పనికి తగిన వేతనం ఇవ్వడం లేదని ఆది నుంచీ ఆశ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా నియమించుకున్న వీరిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 20 ఏండ్లుగా సేవలు అందిస్తున్నా తమకు తగిన వేతనం ఇవ్వడం లేదని, పైగా వేతనం నుంచే కోతలు విధిస్తున్నారని వాపోతున్నారు. తమ జాబ్ చార్ట్‌లో లేని పనులు చెబుతూ వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదనపు పనికి అదనపు పారితోషికం ఇవ్వాలని శనివారం కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించారు.
కరీంనగర్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : ఆశ కార్యకర్తలు అంటేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చులకనగా చూస్తున్నాయి. ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒకరి చొప్పున నియమితులైన వీరికి వేతన స్థిరీకరణ అనేది లేదు. నెలంతా కష్ట పడితే రూ.9 వేలు మాత్రమే ఇస్తున్నారు. ఇందులో గర్భిణులను నమోదు చేయకుంటే వేతనాలు నిలిపి వేస్తున్నారు. దీంతో ఆశ కార్యకర్తల కుటుంబాలు గడవడం కష్టంగా మారింది. నామ మాత్రపు వేతనం ఇస్తున్నా నెల తర్వాత వస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఆశాలు బతుకులు వెల్లదీస్తున్నారు. తమ జాబ్ చార్ట్‌తో సంబంధం లేని పనులు కూడా చేయిస్తున్నారని వారు వాపోతున్నారు. పని భారం పెరిగినా పారితోషికం అందిస్తారనే ఆశతో అదనపు పనులు చేస్తున్నా అధికారులు కనికరించడం లేదు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆశలకు రూ.18 వేల వేతనం చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని ఇప్పటి వరకు నిలబెట్టుకోలేదు.
నిజానికి ఆశ కార్యకర్తలు గర్భిణులను గుర్తించడం, వారికి నెల నెలా టీకాలు వేయించడం, ప్రభుత్వ దవాఖానలకు తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించడం, చిన్న పిల్లలకు బుధ, శనివారాల్లో టీకాలు వేయించడం వంటి విధులు నిర్వహించాలి. కానీ, ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమతో వెట్టి చాకిరీ చేయిస్తున్నాయని వారు వాపోతున్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్, జనవరి నెలలో 15 రోజులపాటు లెప్రసీ సర్వే నిర్వహించాలి. ఇందుకు ఒక్కో ఆశా కార్యకర్తకు రూ.950 చెల్లించాల్సి ఉంటుంది. కానీ, రెండేళ్లుగా ఈ పారితోషికం ఇవ్వలేదు. దీంతో ఆశా వర్కర్లు లెప్రసీ సర్వే చేసేందుకు నిరాకరిస్తున్నారు. తమకు పెండింగ్ పారితోషికం చెల్లిస్తేనే చేస్తామని స్పష్టం చేస్తున్నారు. అయితే, కొందరు ఆశలు మాత్రం పారితోషికం ఇస్తారనే ఆశతో సర్వే చేస్తున్నారు.
గ్రామాల్లో ఆశ కార్యకర్తలపై అన్ని శాఖల అధికారులు పెత్తనం చెలాయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లెప్రసీ సర్వేనే కాకుండా జిల్లాలో ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా కార్యక్రమానికి మహిళలను ఆశా కార్యకర్తలే మోటివేట్ చేస్తున్నారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో జరిగే శుక్రవారం సభకు కూడా వారినే వినియోగించుకుంటున్నారు. ఇది కాకుండా ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఆశా కార్యకర్తలకు రూ.800 చొప్పున చెల్లిస్తామని చెప్పిన అధికారులు.. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వ లేదు.
తమతో పాటు విధులు నిర్వహించిన అన్ని శాఖల ఉద్యోగులకు పారితోషికం చెల్లించి తమకు మాత్రమే చెల్లించక పోవడంతో ఆశలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాల్లోనే కాకుండా ఇతర గ్రామాల్లో డ్యూటీలు వేయడం వల్ల ఆటోల్లో వెళ్లి విధులు నిర్వహించామని, అయినా తమకు పారితోషికం చెల్లించలేదని వాపోతున్నారు. చాలా కాలంగా తమకు రిజిష్టర్లు కూడా ఇవ్వడం లేదని, తెల్ల కాగితాలపై నివేదికలు రాసి జిరాక్స్‌లు తీసి ఇవ్వమంటున్నారని, ఇది తమకు భారంగా మారుతోందని వాపోతున్నారు.
ఆశా కార్యకర్తల బతుకులు దిన దినం భారంగా మారుతున్నాయి. నిత్యావసర వస్తువులు పెరిగి పోతున్నప్పటికీ కనీస వేతనం కూడా అందకపోవడంతో వారి జీవితాలు గడవడం కష్టంగా మారుతోంది. ఏదో ఒకరోజు వేతనాలు పెరుగుతాయని, ఉద్యోగులుగా గుర్తిస్తారనే ఆశతో బతుకు భారమైన విధులు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదని వాపోతున్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయం కల్పిస్తామని, రూ.18 వేలకు వేతనం స్థిరీకరిస్తామని ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదని, ఇప్పటికైనా అమలు చేయకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని సీఐటీయూ నాయకులు ఎడ్ల రమేశ్ హెచ్చరించారు. అందులో భాగంగా శనివారం అన్ని జిల్లా కేంద్రాల్లో ఆశ కార్యకర్తలు కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించారు.
కరీంనగర్ విద్యానగర్, డిసెంబర్ 27 : లెప్రసీ, పల్స్ పోలియో, ఎన్నికల రెమ్యూనరేషన్ బిల్లులు చెల్లించాలని కోరుతూ శనివారం ఆశ కార్యకర్తలు సీఐటీయు ఆధ్వర్యంలో కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించారు. తమకు చెల్లించాల్సిన బిల్లులు ఏం చేశారో స్పష్టమైన విచారణ చేపట్టి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశ కార్యకర్తలకు పనిభారం పెరుగుతున్నా డబ్బులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నారు. బిల్లులు వచ్చే వరకు పోరాటాలు ఆపే ప్రసక్తి లేదన్నారు.