Abhishek Banerjee : పశ్చిమబెంగాల్ (West Begal) రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. ఫల్టా అసెంబ్లీ నియోజకవర్గం (Falta Assembly Constituency) లో ఏప్రిల్ 29న జరిగిన రెండో దశ పోలింగ్‌లో తీవ్రమైన అవకతవకలు జరిగినట్లు బీజేపీ ఆరోపించింది. దాంతో కేంద్ర ఎన్నికల సంఘం (ECI) అక్కడ పోలింగ్‌ను పూర్తిగా రద్దు చేసి రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. ఈ నిర్ణయంపై తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ అభిషేక్ బెనర్జీ తీవ్రంగా స్పందిస్తూ బీజేపీకి బహిరంగ సవాల్ విసిరారు.
బీజేపీ నేత అమిత్ మాలవియా సోషల్ మీడియా పోస్టుకు బదులిస్తూ బెంగాల్ వ్యతిరేక గుజరాతీ ముఠా ఫల్టాలో పోటీ చేయాలని అభిషేక్ సవాల్ చేశారు. మీ బెంగాల్ వ్యతిరేక గుజరాతీ ముఠా, వారి తొత్తు జ్ఞానేష్ కుమార్ కలిసి పది జన్మలెత్తినా నా డైమండ్ హార్బర్ మోడల్‌ను దెబ్బతీయలేరని అన్నారు. ‘మీ శక్తియుక్తులన్నీ కూడగట్టుకుని రండి. ఫల్టాలో పోటీ చేయండి. మీ గాడ్ఫాదర్లలో ఒకరిని ఢిల్లీ నుంచి పంపండి’ అని ఆయన ఎక్స్ వేదికగా సవాల్ విసిరారు. డైమండ్ హార్బర్ లోక్‌సభ స్థానం పరిధిలోని ఫల్టాలో బీజేపీ అభ్యర్థికి ఓటు వేయకుండా ఓటర్లను అడ్డుకున్నారని, అనేక పోలింగ్ బూత్‌లలో ఈవీఎం బటన్లపై నల్ల టేపు, సిరా పూసి ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారని బీజేపీ నేత అమిత్ మాలవియా ఆరోపించారు.
నియోజకవర్గంలోని 285 పోలింగ్ కేంద్రాలకుగానూ 60 కేంద్రాల్లో ఇలా జరిగిందని, దీనివల్ల 53,967 మంది ఓటర్లు ప్రభావితమయ్యారని మాలవీయ తెలిపారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన ఎన్నికల సంఘం.. విస్తృత స్థాయిలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినట్లు నిర్ధారించింది. కొన్నిచోట్ల వీడియో ఫుటేజీలో గ్యాప్‌లు ఉండటంతో ప్రజాతీర్పును నిర్ధారించడం అసాధ్యమని పేర్కొన్నది. కాగా బెంగాల్ చరిత్రలో ఫలితాల ప్రకటనకు ముందు ఒక నియోజకవర్గం మొత్తం రీపోలింగ్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. గతంలో బీహార్‌లో మాత్రమే ఇలాంటి ఘటన జరిగింది.
ఈ నేపథ్యంలో ఫల్టాలోని హసిమ్నగర్లో ఉద్రిక్తత నెలకొన్నది. టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ అనుచరులు తమను బెదిరిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. దాంతో ఆ ప్రాంతంలో కేంద్ర, రాష్ట్ర బలగాలను మోహరించారు. జహంగీర్ ఖాన్ అనుచరులు ఇజ్రాఫిల్ చోక్దార్, సుజావుద్దీన్ షేక్‌లను అరెస్ట్ చేయాలని ఈసీ ఆదేశించింది. దాంతో అధికారులు ఆ ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఇక ఫల్టాలో మే 21న రీపోలింగ్ నిర్వహించనున్నారు. మే 24న ఓట్లను లెక్కించి ఫలితం వెల్లడించనున్నారు.