కమాన్చౌరస్తా, ఆగస్టు 5 : కాంగ్రెస్ సర్కారు విద్యారంగంపై అలసత్వం ప్రదర్శిస్తున్నది. నిర్లక్ష్యం, పర్యవేక్షణలోపం కారణంగా పిల్లల ప్రాణాలు పోతున్నా.. చిన్నచూపు చూస్తున్నది. మరోవైపు సౌకర్యాల లేమితో సతమతమవుతున్నా పట్టించుకోవడం లేదు. సంక్షేమ, గురుకుల హాస్టళ్లలో సమస్యలు రాజ్యమేలుతున్నా పరిష్కారానికి చొరవ చూపడం లేదు. విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా విద్యార్థులకు దుప్పట్లు, కార్పెట్లు, పరుపులు అందించడం లేదు. హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ కరీంనగర్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి కలెక్టరేట్ ఎదుట పడుకొని నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మచ్చ రమేశ్ మాట్లాడుతూ, హాస్టళ్లలో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. నాణ్యమైన భోజనం, పరిశుభ్రమైన తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, వైద్య సదుపాయాలు కల్పించాలని, అద్దె భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్లకు శాశ్వత భవనాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే మెస్, కాస్మొటిక్ చార్జీలను పెంచాలని, ఖాళీగా ఉన్న వార్డెన్లు, సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. సమస్యలు పరిషరించకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నూనావత్ శ్రీనివాస్ నాయక్ జిల్లా నాయకులు పాల్గొన్నారు.