినైట్లెంది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ కేంద్రంగా ఉన్న తమ స్థావరాలను మరో రాష్ర్టానికి మార్చే ప్రయత్నంలోనే ఈ కౌంటర్ జరిగినట్లు భావిస్తున్నారు. అంతేకాదు ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాల్లో ఉన్న ఆనవాళ్లు సైతం అనుమానాస్పదంగానే ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
గెరిల్లా పోరాటాల్లో మాస్టర్‌మైండ్‌గా పేరున్న మద్వి హిడ్మా (51) తలపై సుమారు కోటి రూపాయల రివార్డు ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. అతని భార్య రాజే తలపై కూడా సుమారు రూ.50 లక్షల రివార్డు ఉన్నది. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు ఏపీ డీజీపీ హరీశ్‌గుప్తా మీడియాకు తెలిపారు. అతనితోపాటు ఉన్న మిగిలిన మావోయిస్టు కోసం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోల కదిలికలపై సమాచారం ఉండటం వల్లనే టార్గెట్‌ను రీచ్ అయ్యామని తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో 2 ఏకే 47 రైఫిల్స్, ఒక పిస్టల్, ఒక రివాల్వర్, ఒక సింగిల్ బోర్ వెపన్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అలాగే ఏకే 47కి సంబంధించిన 28 రౌండ్ల బుల్లెట్లు, పిస్టల్‌కు చెందిన 5 రౌండ్ల బుల్లెట్లు, ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, ఫ్యూజ్ వైర్లు, ఏడు కిట్‌బ్యాగ్‌లు ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి వైదొలిగిన తరువాత ఆ బాధ్యతలను కేంద్ర కమిటీలో అగ్రస్థానంలో ఉన్న నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు భర్తీ చేశారు. అప్పటినుంచి మావోయిస్టు పార్టీలో అనేక మార్పులు చోటు చేసుకోవడంతోపాటు, ఆ పార్టీపై కేంద్రం సైతం దశల వారీగా రూపుమార్చే ‘ఆపరేషన్స్’లో అణచివేత మొదలుపెట్టింది. దీంతో ఇరువర్గాల మధ్య నెలకొన్న పోరు కొన్ని రోజులకే ఓ యుద్ధాన్ని తలపించింది. దీంతో కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా బాధ్యతలు చేపట్టాక మావోయిస్టు పార్టీపై నేరుగా యుద్ధం ప్రకటించారు. గడిచిన రెండేళ్లలో ఆ పార్టీపై వేలాది సైన్యంతో దాడులు జరిపి, ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం కేంద్రంగా ఉన్న మావోయిస్టు పార్టీ మూలాలను తుడిచిపెట్టారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా అబూజ్మడ్ అడవుల్లో వేలమంది సైన్యంతో జరిపిన ఆపరేషన్ ‘కగార్’ విజయకేతనం ఎగురవేసింది.
ఈ ఏడాది మే నెలలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ సుప్రీమ్ లీడర్ బసవరాజు సహా 38మంది మావోయిస్టులు నేలకొరిగిన విషయం తెలిసిందే. కేశవరావు మృతి తరువాత మావోయిస్టు పార్టీలో భిన్నస్వరాలు వినిపించాయి. పార్టీ మొత్తం వర్గాలుగా ఏర్పడి చీలికలు మొదలయ్యాయి. బసవరాజు ఎన్కౌంటర్ తరువాత ఆ పార్టీలో ఆధిపత్య పోరు కేంద్రంతో ‘సంధి’కి దారి తీసినట్లు తెలుస్తోంది. స్వల్ప విరామం తరువాత ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జి బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి మావోయిస్టు పార్టీలో మరో వర్గంగా ఏర్పడిన కొందరు నాయకుల నుంచి ‘యుద్ధం వద్దు.. రాజీ ముద్దు’ అన్న స్వరాలతో వరుస లొంగుబాట్లు మొదలయ్యాయి. దేవ్ జితోపాటు మద్వి హిడ్మాకి సైతం పార్టీ కీలక బాధ్యతలను అప్పగించింది. అనంతరం కొంతకాలానికి ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తున్న మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాశ్ మొదలుకొని కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్న పుల్లూరి ప్రసాద్ అలియాస్ చంద్రన్న, మల్లోజుల వేణుగోపాల్‌రావు అలియాస్ భూపతి అలియాస్ సోను, అశన్న అలియాస్ సతీష్ ఇలా వరుసగా తమ అనుచరులతో కలిసి లొంగిపోయారు. దీంతో మావోయిస్టు పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగిలాయి.
మావోయిస్టు పార్టీకి వెన్నెముకగా ఉంటూ, ప్రభుత్వాలకు సవాల్‌గా నిలిచిన అజ్ఞాత నేత హిడ్మా శకం ముగిసింది. ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన హిడ్మా చిన్న వయసులోనే మావోయిస్టు పార్టీ బాలల సంఘంలో చేరాడు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పువర్తి గ్రామంలో 1981లో జన్మించిన మద్వి హిడ్మా అత్యంత చిన్న వయసులోనే కేంద్ర కమిటీ స్థాయికి చేరిన నేతగా పేరొందాడు. 1990ల చివరలో సంస్థలో గ్రౌండ్ లెవల్ ఆర్గనైజర్‌గా చేరిన హిడ్మా, గత రెండు దశాబ్దాలుగా అనేక దాడులకు ప్రధాన సూత్రధారి అయ్యాడు. ఆ పార్టీ సాయుధ దళాలుగా ఉన్న పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) 1వ బెటాలియన్‌కి ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కొరకరాని కొయ్యగా మారాడు. దండకారణ్యాన్ని కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలను కొనగించడంలో హిడ్మా వ్యూహకర్త. 2007లో ఉర్పల్మెట్ట సీఆర్పీఎఫ్ దళాలపై జరిపిన దాడిలో హిడ్మా కీలక భూమిక పోషించడంతో అక్కడి నుంచి మావోయిస్టు పార్టీలో బలమైన క్యాడర్‌గా ఎదుగుదల మొదలైంది.
2010లో సుక్మా జిల్లాలో జరిగిన మావోయిస్టు దాడిలో సుమారు 76 మంది జవాన్లు నేలకొరిగిన ఘటనలో హిడ్మా కీలకపాత్ర పోషించాడు. అక్కడి నుంచి ఆ పార్టీలో హిడ్మా తిరుగులేని శక్తిగా ఎదుగుతూ అనతి కాలంలోనే కేంద్ర కమిటీలో సభ్యుడిగా స్థానాన్ని దక్కించుకున్నాడు. 2016లో హిడ్మా అరెస్ట్ అయ్యి తర్వాత విడుదలయ్యాడు. అప్పటికి అతను కిందిస్థాయి సభ్యుడిగా ఉండడంతో ప్రభుత్వాలు అతడిపై పెద్దగా దృష్టి సారించలేదు. 2017లో హిడ్మా మాస్టర్ ప్లాన్‌లో చిక్కుకుని 24మంది జవాన్లు చనిపోయారు. 2021లో సుక్మా-బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో భద్రతా దళాలపై జరిపిన మెరుపుదాడిలో 22 మంది సిబ్బంది మృతిచెందగా, 31 మంది గాయపడ్డారు. ఇలా ఎంతోమంది భద్రతా సిబ్బందికి ప్రాణనష్టం కలిగించడంతోపాటు, ఉద్యమద్రోహులుగా ముద్రలు వేసి, ఇన్ఫార్మర్ వ్యవస్థను హిడ్మా అనుచరవర్గం తుడిచిపెట్టుకుంటూ వచ్చింది. భద్రతా దళాలకు చిక్కినట్లే చిక్కి హిడ్మా పలుమార్లు తప్పించుకున్నాడు.
లొంగిపోయేందుకు వచ్చిన హిడ్మాను పథకం ప్రకారం కాల్చివేశారా? కోవర్టు ఆపరేషన్ విఫలమవడంతోనే అతన్ని మట్టుబెట్టారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగింది ముమ్మాటికీ బూటకపు ఎన్కౌంటర్ అని పౌర సంఘాలు ఆరోపిస్తున్నాయి. కేంద్రం 2026 మార్చి లోపు భారతదేశంలో మావోయిస్టుల ఉనికి లేకుండా చేస్తామని ప్రకటించింది. కేంద్రానికి కొరకరాని కొయ్యగా మారిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, పీపుల్స్ గెరిల్లా టాప్ కమాండర్ మద్వి హిడ్మాను 2025 నవంబర్ 30లోపు అరెస్టు లేదా ఎన్కౌంటర్ చేయాలని కేంద్రం భద్రతా బలగాలను ఆదేశించినట్టు సమాచారం. ఈ క్రమంలో భద్రతా బలగాల కూంబింగ్ తీవ్రతరం కావడంతో అటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ పోలీసుల్లో ఎవ్వరికి చిక్కినా తనను ఎన్కౌంటర్ చేస్తారనే ఆలోచనతో హిడ్మా ఏపీ పోలీసుల ఎదుట లొంగిపోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఏపీ మీదుగా తమిళనాడుకు వెళ్లి అక్కడ తలదాచుకోవాలన్న మరో ఆలోచన కూడా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలోనే ఆయన ఏపీ బోర్డర్‌కు వచ్చారని అంటున్నారు.