హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులకు మళ్లీ నిరాశ ఎదురైంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అత్యవసర వైద్య భరోసాను ఇచ్చే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) సంక్షోభంలో పడింది. ముహూర్తానికి ముందే బ్రేక్ పడింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు నగదు రహిత వైద్య సేవలందించేందుకు డిజిటల్ హెల్త్‌కార్డులు ఇస్తామని, ఈ నెల 15వ తేదీన వీటిని అందజేస్తామని సర్కార్ ఊరిస్తూ వచ్చింది. ఇదే తేదీ నుంచి ఉచిత వైద్య సేవలు ప్రారంభిస్తామని చెప్పిన సర్కార్.. తీరా ముహూర్తం సమయానికి చేతులెత్తేసింది.
తీరా తానే ప్రకటించిన ముహూర్తానికి హెల్త్‌కార్డులు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైంది. బుధవారం ఈ పథకం ప్రారంభంకావాల్సి ఉండగా, మంగళవారం రాత్రి వరకు మార్గదర్శకాలు విడుదలకాలేదు. నెట్వర్క్ దవాఖానలతో ఒప్పందాలు చేసుకోలేదు. డిజిటల్ హెల్త్‌కార్డులు ఇవ్వలేదు. మరోవైపు, నెట్వర్క్ దవాఖానల ప్రతినిధులు ప్రభుత్వం ప్రతిపాదించిన ప్యాకేజీ ధరలతో తాము సేవలందించలేమని తేల్చిచెప్పారు. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లకు హెల్త్‌కార్డుల జారీ.. నగదు రహిత చికిత్సలపై అనిశ్చితి ఏర్పడింది. సర్కార్ చెప్పిన తేదీకి కార్డులివ్వకపోవడం పట్ల పలువురు ఉద్యోగ సంఘాల నేతలు, ట్రస్టు బోర్డు సభ్యులు మంగళవారం సీఎస్ సంజయ్ జాజును సచివాలయంలో కలిసి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.
ఇప్పటికే ప్రభుత్వం మే, జూన్ జీతాల్లో నుంచి 1.5% చొప్పున మినహాయించుకొన్నది. దాదాపు రూ.100 కోట్లు తమ ఖాతాలో వేసుకొన్నది. ఈ మొత్తం ఆర్థిక శాఖ ఖాతా నుంచి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఖాతాకు బదిలీ అయినట్టు ఉద్యోగ సంఘాలు చెప్తున్నారు. వాస్తవానికి, ఈ మొత్తాన్ని ఎంప్లాయీస్ హెల్త్‌కేర్ ట్రస్టుకు (ఈహెచ్ఎస్సీటీ) బదిలీ చేయాల్సి ఉన్నది. కానీ, ఇంతవరకు ఈ మొత్తం బదిలీ అయిన దాఖలాల్లేవని నేతలంటున్నారు. హెల్త్‌కార్డులు ఇవ్వకపోతే విలువేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే ఈ విషయంపై దృష్టి సారించి హెల్త్‌కార్డులు జారీచేయాలని పెన్షనర్స్ జేఏసీ చైర్మన్ కే లక్ష్మయ్య డిమాండ్ చేశారు.
ఈహెచ్సీటీ స్కీమ్‌కు వైద్య సేవలు అందించబోమని తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (టీఏఎన్హెచ్ఏ) రాష్ట్ర అధ్యక్షుడు వద్దిరాజు రాకేశ్ స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో టీఏఎన్హెచ్ఏ ప్రతినిధులు ఈహెచ్సీటీ సీఈవో హనుమంతును కలిశారు. ఈ సందర్భంగా ఈహెచ్సీటీ పథకం, లబ్ధిదారులకు నాణ్యమైన వైద్య సేవలను అందించడంలో నెట్వర్క్ దవాఖానల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వద్దిరాజు రాకేశ్ మాట్లాడుతూ.. ప్రతిపాదిత ప్యాకేజీ ధరలు ప్రస్తుత ఆరోగ్యశ్రీ, గత ఈహెచ్ఎస్ ప్యాకేజీ ధరల కంటే తక్కువగా ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో ప్రైవేట్ దవాఖానలకు ఆర్థికంగా తీవ్ర నష్టం తప్పదని వాపోయారు.
సీజీహెచ్ఎస్ టారిఫ్‌తో ఈ కొత్త పథకాన్ని అమలు చేస్తే సేవలను అందించేది లేదని నెట్వర్క్ దవాఖానలు ఏకగ్రీవంగా తీర్మానించాయని సీఈవో దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ప్యాకేజీల్లో శాస్త్రీయత ఉంటేనే రేట్లు ఫిక్స్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. గవర్నింగ్ బోర్డు సహా అన్ని కమిటీల్లో వివిధ వైద్య విభాగాల నుంచి కనీసం 10 మంది ప్రతినిధులను చేర్చాలని డిమాండ్ చేశారు.
కొత్త పథకం అమలుకు ముందే పాత ఈహెచ్ఎస్ పెండింగ్ బకాయిలను నెట్వర్క్ దవాఖానలకు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆర్థిక ఇబ్బందులతో వైద్య సేవలను కొనసాగించడం కష్టమని స్పష్టంచేశారు. తమ సమస్యలపై ఉన్నతాధికారులను కలిసి చెప్పుకొనేందుకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆగమేఘాల మీద తీసుకొచ్చిన ఈ స్కీమ్‌తో ఉద్యోగులు, నెట్వర్క్ దవాఖానలకు ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు.
ఈహెచ్సీటీ స్కీమ్‌కు సంబంధించి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు స్వీకరించి వాటికి పరిష్కారం చూపేలా పటిష్టమైన యంత్రాంగాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. కొత్త ఈహెచ్సీటీ స్కీమ్ అమలుకు ముందే నెట్వర్క్ హాస్పిటల్స్‌తో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ స్కీమ్ కింద అందించే వైద్య సేవల్లో 70% నుంచి 80% వరకు నెట్వర్క్ దవాఖానల ద్వారానే జరుగుతున్నాయని పేర్కొన్నారు. కొత్త పథకం అమలుకు ముందే ఈ సమస్యలను పరిష్కరించుకోవడం తప్పనిసరి అని సూచించారు. లేని పక్షంలో ఈ స్కీమ్‌లోని లోపాలు ఉద్యోగులు, పింఛన్‌దారులు, వారిపై ఆధారపడిన వారిపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.