ములుగురూరల్: అప్పుల బాధతో కౌలు రైతు మృతి చెందిన సంఘటన రాష్ట్ర మంత్రి సీతక్క సొంత గ్రామమైన ములుగు జిల్లా ములుగు మండలం జగ్గన్నపేట గ్రామంలో చోటు చేసుకుంది. మృతుని సోదరుడు శంకర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన జెట్టి సమ్మయ్య(42) కౌలు రైతుగా జీవనం కొనసాగిస్తున్నాడు. భార్య సుమలతతో కలిసి వ్యవసాయం చేస్తున్నాడు. గత సంవత్సరం గ్రామంలో నాలుగు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని రెండు ఎకరాలలో మిర్చి, మరో రెండు ఎకరాల్లో పత్తి పంట పండించాడని అన్నారు.కూలీల ఖర్చు పోను సమ్మయ్య లాభం అర్జించకపోగా అప్పుల పాలయ్యాడు. సమ్మయ్యకు ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కుమార్తెకు రెండేళ్ల క్రితం పెండ్లి చేశాడు.
కుమార్తె వివాహంలో సైతం అప్పు చేశాడు. కాగా, ప్రస్తుతం మూడు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని దుక్కులు దున్ని వాన పడితే గింజలు నాటుదామని ఎదురు చూస్తున్న సమ్మయ్యకు విత్తనాల తీసుకు చ్చేందుకు తిరిగి అప్పు కావాల్సి ఉండగా అప్పు పుట్టలేదు. దీంతో పాటు గతంలో పంట పెట్టుబడికి, కుమార్తె పెండ్లీ చేసిన అప్పులు తలకు మించిన భారం కావడంతో తీవ్ర మనస్థాపం చెందిన సమ్మయ్య ఈ నెల 5వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ములుగు ప్రభుత్వ దావాఖానకు తరలించగా పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన చికిత్స కోసం వైద్యులు ఎంజీఎంకు రెఫర్ చేశారు.
హనుమకొండలో రెండు ప్రైవేటు దవాఖానల్లో చేర్పించి చికిత్స అందించిన ఫలితం లేకపోవడంతో ఇటీవల ఎంజీఎంకు సమ్మయ్యను తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు తెలిసింది. చేసిన అప్పులు తీరక, పంట సాగుబడిని నమ్మికొని వ్యవసాయం చేసిన కౌలు రైతు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, మృతుని భార్య సుమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ములుగు పోలీసులు కేసు నమోదు చేశారు. నిరుపేద రైతును ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకునేందుకు మంత్రి సీతక్క చొరవ తీసుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు.