Tenant Farmers |హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): తమకు యూరియా దొరుకదని, పంటలు అమ్ముకొనే పరిస్థితి లేదని కౌలు రైతులు ఆవేదన వ్యకంచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు 2023 సెప్టెంబర్ 13న నాటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కౌలు రైతులను ఉద్దేశించి రాసిన లేఖలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలుకాలేదని అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ దువ్వూరి నరసింహారెడ్డి అధ్యక్షతన ఏర్పడిన కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ గడిచిన మే నెలలో 22 జిల్లాల్లో పర్యటించి సర్వే నిర్వహించింది. 47 మండలాల్లోని 57 గ్రామాల్లో 1,816 మంది కౌలు రైతులను వ్యక్తిగతంగా కలిసి ఇంటర్వ్యూల ద్వారా వారి కష్టాలను సేకరించింది. ఇందుకు సంబంధించిన నివేదికను మంగళవారం విడుదల చేసింది. కార్యక్రమంలో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, రుక్మిణీరావు, ఆకునూరి మురళి, జస్టిస్ చంద్రకుమార్, బీ కొండల్‌రెడ్డి, కిరణ్‌కుమార్ విస్సా, శ్రీహర్ష తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ సర్కార్‌పై కౌలు రైతులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నట్టు సర్వేలో వెల్లడైంది. హామీలను అమలు చేయకపోవడంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కౌలు రైతులు సిద్ధమవుతున్నట్టు వెల్లడైంది. సర్వే సందర్భంగా 2023 సెప్టెంబర్ 13న పీసీసీ అధ్యక్షుడిగా కౌలు రైతులకు సీఎం రేవంత్‌రెడ్డి రాసిన బహిరంగ లేఖ గురించి కౌలు రైతులు ప్రస్తావించారు. కౌలు రైతుల చట్టం-2011ను అమలు చేసి, కౌలు రైతులను గుర్తించి, వారికి కూడా రైతుభరోసా కింద ఎకరానికి రూ.15వేల పెట్టుబడి సాయం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్ల అయినప్పటికీ కౌలు రైతుల విషయంలో ఒక విధానపరమైన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోలేకపోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. నాడు లేఖ రాసి.. నేడు మర్చిపోతారా? అంటూ కౌలు రైతులు ప్రశ్నించారు.

తమకు గుర్తింపు లేకపోవడంతో పంటల సాగు, విక్రయంలో తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయని కౌలు రైతులు తెలిపారు. పంటలకు యూరియా కూడా లభించడంలేదని, కష్టనష్టాలకోర్చి పండించిన పంటలను సైతం ప్రభుత్వం కొనుగోలు చేయడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. సర్వేలో పాల్గొన్న 1,816 మంది రైతుల్లో 412 మందికి అంటే 22% మంది కౌలు రైతులకు మాత్రమే సబ్సిడీ యూరియా (రూ.266) లభించిందని, మిగిలిన రైతులు బ్లాక్మార్కెట్లో రూ.500 పెట్టి కొనుగోలు చేశారని వెల్లడైంది. కౌలు రైతులకు గుర్తింపులేకపోవడం, పాస్ పుస్తకాలు భూ యజమానుల పేరుపై ఉండటం, ఓటీపీ యజమానులకు వెళ్లడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతోపాటు పత్తి, ధాన్యం, మక్కజొన్న, జొన్న పంటల కొనుగోళ్లలోనూ ఇబ్బందులు తప్పడంలేదని కౌలు రైతులు ఆందోళన వ్యక్తంచేశారు.
ఓపీఎంఎస్ విధానంలో భూ యజమానులకు ఓటీపీ వెళ్లడం, వారి పేరే నమోదు కావడంతో పంటల విక్రయం ఇబ్బందికరంగా మారిందని తెలిపారు. కేవలం 77 మంది (6.8%) కౌలు రైతులు పత్తి, 177 మంది (20%) కౌలు రైతులు ధాన్యం వారి పేరుపై విక్రయించినట్టు వెల్లడైంది. పండించిన పంటలను యజమానుల పేర్లపై విక్రయించి.. డబ్బుల కోసం వారి చుట్టూ తిరగాల్సి వస్తున్నదని, కొన్ని సందర్భాల్లో యజమానులు డబ్బులు పట్టుకొని ఇస్తున్నారని కౌలు రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. తమ పంటను మద్దతు ధర కన్నా తక్కువకే ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించి నష్టపోతున్నట్టు సర్వేలో తేలింది.
కౌలు రైతుల చట్టం- 2011ను అమలుచేయాలి. ప్రత్యేకంగా కార్డులు జారీ చేయాలి. కౌలు రైతులకు రుణ అర్హత కార్డులను జారీ చేయాలి. కౌలు రైతులకు రైతుభరోసా, రుణమాఫీ, పంట నష్ట పరిహారం అ మలు చేయాలి. ఈ-క్రాప్ బుకింగ్‌లో కౌలురైతుల పేర్లు నమోదు చేయాలి. కౌలురైతుల పేరుతోనే పంటలు కొనుగోలు చేయాలి. పంట విక్రయించిన డబ్బులను కౌలురైతుల ఖాతాలోనే జమ చేయాలి. యూరియాతోపాటు ఇతర ఎరువులను కౌలురైతుల పేరుతో జారీ చేయాలి.
రాష్ట్రంలో మొత్తం రైతుల్లో కౌలు రైతులు 36% మంది ఉంటారని అంచనా. సర్వే ప్రకారం కౌలు రైతుల్లో 47.5% మంది బీసీలు, 26.9% ఎస్సీలు, 13.9% ఎస్టీలు, 4.2% ముస్లింలు, 7.5% ఓసీలు ఉన్నట్టు తేలింది. కౌలు ధరలు భారీగా పెరిగినట్టు సర్వేలో వెల్లడైంది. కౌలు ధర గరిష్ఠంగా ఎకరాకు రూ.53 వేలకు చేరగా, సగటున రూ.14,936గా ఉన్నట్టు తేలింది. కౌలుకు తీసుకుంటున్న భూమి సైతం పెరిగినట్టు వెల్లడైంది. 2022లో ఒక్కో కౌలు రైతు తీసుకొంటున్న సగటు కౌలు భూమి 5 ఎకరాలు ఉండగా, ప్రస్తతం 6.7 ఎకరాలకు పెరిగింది. ఐదు ఎకరాల కన్నా ఎక్కువ భూమిని కౌలుకు తీసుకున్న రైతులు 42%పైగా ఉన్నారు. 10 ఎకరాలకుపైగా కౌలుకు తీసుకొన్నవారు 15.2% మంది ఉన్నట్టు వెల్లడైంది. కౌలు రైతులకు బ్యాంకు రుణాలు లభించడంలేదు.
రుణమాఫీ కూడా దక్కలేదని సర్వేలో వెల్లడైంది. పంట పెట్టుబడులు పెరుగడం, ఆదాయం తగ్గడం, రైతుభరోసా రాకపోవడం వంటి కారణాలతో కౌలురైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని వెల్లడైంది. ప్రతి కౌలు రైతు కుటుంబంపై సగటున రూ.2 లక్షల అప్పు ఉన్నట్టు తేలింది. కౌలురైతులు సంవత్సరానికి సగటున 24% వడ్డీతో అప్పులు చేస్తున్నారు. 66.9% మంది కౌలురైతులు వడ్డీ వ్యాపారీ లేదా షావుకారు నుంచి రుణం తీసుకొంటున్నారని, 29.7% మంది ఎరువులు, విత్తనాల డీలర్ల నుంచి, 29.7% మంది మహిళా గ్రూపుల నుంచి, 24.6% మంది బంధువులు, మిత్రుల నుంచి, 7% మంది ప్రైవేట్ ఫైనాన్స్‌ల నుంచి రుణాలు తీసుకుంటున్నట్టు వెల్లడైంది.