KTR : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పడంలో రాటుదేలి పోయాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆయన నోటివెంట ఎప్పుడూ అబద్ధాలే వస్తున్నాయని ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వం కొలువుదీని ఏడాది పూర్తయినా ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు.
అబద్ధాలతో సీఎం తన మంత్రివర్గ సహచరులను, ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ అప్పులకు తన ప్రభుత్వం ప్రతి నెల రూ.6500 కోట్ల వడ్డీ చెల్లిస్తోందని సీఎం చెబుతున్నారని, అది కూడా పచ్చి అబద్ధమని అన్నారు. తెలంగాణ అప్పులకు ప్రభుత్వం చెల్లిస్తోన్న వడ్డీ రూ.2900 కోట్లు మాత్రమేనని ఆర్బీఐ డాక్యుమెంట్లు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఆర్థిక సంవత్సరంలో గత ఏప్రిల్ నుంచి అక్టోబర్ చివరి వరకు ప్రభుత్వం వడ్డీల రూపంలో కేవలం రూ.2164 కోట్లు మాత్రమే చెల్లించినట్లు కాగ్ నివేదిక స్పష్టం చేస్తోందని కేటీఆర్ అన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి ముందుగా తన ప్రవర్తనను మార్చుకుని, తెలంగాణ ప్రజలను అయోమయానికి గురచేయడం మానెయ్యాలని సూచించారు. హరీష్‌రావుపై తప్పుడు కేసు పెట్టారని, అలాంటి కేసులకు తాము భయపడబోమని అన్నారు.