యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో నృసింహ స్వామి జయంతి ముగింపు ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి అలంకరణ సేవను గురువారం ఉదయం ఊరేగింపు చేపట్టారు. యాగశాలలోని ప్రత్యేక వేదిక పై అధిష్టింప జేశారు. ద్వార తోరణ, మూర్తి కుంభారాధన, చతుఃస్థానార్చన లక్ష్మీనృసింహ, సుదర్శవ, గరుడ మూలమంత్ర హోమాలను శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం ద్వారకోరణ మాషబలి మహా పుర్ణాహుని చేపట్టి ఏకోత్తర సహస్ర కలశావీషేకము సహస్ర ఘటాభిషేక వేడుకలను ఘనంగా నిర్వహించారు.
సాయంత్రం 6.30 గంటలకు అర్చన, తదుపరి వేదస్వస్తి, సృసింహ అవిర్భావము. ఋత్విక్ సన్మానము మహానివేధన, తీర్థ ప్రసాద గోష్ఠి ఉత్సవ పరిసమాప్తి చేపట్టనున్నారు. అనుబంధ పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయం, దబగుంటుపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నృసింహ జయంతి ఉత్సవాల సందర్భంగా ముగింపు ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బీ. నరసింహ మూర్తి, ఈవో భవాని శంకర్, డీఈవో నవీన్ తదితరులు పాల్గొన్నారు.