మహబూబ్నగర్ : కృష్ణా నదిలో దూకి కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నారాయణపేట జిల్లా కృష్ణ మండలం గుడేబల్లూరు టై రోడ్డు వద్ద చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు టై రోడ్డు చెక్పోస్ట్ వద్ద నివాసం ఉంటున్న నాగరాజు (55) కృష్ణ పరివాహక ప్రాంతంలో కొన్నేళ్లుగా వ్యవసాయ భూములు కౌలుకు తీసుకొని వరి పంటలు పండిస్తున్నాడు. గత రెండేళ్లుగా పంట దిగుబడులు రాక పెట్టిన పెట్టుబడులు చేతికి అందక తీవ్రంగా నష్టపోయాడు. ఈ ఏడాది పొలాలు వదిలి జీవనం కోసం హైదరాబాద్ వెళ్లాడు.
రెండు రోజుల క్రితం భార్య పిల్లల వద్దకు చేరుకున్న కౌలు రైతు అప్పుల బాధ భరించలేక తీవ్ర మనస్తాపం చెంది సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కృష్ణ బ్రిడ్జిపై నుండి నదిలోకి దూకి దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న కృష్ణ ఎస్ఐ నవీద్ ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఒడ్డు పైకి చేర్చారు. అప్పుల బాధ భరించలేక కుటుంబ యజమాని మృతి చెందినట్లు భార్య పేర్కొంది. రైతు మృతితో విషాదఛాయలు నెలకొన్నాయి.