రైతులు భయపడినట్టే అయింది. ఆన్లైన్లోనే యూరియా పంపిణీ చేయాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలోని పెద్దపల్లితోపాటు రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో ప్రభుత్వం ఈ ప్రక్రియను నెల క్రితమే ప్రయోగాత్మకంగా అమలు కాగా, ఇప్పుడు అన్ని జిల్లాలకూ విస్తరించింది. శనివారం నుంచి ఎరువుల బుకింగ్ యాప్ ద్వారానే కొనుగోలు చేయాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాలు జారీ చేయడంతో అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకోవడం కష్టమేమీ కాదని అధికారులు చెబుతున్నా.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వద్ద స్టార్ట్ఫోన్లు లేవని, చాలా మంది విద్యావంతులు కాదని, ఈ పరిస్థితుల్లో ఎలా బుక్ చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. యూరియా కొరతను తీర్చలేక.. ప్రత్యక్షంగా ఎదురవుతున్న నిరసనల నుంచి తప్పించుకునేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని మండిపడుతున్నారు.
కరీంనగర్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియా కోసం రైతులు అరిగోస పడాల్సి వస్తున్నది. గత రెండు సీజన్లలో అయితే ఒక్క బస్తా దొరకడం గగనమైంది. నాటి ఉమ్మడి రాష్ట్రంలో ఎదురైన అనుభవాలు పునరావృతమయ్యాయి. సింగిల్ విండో కార్యాలయాలు, గోదాముల వద్ద రైతులు గంటల తరబడి పడిగాపులు గాయాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. సకాలంలో అందించకపోవడంతో దిగుబడులపైనా ప్రభావం పడింది. గత వానకాలంలో ఆశించిన దిగుబడి రాక నష్టపోవాల్సి వచ్చిందని రైతులు స్పష్టం చేశారు. కానీ, అవసరం లేకున్నా రైతులు బారులు తీరారని, మోతాదుకుమించి వాడుతున్నారని అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు నిందలు వేశారు. ప్రభుత్వం కూడా అదే పాట పాడింది.
ఇప్పుడు యూరియా నియంత్రణ పేరిట ఆన్లైన్లో విక్రయించాలని నిర్ణయించింది. నిజానికి ఈ ప్రక్రియను డిసెంబర్ 20 నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసింది. అందులో ఉమ్మడి జిల్లాలోని పెద్దపల్లి కూడా ఉన్నది. ఈ జిల్లాల్లో రైతులు ఆన్లైన్లో యూరియా బుకింగ్ కోసం అష్టకష్టాలు పడ్డారు. రైతులందరి వద్ద స్మార్ట్ఫోన్లు లేకపోవడం, మెజార్టీ రైతులు విద్యావంతులు కాకపోవడంతో బుక్ చేసుకునేందుకు గోసపడ్డారు. పైలెట్ జిల్లాల్లో రైతులు పడిన కష్టాలను ప్రభుత్వం ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. అంతేకాకుండా, ఇప్పుడు అన్ని జిల్లాల నెత్తిన ఆన్లైన్ బుకింగ్ పద్ధతిని తెచ్చిపెడుతున్నది. ప్రయోగాత్మకంగా చేపట్టిన జిల్లాల్లో రైతులు నేరుగా ఆందోళనకు దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఎరువుల విక్రయ యాప్‌లో ఒకసారి యూరియా బుక్ చేసుకున్న తర్వాత ఒక వేళ తీసుకోవడం మిస్సయితే రెండో విడుతకు మరో 15 రోజుల తర్వాతనే యాప్‌లో అవకాశం కల్పించినట్టు తెలుస్తున్నది. ఈ విధానం రైతులను గందరగోళానికి, ఆందోళనకు గురి చేస్తున్నది. రైతులు బుక్ చేసుకున్న తర్వాత ఆ రోజు అర్ధరాత్రి వరకే సంబంధిత డీలర్ వద్దకు వెళ్లి యూరియా తీసుకోవాలి. లేదంటే 15 రోజుల వరకు ఆ రైతుకు యూరియా దొరకడం జరిగే పని కాదు. అంతే కాకుండా, రైతులు బుక్ చేసుకునే సమయానికి సంబంధిత డీలర్ వద్ద యూరియా నిల్వలు ఉండి, రైతు వెళ్లే సమయనికి నిండుకుంటే కూడా ఇబ్బందులు తప్పేలా లేవు.
అలాగే, కౌలురైతులు కూడా భూమి యజమానిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది. భూ యజమాని ఓటీపీ చెబితేనే కౌలు రైతులకు యూ రియా దొరుకుతుంది. ఎకరానికి రెండున్నర బస్తాలు మాత్ర మే యూరియా ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తుండగా, అంతకంటే తక్కువ భూమి ఉన్న రైతుల పరిస్థితి ఏంటనేది అర్ధం కాకుండా ఉంది. ఈ విధానం చాలా గందరగోళానికి దారితీస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆన్లైన్లో యూరియా విక్రయాలు శనివారం నుంచే అమలోకి వస్తున్నట్టు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకనటలో స్పష్టం చేశారు. నిజానికి ఈ ప్రక్రియపై అనేక అనుమాలు ఉన్నప్పటికీ రైతులు ఆన్లైన్లో యూరియాను బుక్ చేసుకోక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులకు అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. మొబైల్లో ప్లే స్టోర్‌కు వెళ్లి fertilizer booking appను డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో లాగిన్ అవగానే రైతులు, వ్యవసాయ శాఖ డీలర్ల కోసం లాగిన్లు కనిపిస్తాయి. మొబైల్ నంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేయగానే సంబంధిత డీలర్లు, వారి వద్ద ఉన్న యూరియా నిల్వలు కనిపిస్తాయి. పాస్‌బుక్ నంబర్, పంట విస్తీర్ణం వివరాలు నమోదు చేయాలి. వీటి ఆధారంగా అవసరమైన యూరియాను అలాట్ చేస్తారు. రైతులకు సహకరించేందుకు హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.