న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ఈనెల 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఇమిగ్రేషన్, ప్రయాణ నిబంధనల కింద అమెరికా సరిహద్దులను దాటే ప్రతిసారీ గీన్కార్డుదారుడు సహా అమెరికా మినహా మిగతా దేశాల పౌరులందరూ తప్పనిసరిగా బయో మెట్రిక్ స్క్రీనింగ్‌ని ఎదుర్కోక తప్పదు. విమానాశ్రయాలు, భూ సరిహద్దులు, నౌకాశ్రయాల ద్వారా అమెరికాలోకి ప్రవేశించే లేదా నిష్క్రమించే ప్రయాణికులందరికీ ఈ కొత్త నిబంధన వర్తిస్తుంది.
ప్రవేశ, నిష్క్రమణ పాయింట్ల వద్ద బయోమెట్రిక్ పర్యవేక్షణను ట్రంప్ ప్రభుత్వం విస్తరించింది. కొత్త నిబంధనల కింద ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద అమెరికాయేతర పౌరులందరి ఫొటోలను అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్(సీబీపీ) అధికారులు క్లిక్ చేస్తారు. గతంలో మినహాయింపులు ఉన్న 14 ఏండ్ల లోపు పిల్లలు, 79 ఏండ్లు దాటిన వృద్ధులకు సైతం ఈ కొత్త నిబంధన వర్తిస్తుంది. ట్రావెలర్స్ వెరిఫికేషన్ సర్వీసులో భాగంగా గ్రీన్‌కార్డు హోల్డర్లుసహా అమెరికాయేతర పౌరులందరి వేలిముద్రలు, ఐరిస్ స్కాన్లను సీబీసీ సేకరిస్తుంది. ట్రావెల్ అండ్ ఇమిగ్రేషన్ రికార్డులతో బయోమెట్రిక్ సమాచారాన్ని అధికారులు పోల్చి చూస్తారు.