కొందరు చాలా ప్రత్యేకంగా ఉంటారు. ఎక్కడికెళ్లినా.. అక్కడి వాతావరణాన్నిఆహ్లాదకరంగా మార్చేస్తారు. తమను కలిసినవారిలో సానుకూల శక్తిని నింపుతారు. అలాగని వారు మరీ గొప్ప తెలివిమంతులు కాకపోవచ్చు. హాస్యాన్ని కూడా పండించలేక పోవచ్చు. అంత స్టయిలిష్గానూ కనిపించక పోవచ్చు. అయినా.. అందరూ సహజంగానే వారంటే ఇష్టపడతారు. వారితోకలవడానికి ఆసక్తి చూపుతారు. అయితే, ఇలాంటి గుణం పుట్టుకతో వచ్చేది కాదు. రోజువారీ చిన్నచిన్న అలవాట్లతోనే దీనిని అలవర్చుకోవచ్చు. కాలక్రమేణా మన వ్యక్తిత్వంలోనూ ఓ భాగంగా మార్చుకోవచ్చు. మీరూ అలా ‘సమ్థింగ్ స్పెషల్’గా ఉండాలంటే.. ఈ చిట్కాలను ఫాలో అయితే చాలు.

Standing Near
నలుగురూ మిమ్మల్ని ప్రత్యేకంగా చూడాలంటే.. ముందుగా, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. నిజానికి ఇది ఒక వ్యక్తికి ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన అలవాటు కూడా. అందుకే, పరిస్థితులు అనుకూలించనప్పుడు సైతం ప్రశాంతంగా ఉండటం నేర్చుకోవాలి. అనుకున్న ప్లాన్స్ మారినా, అనుకోకుండా పనులు చెడిపోయినా.. ఏమాత్రం తొణకొద్దు. అలాగని సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు. పరిస్థితి ఎలా ఉన్నా.. మీ ఎమోషన్స్ మీ కంట్రోల్లోనే ఉండాలి. ఈ రకమైన నిశ్చలత్వం.. ఇతరులకు ఎంతో భరోసానిస్తుంది. ఆందోళనను కాకుండా ప్రశాంతతను పంచేవారికి జనాలు సహజంగానే అట్రాక్ట్ అవుతారు.
ఈరోజుల్లో ప్రతిఒక్కరూ స్మార్ట్ఫోన్కే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. తోటివారి కోసం శ్రద్ధ చూపడం అరుదైన విషయంగా మారిపోయింది. అందుకే, ఎదుటివారికి కూడా కాస్త సమయాన్ని అందివ్వండి. ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మీ ఫోన్ను పక్కన పెట్టండి. సంభాషణ మధ్యలో అడ్డుపడకండి. వారు గతంలో చెప్పిన ఏదైనా విషయాన్ని గుర్తుంచుకుని.. దాని గురించి మరోసారి అడిగి తెలుసుకోండి. ఇలాంటి చిన్నచిన్న పనులే.. ‘మీరు మాకు ముఖ్యం’ అని ఇతరులకు తెలియజేస్తాయి. మీరంటే ఎక్కువ గౌరవం, ప్రేమ చూపేలా చేస్తాయి.
ఆత్మవిశ్వాసానికి.. ఇతరులను ఇంప్రెస్ చేయాలనే ఆరాటానికి మధ్య చాలాతేడా ఉంటుంది. అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తులు.. ప్రతి సంభాషణనూ ఒక పోటీలా మార్చాలని అనుకోరు. దొరికిన ప్రతి అవకాశంలోనూ తమ గురించి గొప్పలు చెప్పుకోరు. ఎందుకంటే, తమ ప్రతిభ ఏంటో వారికి తెలుసు. కాబట్టి దానిని ఇతరులు ధృవీకరించాల్సిన అవసరం లేదని భావిస్తారు. ఇలాంటి క్వైట్ కాన్ఫిడెన్స్ చాలా సహజంగా ఉంటుంది. కాబట్టి, నలుగురిలో చాలా సులభంగా గుర్తింపు పొందుతుంది. మీరూ అలా ఉండేందుకు ప్రయత్నించండి.

Speaking
కొన్నిసార్లు మీరు చేసే చిన్నచిన్న పనులే.. ఇతరులపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. ఒకరిని మనస్ఫూర్తిగా అభినందించడం, వారు ఎలా ఉన్నారో ప్రేమగా అడగడం, వారి విజయాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవడం, చేసిన చిన్న సాయాన్ని కూడా గుర్తించి వారికి కృతజ్ఞతలు చెప్పడం.. ఇలాంటివన్నీ మీ ప్రత్యేకతను చాటుతాయి. నిజానికి తమను తక్కువ చేసి చూసేవారిని జనాలు అంతగా పట్టించుకోరు. తమను గౌరవించే వారివైపే ఆకర్షితులవుతారు.
ఎదుటివారిని ఇంప్రెస్ చేయాలంటే.. వారిని ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదు. వారి సమస్యలన్నిటినీ పరిష్కరించాల్సిన పని కూడా లేదు. కేవలం.. మీ దృష్టిలో వారికి చాలా విలువ ఉన్నదని వారికి అనిపించేలా చేస్తే చాలు. ఆ ఇంప్రెషన్.. వారి మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది.