గుత్తులు గుత్తులుగా యాపిల్ పళ్లు.. గమ్మత్తుగా గుబాళించే ఆర్చిడ్ పూదోటలు.. వీటి మధ్యలో ఉంటుంది అందమైన రాణీఖేత్. ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం నైనిటాల్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ప్రాంతం. రహదారికి ఇరువైపులా దేవదారు వృక్షాలు, పైన్, ఓక్ చెట్లు విస్తారంగా కనిపిస్తాయి. యాపిల్ తోటలు ఆశ్చర్యం కలిగిస్తాయి. రాణిఖేత్ అంటే రాణి గారి ఉద్యానవనం అని అర్థం. దీనికి ఈ పేరు రావడం వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది. కుమావోస్ ప్రాంతానికి చెందిన రాణి పద్మిని ఇక్కడి ప్రకృతిని చూసి చాలా ముచ్చటపడిందట.
ఆమె భర్త రాజు సుఖేవ్ ఇక్కడో అందమైన మహల్ నిర్మింపజేశారట. ఆ మహల్ ఆనవాళ్లు ఇప్పుడైతే కనిపించవు. కానీ, అక్కడి ప్రకృతి సౌందర్యం, వాతావరణం దంపతుల మధ్య కొత్త ప్రేమను చిగురింపజేస్తుంది. సముద్రమట్టానికి సుమారు 6,200 అడుగుల ఎత్తులో ఉన్న రాణిఖేత్ ఏడాదంతా చల్లగా ఉంటుంది. ఏ దిక్కున చూసినా హిమాలయాలు పలకరిస్తాయి. శీతాకాలంలో ఇక్కడి చెట్టూ, పుట్టా అన్నీ మంచుతో నిండిపోతాయి.
వానాకాలంలో ఇక్కడ పచ్చదనం రెండింతలు అవుతుంది. చల్లదనం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. హనీమూన్ డెస్టినేషన్‌గా ప్రాచుర్యం పొందిన రాణీఖేత్‌కు సాహస క్రీడలకు అడ్డాగా పేరుంది. ట్రెక్కింగ్, మౌంటెయిన్ బైకింగ్, రివర్ రాఫ్టింగ్ వంటి క్రీడలు పర్యాటకులకు మరింత ఆనందాన్నిస్తాయి. కుమావూస్ రెజిమెంట్ సెంటర్‌గా ఉన్న రాణిఖేత్‌లో మిలటరీ హాస్పిటల్ ఉంది. రాణిఖేత్ నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అల్మోరా 46 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఇలా చేరుకోవాలి: