Fee Reimbursment | విద్యార్థులపై ఆర్ఆర్ యాక్ట్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రెవెన్యూ రికవరీ చట్టం!
Fee Reimbursment | ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని డీబీటీ (డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్) విధానంలోనే అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి నిర్ణయించింది.
Fee Reimbursment | హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని డీబీటీ (డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్) విధానంలోనే అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి నిర్ణయించింది. విద్యార్థుల ఖాతాలకే నేరుగా నిధులను జమచేయనున్నది. ప్రభుత్వం విడుదల చేసిన నిధులను వారంలోగా సదరు విద్యార్థులు ఆయా కళాశాలలకు చెల్లించాల్సిందేనని, లేదంటే చట్టం పరిధిలో వసూలు చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు ఈ స్కీమ్‌కు సంబంధించిన నూతన మార్గదర్శకాలు జారీచేయడంతోపాటు, గతంలో జారీచేసిన జీవో7ను రద్దు చేస్తూ కొత్తగా జీవో8, 9ను విడుదల చేసింది. ఆ జీవోలను మాత్రం బహిర్గతం చేయకపోవడం గమనార్హం. నిధుల చెల్లింపు టైమ్‌లైన్ తప్ప గత జీవోకు, కొత్త మార్గదర్శకాలకు మధ్య తేడా ఏమీ లేదని తేలింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగ తదితర నిరుపేద విద్యార్థుల పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్లు, కాలేజీ ట్యూషన్, మెయింటెనెన్స్ ఫీజులను ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. 2008 నుంచి అమలు చేస్తున్న మార్గదర్శకాలకు విరుద్ధంగా గత ఏప్రిల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీచేసింది.
అందుకు సంబంధించి జీవో7ను విడుదల చేసింది. ఈ స్కీమ్ నిధులను కాలేజీ యాజమాన్యాలకే ప్రభుత్వం చెల్లిస్తూ వస్తుండగా, 2026-27 విద్యా సంవత్సరం నుంచి అర్హులైన విద్యార్థులకే నేరుగా డీబీటీ విధానంలో చెల్లించాలని నిర్ణయించింది. విద్యార్థులకు చెల్లించిన తర్వాతే కాలేజీ యాజమాన్యాలు ఫీజులు వసూలు చేసుకోవాలనే నిబంధననూ విధించింది. దీనిపై కుల సంఘాలు, విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తిన నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఈ జీవోనూ రద్దు చేసింది. అందుకు సంబంధించి జీవో8ని విడుదల చేసింది. ఎస్సీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏపీబీఎస్ (ఆధార్ పేమెంట్ బ్రిడ్జి సిస్టమ్) మార్గదర్శకాల మేరకు ఫీజుల చెల్లింపునకు రాష్ట్రంలో మిగిత అన్నివర్గాల విద్యార్థులకు ఏకీకృత విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. అదీగాక హైకోర్టు ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకొని జీవో7ను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.
నూతన మార్గదర్శకాలు ఇవే..
ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి సంబంధించి గత జీవో7ను రద్దు చేయడంతోపాటుగా నూతన మార్గదర్శకాలను సైతం ప్రభుత్వం ఖరారు చేసింది. అందుకోసం జీవో9ను విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులకు పోస్ట్‌మెట్రిక్ సాలర్షిప్లు, ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ (ఆర్టీఎఫ్), మెయింటెనెన్స్ ఫీజు (ఎంటీఎఫ్) చెల్లింపులను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని పేర్కొన్నది. ఫీజుల నిర్ణయం, అర్హత ప్రమాణాలు తదితర నిబంధనలన్నీ పాత జీవోల ప్రకారమే కొనసాగుతాయని తెలుపడం గమనార్హం. పథకం అమలుకు ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌ను రాష్ట్రస్థాయి నోడల్ అధికారిగా ప్రభుత్వం నియమించింది. కరస్పాండెన్స్ కోర్సులకు ప్రత్యేక మార్గదర్శకాలు తదుపరి జారీ చేయనున్నట్టు తెలిపింది.
జీవో9లో కీలకాంశాలు:
- 2026-27 విద్యాసంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్, పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్ నిధులను విద్యార్థుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు.
- 2026-27 విద్యాసంవత్సరంలో విద్యార్థులకు తాజా నిబంధనల వర్తింపు. పాతవారికి పాత నిబంధనలే వర్తింపు.
- గుర్తింపు పొందిన బోర్డులు, కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలలు, ఇతర కళాశాలల విద్యార్థులే ఈ పథకానికి అర్హులు. కళాశాలల గుర్తింపు, కోర్సులు, సీట్ల వివరాలు ఈ-పాస్‌లో నమోదై ఉండాలి.
- ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు మెరిట్ ఆధారంగా చేరిన కళాశాలల్లోనే సాలర్షిప్. డీమ్డ్ యూనివర్సిటీలు, కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలకు ఇందులో మినహాయింపు.
- ప్రతి కళాశాల ఒక నోడల్ అధికారిని నియమించి ఈ-పాస్‌లో నమోదు చేయాలి.
- విద్యార్థుల ఖాతాల్లో జమయ్యే సాలర్షిప్ డబ్బులతోనే ఫీజులు చెల్లించేలా అడ్మిషన్లు ఇవ్వాలి.
- ప్రతి ఆరు నెలలకు ఒకసారి స్వీయ ఆడిట్ నివేదికను సమర్పించాలి.
- దశలవారీగా ఆధార్ ఆధారిత హాజరు వ్యవస్థను అమలు చేయాలి.
- ప్రభుత్వం, యూనివర్సిటీ ఆమోదించిన కోర్సులు, సీట్లకే సాలర్షిప్ వర్తింపు.
- యాజమాన్య కోటా, ఎన్ఆర్ఐ కోటా, స్పాట్ అడ్మిషన్ సీట్లకు సాలర్షిప్ వర్తించబోదు.
వారంలోగా చెల్లించకుంటే ఆర్ఆర్ చట్టం ప్రయోగం
- విద్యార్థి అడ్మిషన్ తీసుకున్న వెంటనే ఈ-పాస్‌లో నమోదు చేసుకోవాలి.
- ఆధార్, బయోమెట్రిక్ ధ్రువీకరణ, బ్యాంక్ ఖాతా, కళాశాల వివరాలు, కోర్సు వివరాలు తప్పనిసరి.
- కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాలు మీసేవ ద్వారా ఆటో వెరిఫై అవుతాయి.
- బ్యాంక్ ఖాతా, ఐఎఫ్ఎస్సీ, ఖాతాదారు పేరు ఎన్పీసీఐ (నేషనల్ పేమేంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ద్వారా ధ్రువీకరిస్తారు.
- విద్యార్థి నిజంగా చదువుతున్నాడా? లేదా? అనేది కళాశాల నోడల్ అధికారి నిర్ధారించాలి. జిల్లా సంక్షేమ అధికారి ఆమోదం తెలుపాలి.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగ సంబంధిత సంక్షేమ శాఖలు జిల్లా అధికారుల ద్వారా సాలర్షిప్లు మంజూరు చేస్తాయి.
- ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ నేరుగా విద్యార్థి ఆధార్ అనుసంధానమైన బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.
- సాలర్షిప్ పోర్టల్ ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్1-జూలై31, ఆగస్టు1-నవంబర్30, డిసెంబర్1 -జనవరి31, ఫిబ్రవరి1 నుంచి మార్చి 31 ఈ-పాస్‌లో అప్లికేషన్లను స్వీకరిస్తారు.
- అర్హులైన విద్యార్థులకు ప్రభుత్వం ఒకే విడతలో, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను చెల్లిస్తుంది. దరఖాస్తు తేదీ ప్రకారం ఆగస్టు15, డిసెంబర్ 30, ఫిబ్రవరి28, మొత్తంగా దరఖాస్తు చేసుకున్న 75రోజుల్లోనే ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంది.
- విద్యార్థి ఖాతాలో సాలర్షిప్ డబ్బు జమైన తర్వాత 7 పనిదినాల్లోగా కళాశాలకు ట్యూషన్ ఫీజు చెల్లించాలి.
- ఒకవేళ గడువులోగా విద్యార్థి ఫీజు చెల్లించకపోతే రెవెన్యూ రికవరీ చట్టం కింద తిరిగి వసూలు చేస్తారు. చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
- కేంద్ర-రాష్ట్ర నిధుల నిష్పత్తి సంబంధిత కేంద్ర పథకాల నిబంధనల ప్రకారమే ఉంటుంది.
75% హాజరు లేకుంటే అంతే..
కోర్సు పూర్తయ్యే వరకు సాలర్షిప్ కొనసాగుతుంది. విద్యార్థి విద్యాప్రగతి సంతృప్తికరంగా ఉండాలి. కనీసం 75% హాజరు కలిగి ఉండాలి. విద్యార్థి అదే కోర్సులో కొనసాగాలి. 2026-27లో చేరిన ప్రతి విద్యార్థీ ఆధార్ ధృవీకరణ చేయించుకోవాలి. 2026-27 తర్వాత చేరిన విద్యార్థులకు ప్రతి సంవత్సరం కొత్త అప్లికేషన్ అవసరం లేదు. కళాశాల ప్రమోషన్ ధ్రువీకరిస్తే ఆటోమేటిక్ రెన్యువల్ జరుగుతుంది. విద్యార్థి ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.
కళాశాలలకు నిబంధనలు
విద్యార్థిని చేర్చుకునేటప్పుడు ఫీజులు విద్యార్థే చెల్లించాలనే అవగాహనతో కళాశాలల యాజమాన్యాలు అడ్మిషన్ ఇవ్వాలి. ప్రతి కళాశాల డీబీటీ విధానాన్ని గౌరవించాలి. నోడల్ అధికారిని నియమించాలి. విద్యార్థుల పత్రాలను ఈ-పాస్‌లో అప్లోడ్ చేయాలి. రెన్యువల్ అప్లికేషన్లను ధ్రువీకరించాలి. ఆధార్ ఆధారిత హాజరు వ్యవస్థ అమలు చేయాలి. సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్ రిడ్రసల్ ఆఫీసర్‌ను నియమించాలి. ఆడిట్ కోసం అవసరమైన రికార్డులు ఇవ్వాలి. విశ్వవిద్యాలయాలు, బోర్డులు, విద్యాశాఖలు తమ విద్యార్థుల డాటాను ఈ-పాస్‌కు అందించాలి. ఎప్‌సెట్, ఈసెట్, ఐసెట్, పీజీసెట్, లాసెట్, తదితర సెట్ల కన్వీనర్లు తమ డాటాను ఈ-పాస్‌తో పంచుకోవాలి. ఈ-పాస్ పోర్టల్‌లో ఆన్లైన్ ఫిర్యాదుల పరిషార వ్యవస్థ ఏర్పాటుచేయాలి. కళాశాల స్థాయిలో నిర్ణీత గడువులో సమస్య పరిషారం కాకపోతే జిల్లా స్థాయికి, ఆ తర్వాత రాష్ట్ర స్థాయికి ఆటోమెటిక్‌గా ఫిర్యాదు బదిలీ అవుతుంది.
కోర్సును మధ్యలో ఆపినా తిరిగి వసూలు
ప్రతి సంవత్సరం ఈ పథకం పనితీరును ప్రభుత్వం పరిశీలిస్తుంది. డిగ్రీ, అంతకంటే పైస్థాయి కోర్సులు నిర్వహిస్తున్న ప్రైవేట్ కళాశాలలను ఏటా తప్పనిసరిగా తనిఖీచేస్తారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు, తప్పుడు సమాచారం ఇచ్చి సాలర్షిప్ పొందితే వెంటనే రద్దుచేస్తారు. విద్యార్థికి అప్పటికే చెల్లించిన డబ్బు తిరిగి వసూలు చేస్తారు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వ సాలర్షిప్నకు అర్హుడు కాకుండా బ్లాక్ లిస్ట్‌లో పెడుతారు. కోర్సు మధ్యలో చదువు మానేస్తే సంబంధిత సంక్షేమ శాఖ నిర్ణయం ప్రకారం సాలర్షిప్ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి కూడా రావచ్చు. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు మార్చితే ఈ జీవోలో కూడా మార్పులు చేయవచ్చు. కొత్త డీబీటీ విధానం 2026-27 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా చేరిన విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. 2026-27కు ముందు ఇప్పటికే సాలర్షిప్ పొందుతున్న విద్యార్థులు పాత నిబంధనల ప్రకారమే కొనసాగుతారు. డీబీటీ నిబంధనలు వర్తించబోవు.
గుట్టుగా జీవోలు జారీ
ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి సంబంధించిన జీవో8, 9ను ప్రభుత్వం మూడు రోజుల క్రితమే విడుదల చేసింది. ఈ మేరకు సంక్షేమ శాఖల ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోశ్ 6వ తేదీనే వీటిని వెలువరించారు. కానీ ఈ జీవోలను ప్రభుత్వం వెబ్సైట్లోనూ పొందుపరచకుండా గుట్టుగానే తొక్కిపెట్టింది. జీవోల విడుదల కోసం ప్రత్యేకంగా పాలిసెట్ తొలివిడత సీట్ల కేటాయింపును సైతం నిలుపుదల చేసింది. జీవోలను విడుదల చేసిన అనంతరం 6వ తేదీన అర్ధరాత్రి వేళ తొలివిడత సీట్లను కేటాయించింది. విద్యార్థులకు సీటు కేటాయింపు ఆర్డర్లలోనూ ఆ జీవోల ప్రకారమే బోధన ఫీజులు చెల్లిస్తామని ప్రభుత్వం పొందుపరచడం గమనార్హం. తాజాగా ఎప్‌సెట్, ఈసెట్ ప్రవేశాల కమిటీ సమావేశాల్లోనూ ఫీజుల విషయంపై చర్చ కొనసాగింది. అయినా ఆ జీవోలను సర్కార్ వెల్లడించలేదు. జీవోలను గుట్టుగానే కొనసాగించడం గమనార్హం. విద్యార్థులు, కులసంఘాల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతుందనే కారణంతోనే ప్రభుత్వం ఆ జీవోలను తొక్కిపెట్టిందని తెలుస్తున్నది.
ఇతర స్కాలర్షిప్లు పొందకూడదు
- తెలంగాణ రాష్ర్టానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థి అయి ఉండాలి.
- గుర్తింపు పొందిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.50 లక్షలు మించకూడదు.
- ఆధార్‌తో లింక్ అయిన బ్యాంకు ఖాతా ఉండాలి.
- ఇతర సాలర్షిప్ పొందకూడదు. పొందితే ఏది ప్రయోజనకరమో దానినే ఎంచుకోవాలి.
- ఒకసారి తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం కోర్సు పూర్తయ్యే వరకు చెల్లుబాటవుతుంది.
- ఒకేస్థాయి విద్యను మళ్లీ చదివేవారికి సాలర్షిప్ వర్తించబోదు.
- ఒక కుటుంబంలోని అందరు పిల్లలు అర్హతా ప్రమాణాలు నెరవేర్చితే సాలర్షిప్ పొందవచ్చు.
- తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేషన్ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) సంబంధిత యూనివర్సిటీ నిర్ణయించిన ట్యూషన్ ఫీజును మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది.
- కాషన్ డిపాజిట్, సెక్యూరిటీ డిపాజిట్ తదితర రీఫండబుల్ ఫీజులను రీయింబర్స్ చేయదు.
- ప్రొఫెషనల్, పీజీ కోర్సులు చదివే హాస్టల్ విద్యార్థులకు నెలకు రూ.1500, డేస్కాలర్‌కు రూ.650 చెల్లిస్తారు.
- డిగ్రీ కోర్సులో చదివే హాస్టల్ విద్యార్థులకు రూ.1,000, డే సాలర్కు 500, ఇంటర్మీడియట్ హాస్టల్ విద్యార్థులకు రూ.750, డే సాలర్కు రూ.500 చెల్లిస్తారు. దివ్యాంగులకు అదనంగా 10 శాతం చెల్లిస్తారు.
- ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మొత్తానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.
- ఎంటీఎఫ్ కూడా విద్యార్థి ఆధార్ లింక్ బ్యాంకు ఖాతాలోనే జమ చేస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niti Taylor | సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన నీతి టేలర్!
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

