కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ(సర్) ప్రక్రియలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లా ఘోరంగా వెనుకబడింది. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ తిరిగి ‘సర్’ ఫారాలను పంపిణీ చేయడంలో ప్రదర్శించిన నిర్లక్ష్యపు ధోరణే.. ఆన్లైన్లో డిజిటలైజ్ చేయడంలోనూ అవలంభిస్తున్నారనే విమర్శలున్నాయి. హైదరబాద్ జిల్లాలో ఇప్పటివరకు ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ కనీసం 15శాతం కూడా దాటకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే జూలై 31 నాటికి ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేయాల్సి ఉండటంతో, తమ పేర్లు ఎకడ తీసేస్తారో అని ఓటర్లలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
– సిటీబ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తెలిపిన ప్రకారం హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల వివరాల సవరణకు సంబంధించి ప్రింటెడ్ ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ దాదాపు 100 శాతం పూర్తయ్యింది. అయితే ఓటర్ల నుంచి పూరించిన దరఖాస్తులను సేకరించి, వాటిని ప్రత్యేక యాప్‌లో నమోదు చేసే డిజిటలైజేషన్ ప్రక్రియలో హైదరాబాద్ అత్యంత వెనుకబడి ఉంది. కొన్ని డివిజన్లలో సాంకేతిక లోపాలు, సిబ్బంది కొరత కారణంగా డేటా ఎంట్రీ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
గ్రామీణ జిల్లాలు ఈ ప్రక్రియలో ముందంజలో ఉంటే, ఐటీ హబ్‌గా పేరొందిన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలే డిజిటలైజేషన్లో అట్టడుగున నిలవడం విశేషం. బీఎల్ఓలు వచ్చి ఫారాలు ఇచ్చి వెళ్లారు. కానీ వాటిని తిరిగి ఎప్పుడు తీసుకుంటారో.. ఎప్పుడు ఆన్లైన్ చేస్తారో స్పష్టత లేదు. గడువు ముగిసిపోతే మా ఓటు హకు గల్లంతవుతుందేమోనని భయంగా ఉంది. అని నగరానికి చెందిన పలువురు ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముంచుకొస్తున్న గడువు..
షెడ్యూల్ ప్రకారం జూలై 24 నాటికి ఫారాల పంపిణీ, సేకరణతో పాటు డిజిటలైజేషన్ పూర్తికావాల్సి ఉంది. ఆ తర్వాతే జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. గడువుకు ఇంకా కొన్ని రోజులే సమయం ఉండటంతో జీహెచ్ఎంసీ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టకపోతే లక్షలాది మంది ఓటర్ల వివరాల నమోదు పెండింగ్‌లో పడే ప్రమాదం ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో డిజిటలైజేషన్ ప్రక్రియ
అసెంబ్లీ సెగ్మెంట్ / బీఎల్ఓలు : డిజిటలైజ్డ్ ఫారంలు/ పూర్తయినవి శాతంలో..
ముషీరాబాద్ /274 : 16,130/8.89
అంబర్‌పేట /236 : 18,141/9.63
సనత్‌నగర్/229 : 18,391/10.60
సికింద్రాబాద్ కంటోన్మెంట్/233: 17.882/10.94
సికింద్రాబాద్ /220 : 23,066/13.02
యాకత్‌పుర /332 : 37,337/13.08
మలక్‌పేట /300 : 33,375/13.29
గోషామహల్/ 236 : 24,851/13.79
చార్మినార్/ 198 : 26,832/14.27
ఖైరతాబాద్ / 245 : 30,526/14.61
జూబ్లీహిల్స్ /407 : 45,526/14.64
బహదూర్‌పుర / 263 : 46,389/16.84
కార్వాన్/ 311 : 50.743/17.33
నాంపల్లి /276 : 56,867/19.57
చాంద్రాయణగుట్ట / 305 : 76,750/24.38
మొత్తం : 5,22,806/14.69