హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న కేంద్రంపై రాజీలేని పోరాటం నిర్వహించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అంశాలవారీగా కేంద్రాన్ని నిలదీసి, బీజేపీ ప్రభుత్వ కపటతనాన్ని ఎండగట్టాలని నిశ్చయించింది. ఈ మేరకు ఒక హ్యాండ్‌బుక్‌ను తయారు చేసింది. వివిధ రంగాల్లో తెలంగాణకు జరిగిన, జరుగుతున్న అన్యాయాన్ని, పెండింగ్‌లో ఉంచిన అంశాలను అందులో సవివరంగా పొందుపర్చింది. ఈ హ్యాండ్‌బుక్‌ను ఆదివారం నాటి టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఎంపీలకు అందజేశారు. ఈ అంశాలవారీగా కేంద్రాన్ని నిలదీయాలని సూచించారు. ఏడున్నరేండ్లుగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై నమస్తే తెలంగాణ గత పదిరోజులుగా సమగ్ర కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. వాటికి తోడు మరిన్ని అంశాలు ఇలా ఉన్నాయి..
పెట్రో సెస్‌లో వాటా ఏది?
పెట్రోల్, డీజిల్‌పై ప్రత్యేక సెస్‌గా కేంద్రం వసూలు చేస్తున్న పన్నుల్లో నుంచి తెలంగాణ రాష్ర్టానికి రూ.2717 కోట్ల పరిహారం చెల్లించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నది. కేంద్రం వసూలు చేసిన ఈ సెస్ వల్ల తెలంగాణకు రావాల్సిన ఆదాయంలో ఏటా రూ.1200 కోట్ల చొప్పున నష్టం వాటిల్లింది. అదేవిధంగా.. ఐజీఎస్టీ కింద తెలంగాణకు చెల్లించాల్సిన రూ.218 కోట్లు ఇంకా చెల్లించలేదు. తెలంగాణకు 15వ ఆర్థిక సంఘం ప్రత్యేక గ్రాంట్‌గా సిఫారసు చేసిన పన్నుల పంపిణీ కింద 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.723 కోట్లను ఇంకా పెండింగ్‌లోనే ఉంచింది. 14వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థల కోసం సిఫారసు చేసిన రూ.965.52 కోట్లు చెల్లించడానికి మీనమేషాలు లెక్కపెడుతున్నది.
విద్యాసంస్థల ఏర్పాటులో అదే నిర్లక్ష్యం
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణకు గిరిజన విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేయాల్సి ఉన్నది. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడినందున కొత్తగా 21 నవోదయ విద్యాలయాలను కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని డిమాండ్లు చేసినా పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి బహుభాషాకోవిదుడు, అపర చాణక్యుడు, తెలంగాణ ముద్దుబిడ్డ.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు పెట్టాలని తెలంగాణ చేసిన విజ్ఞప్తిని కేంద్రం పట్టించుకోవడం లేదు. ప్రతి రాష్ర్టానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారం తెలంగాణలోనూ ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. విస్మరిస్తున్నది.
హ్యాండ్లూమ్ క్లస్టర్ల ఊసే మరిచిన కేంద్రం
తెలంగాణకు నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎన్‌హెచ్‌డీపీ) కింద 15 బ్లాక్ లెవల్ హ్యాండ్లూమ్ క్లస్టర్స్ (బీఎల్సీ) మంజూరు చేయాలన్న విజ్ఞప్తిపై కేంద్రం ఇప్పటికీ స్పందించడం లేదు. హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు డిమాండ్‌పైనా అదే ధోరణితో ఉన్నది. కేంద్రం అమలు చేస్తున్న ఏటీయూఎఫ్ పథకం కింద ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీని పెంచాలన్న విజ్ఞప్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి.
పెండింగ్‌లోనే అనేక రహదారులు
రాష్ట్రంలో రహదారులను అభివృద్ధి చేయడానికి కావాల్సిన నిధులు విడుదల చేయాలని రాష్ట్రం ఎప్పటి నుంచో కోరుతున్నది. హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) నిర్మించాలని తెలంగాణ ఏర్పాటు అయినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతున్నది. సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు పదే పదే విజ్ఞప్తి చేసిన ఫలితంగా 2016 నవంబర్ 24న జాతీయ రహదారి కింద రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణానికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం సంగారెడ్డి నుంచి నర్సాపూర్, గజ్వేల్, జగదేవ్‌పూర్, భువనగిరి, చౌటుప్పల్ వరకు 158.416 కిలోమీటర్ల రహదారికి 2017 జూన్ 23న గెజిట్ విడుదల చేసినా.. దక్షిణ భాగం చౌటుప్పల్ నుంచి షాద్‌నగర్ మీదుగా సంగారెడ్డి వరకు 181.87 కిలోమీటర్ల రోడ్డుకు ఇంత వరకు గెజిట్ విడుదల చేయలేదు.
ఇక.. కరీంనగర్-సిరిసిల్ల-కామారెడ్డి- ఎల్లారెడ్డి-పిట్లం (165 కి.మీ.), కొత్తకోట-గూడూరు- మంత్రాలయం (70 కి.మీ.), జహీరాబాద్-బీదర్-డెగ్లూర్ (25 కి.మీ.).. ఈ మూడు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తిస్తామని కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదించినా.. ఇంత వరకు నోటిఫై చేయలేదు. సీఆర్ఎఫ్ కింద అనుమతిచ్చిన 44 రోడ్ల అభివృద్ధికి రూ.804 కోట్లు పెండింగ్‌లోనే ఉంచింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్డు సదుపాయం అత్యంత ప్రధానమైన అంశం. అంతటి కీలక అంశంలోనూ కేంద్రం దాటవేత ధోరణిలోనే ఉంటున్నది. పూర్తిగా కేంద్రం నిధులతోనే చేపట్టాల్సిన ఈ రోడ్ల విషయంలో రాష్ర్టాలపై భారం పడేస్తున్నది.
ఐటీఐఆర్ రద్దుతో కేంద్రం దెబ్బ
2013లో అప్పటి కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌ను ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్’ (ఐటీఐఆర్) పథకానికి ఎంపిక చేసింది. కానీ.. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీఐఆర్‌ను ఏకపక్షంగా రద్దుచేసేసింది.
కృష్ణా జలాల్లో వాటాపై అన్యాయం
అంతరాష్ట్ర జలవివాదాల చట్టం 1956లోని సెక్షన్ 3 ప్రకారం సత్వరమే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని, కృష్ణా జలాల్లో తెలంగాణ న్యాయమైన వాటా తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఏడేండ్లుగా విజ్ఞప్తులు చేస్తున్నా.. దున్నపోతు మీద వాన పడ్డట్టే కేంద్రం వ్యవహరిస్తున్నది.
ఢిల్లీలో తెలంగాణభవన్‌కు స్థలమేది?
దేశంలోని అన్ని రాష్ర్టాలకు ఢిల్లీలో భవనాలు ఉన్నాయి. కానీ.. తెలంగాణ మాత్రం పాత ఏపీ భవన్‌ను పంచుకుంటున్నది. రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్‌తో న్యూఢిల్లీలోని 10 జన్‌పథ్ ప్లాట్ నంబర్ 9లో 14,400 చదరపు మీటర్ల స్థలాన్ని తెలంగాణ భవన్ నిర్మాణానికి కేటాయిస్తామని కేంద్రం గతంలో అంగీకరించింది. కానీ, ఆ స్థలాన్ని కేటాయించటంలో కేంద్రం వివక్ష ప్రదర్శిస్తున్నది.
పెనుముప్పుగా కొత్త విద్యుత్తు బిల్లులు
రాష్ర్టాల పరిధిలోని విద్యుత్తు సంస్థలను పూర్తిగా ప్రైవేటుపరం చేసేందుకు వీలుగా.. డిస్కంలను మాయం చేసేందుకు ఉద్దేశించిన విద్యుత్తు చట్టాల సవరణల బిల్లులను తెలంగాణ మొదటి నుంచీ వ్యతిరేకిస్తూనే ఉన్నది. ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనూ ఈ బిల్లులోని ప్రమాదకర అంశాలపై టీఆర్ఎస్ ఎంపీలు తమ నిరసన గళాన్ని వినిపించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఎస్ఎల్డీసీ (స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్) సమర్థవంతంగా సేవలు అందిస్తున్నది. సవరణ బిల్లు ఆమోదం పొందితే.. ఎన్ఎల్డీసీ విద్యుత్తు షెడ్యూలింగ్ అధికారం మొత్తం కేంద్రం హస్తగతమవుతుంది. దీనివల్ల రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పత్తిని తగ్గించాల్సి వస్తుంది. బిల్లులోని ఇతర అంశాలతో డిస్కంలు తీవ్రంగా నష్టపోతాయి. అంతిమంగా పేద గృహ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. రైతులకు అందే ఉచిత విద్యుత్తు కూడా ప్రమాదంలో పడుతుంది.