హైదరాబాద్: మూసీ నదికి భారీ వరద (Musi Floods) నేపథ్యంలో ఎంబీజీఎస్ ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. దీంతో ఇక్కడి నుంచి బస్సుల రాకపోకలను టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ఎంజీబీఎస్‌కు (MGBS) ఎవరూ రావద్దని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (VC Sajjanar) ఎక్స్ వేదికగా ప్రయాణికులకు సూచించారు. ‘ఎంబీజీఎస్ నుంచి బయలుదేరే బస్సులను హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి సంస్థ నడుపుతోంది. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వెళ్లే సర్వీసులు జేబీఎస్ నుంచి నడుస్తున్నాయి. వరంగల్, హనుమకొండ వైపునకు వెళ్లేవి ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి వెళ్తున్నాయి. సూర్యాపేట, నల్లగొండ, విజయవాడ వైపునకు బస్సులు ఎల్బీనగర్ నుంచి నడుస్తున్నాయి. మహబూబ్‌నగర్, కర్నూలు, బెంగళూరు వైపునకు వెళ్లే సర్వీసులు ఆరాంఘర్ నుంచి వెళ్తున్నాయి’ అని వెల్లడించారు.
పొరపాటున ఎంజీబీఎస్‌కు ఎవరైనా ప్రయాణికులు వచ్చినా వారిని తరలించేందుకు అవసరమైనన్నీ లోకల్ బస్సులు అందుబాటులో ఉంచామని తెలిపారు. వారిని ఆయా బోర్డింగ్ ప్రాంతాలకు లోకల్ బస్సుల్లో తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వర్షాలు, వరద తగ్గుముఖం పట్టేవరకు ఎంజీబీఎస్‌కు ఎవరూ రావొద్దని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ఎంబీజీఎస్ నుంచి నడిచే బస్సులను ఇతర ప్రాంతాల నుంచి తిప్పుతున్నామని, ఆయా మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలని సూచించారు.
Tgsrtc