“నారాయణరెడ్డి తెలుగు ఆరామంలో సుమించు ఆమని గాదే/ లేరతనికిపోలిక కర్పూర కళికగా వెలుంగు పున్నమి గాదే” అంటారు డా॥సి.నారాయణరెడ్డిని గురించి చెబుతూ ఆచార్య ఎన్.గోపి. నేటి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని హనుమాజీపేట అనే అన్ని తెలంగాణ పల్లెల్లాంటి ఒక పల్లెటూరులో 1931 జూలై 29న ఆషాఢ పౌర్ణమి నాడు మన కవి సినారె పుట్టారు. మహాకవి ఈ నేలమీద జన్మించి నేటికి 95 ఏండ్లు. అందులోనూ కవితా విశ్వంభరుడై తెలుగు సినిమా తెరపై తేటపాటల వెలుగులు పంచి అచ్చంగా 60 ఏండ్లు. తెలుగు సినిమా కోసం వేలాది పాటలు రాసిన సినారె వివిధ పండుగలు, పబ్బాలు, మహనీయుల జయంతులు, ప్రఖ్యాత దినాల కోసం వందలాది సినీ గీతాలను రచించారు. వాటిలో పుట్టినరోజుకు సంబంధించిన గీతాలు కూడా ఉండటం విశేషం.
“ఇది నా పుట్టినరోజు
ఈ చిరంజీవి పుట్టినరోజు
అహ ఆడుతూ, ఎహె తుళ్లుతూ,
అహ పాడుతూ పరవశించేది ఈ రోజు”
ఈ గీతాన్ని “రాముని మించిన రాముడు” చిత్రం కోసం రాశారు సినారె. “పుట్టుతూ నవ్వాను/ నేను నవ్వుతూ పెరిగాను” అని రాస్తారు ఇందులో. ఈ కోవలోనే పుట్టినరోజు ప్రాశస్త్యాన్ని గురించి చెబుతూ రాసిన సినీ గీతాలు మరికొన్ని ఉన్నాయి. వాటిలో..
“పుట్టినరోజు పండగే అందరికీ మరి/ పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ” గీతం మిక్కిలి ప్రసిద్ధి. ఈ గీతాన్ని సినారె సురేష్ మూవీస్ వారి “జీవన తరంగాలు” సినిమా కోసం రాశారు. ఈ సినిమాకు తాతినేని రామారావు దర్శకుడు. నిర్మాత డి.రామానాయుడు. జీవన తరంగాలు కథ మనకు తెలిసిందే… నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనా రాణి నవల ‘జీవన తరంగాలు’ను సినిమాగా మలిచారు. చిత్ర కథానాయిక మహాభినేత్రి వాణిశ్రీ. కథ ప్రకారం ఒక స్నేహితుడి పుట్టినరోజు పండుగకు వెళ్తుంది నాయిక. అన్ని సినిమాల్లో చూసినట్టే అక్కడ కూడా నాయిక వాణిశ్రీని ఒక మంచి పాట పాడమని అందరూ అడుగుతారు. సాధారణంగా సినిమాల్లో సంగీత దర్శకులు లేదా చిత్ర దర్శకులు ఇచ్చిన స్వరానికి పాట రాసే సందర్భాలే ఎక్కువ. ఈ చిత్రంలో సంగీత దర్శకులు సినారెను స్వేచ్ఛగా గీతం రాయమని, ఆ పాటకే ట్యూన్ కడతామని చెప్పడంతో ఈ గీతాన్ని రాశారు.
పల్లవి:
పుట్టినరోజు పండగే అందరికీ… మరి
పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ?
స్నేహితుడి పుట్టినరోజు పండుగనాడు సరదాగా పాట పాడమంటే ఇక్కడ కథానాయిక వాణిశ్రీ ‘పుట్టుక ఎందుకు’ అంటూ ప్రశ్నిస్తుంది. గమ్మత్తైన విషయం ఏమిటంటే అందరం పుడతాం కానీ, కేవలం ఆ పుట్టుకలోని విలువ కొందరికి మాత్రమే తెలుసు అనేది ఈ పల్లవిలోని భావం. దీనిని గురించి చెబుతూ గీత రచయిత సినారె, “కథానాయిక విశిష్ఠ వ్యక్తిత్వం ఉన్నది కాబట్టి ఆ గీతం పల్లవి విలక్షణంగా రాస్తే బాగుంటుందని నాకు అనిపించింది. పల్లవిలో కీలకమైన ఓ ప్రశ్న వేసి చరణాల్లో అందుకు తగిన వివరణలిస్తే సమంజసంగా ఉంటుందని రేఖామాత్రంగా స్ఫురించింది” అంటారు పై పల్లవి గురించి. ఇలా ప్రశ్నించడం నాయిక ఆత్మవిశ్వాసానికి, ఆటుపోట్లను ఎదుర్కొని నిలిచే వ్యక్తిత్వానికి నిదర్శనమని చెబుతారు సినారె.
చరణం:
కలిమికేమి వలసినంత ఉన్నా..
మనసు చెలిమి కొరకు చేయి సాచుతుంది
ఆ మనసే ఎంత పేదైనా
అనురాగపు సిరులు పంచుతుంది
మమత కొరకు తపియించే జీవనం
దైవ మందిరంలా పరమ పావనం ॥పుట్టిన॥
ఈ మొదటి చరణాన్ని నాయిక ఉదాత్తమైన ప్రవృత్తికి అద్దం పట్టేదిగా మలిచారు సినారె. సిరి సంపదలు ఎంతగా ఉన్నా మంచి మనసు ఎప్పుడూ స్నేహాన్ని కోరుతుందని, కొందరు మనుషులు, మనసులు కలిమి లేకున్నా ఆత్మీయతానుబంధాలను పెనవేసుకుని ఉంటాయంటారు కవి. ఒకచోట “సురలకన్న కరుణాత్ముడు/ మనిషిగాక ఇంకెవ్వడు/ మందిరమెరుగని దేవుడు/ మనిషిగాక ఇంకెవ్వడు” అంటూ మనిషే దేవుడన్న సినారె.. ఇందులో మమత కోసం తపించే మానవ జీవనం దేవాలయంలాగా పరమపావనం అంటారు. తరువాతి చరణంలో మానవజన్మ సార్థకతను గురించి, ప్రకృతికి సంబంధించిన ఉదాహరణలో కవి సినారె ఇలా చెబుతారు.
చరణం :
పువ్వెందుకు తీగపై పుడుతుంది? జడలోనో గుడిలోనో నిలవాలని
ముత్యమేల కడలిలో పుడుతుంది
ముచ్చటైన హారంలో మెరవాలని
ప్రతి మనిషీ తన జన్మకు పరమార్థం తెలుసుకొని
తన కోసమే కాదు, పరుల కొరకు బ్రతకాలి
తానున్నా.. లేకున్నా..
తన పేరు మిగలాలి… ॥పుట్టిన॥
పుట్టిన పువ్వు మగువ జడలోనో, దేవుని మెడలోనో నిలవాలని కోరుకుంటుందని, సముద్రంలో పుట్టిన ముత్యం ముచ్చటైన హారంలో మెరవాలని కోరుకుంటుందని భావం. చరాచర సృష్టిలో మానవ జన్మ ఉన్నతమైనదని, ఆ జన్మ పరమార్థం తెలిసి నడుచుకున్నప్పుడు పుట్టుకకు సార్థకమని చెబుతారు ‘సార్థక జన్ములు’ సినారె. తెలుగు గజళ్లలో “పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని/ మూగనేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని” అంటారు.