హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): గత బీఆర్ఎస్ పాలన ఫలితంగా డెవలప్మెంట్ ఎక్స్పెండేచర్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని కేటీఆర్ వివరించారు. అసెంబ్లీలో బుధవారం ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఉద్యమాలతో ఉదయించిన తెలంగాణ.. ఉజ్వల తెలంగాణగా అవతరించింది. పదేండ్లలో సొంత కాళ్లపై నిలబడింది. విజయవంతమైన రాష్ట్రంగా నిలిచింది. భారతదేశ భాగ్యరేఖలు మార్చే రాష్ట్రంగా నిలబడటం మనందరి అదృష్టం’ అని కేటీఆర్ చెప్పారు. 2014లో రాష్ట్ర జీఎస్డీపీ రూ.4 లక్షల కోట్లు ఉంటే, 2024 నాటికి రూ.14.64 లక్షల కోట్లకు పెంచామని గుర్తుచేశారు. అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, ప్రభుత్వం విడుదల చేసిన నివేదికే దీనికి సాక్ష్యమని చెప్పారు. దేశ జీడీపీ వృద్ధికి ఊతమిస్తున్న రాష్ట్రంగా, దేశాన్ని సాదుతున్న రాష్ర్టాల్లో ఒకటిగా తెలంగాణ ఉన్నదని నివేదకలో చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ‘దివ్యంగా ఉన్న రాష్ర్టాన్ని దివాలా తీసిందని ప్రచారం చేస్తున్నారు. ఆస్తులు దండిగా ఉన్న రాష్ర్టాన్ని, అప్పుల ఊబిలో ఉన్నదని అంటున్నారు. ఆ ప్రచారం శుద్ధ తప్పు అని మీరు విడుదల చేసిన సోషియో ఎకనమిక్ అవుట్‌లుక్ చెప్తున్నది. అంకెలు అబద్ధాలు ఆడవు.. సత్యాల మీద ముసుగు వేయడం మంచిది కాదు’ అని హితవు పలికారు.
ఆర్బీఐ గణాంకాలు, కాగ్ నివేదికల్లో తెలంగాణ అభివృద్ధిని కొనియాడారని, డెవలప్మెంట్ ఎక్స్పెండేచర్లో తెలంగాణ 74%తో టాప్‌లో ఉన్నదని వివరించారు. జీతాలకు పైసలు లేవని, అప్పులు తీర్చేందుకు అప్పలు చేస్తున్నట్టుగా తప్పుదోవ పట్టించడం సరికాదని హితవు చెప్పారు. జీతాలు, పెన్షన్లు, కిస్తీలు వంటివి కలిపి కమిటెడ్ ఎక్స్‌పెండేచర్‌గా పిలుస్తారని.. ఒక రూపాయిలో కమిటెడ్ ఎక్స్పెండేచర్లో 47 పైసలు అయితే, మిగతా 53 పైసలు అభివృద్ధి చేయడానికి అందుబాటులో ఉన్నాయని కేటీఆర్ వివరించారు. కేరళ కమిటెడ్ ఎక్స్పెండేచర్ రూపాయిలో 82 పైసలు ఉంటే, హర్యానా 81 పైసలు, పంజాబ్ 79, పశ్చిమబెంగాల్ 69, తమిళనాడు 62, ఏపీ 61, రాజస్థాన్‌లో 52 పైసలుగా ఉన్నదని వివరించారు. దేశ సగటులో కమిటెడ్ ఎక్స్పెండేచర్ 56 పైసలుగా ఉన్నదని చెప్పారు. కమిటెడ్ ఎక్స్పెండేచర్ అత్యల్పంగా ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ టాప్-4లో ఉన్నదని గుర్తు చేశారు. తిమ్మినిబమ్మిని చేసి, మోసం చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. ఒకవైపు ద్రవ్యలోటు ఉన్నదంటూనే.. మరోవైపు డెవలప్మెంట్ ఎక్స్పెండేచర్లో 74%తో తెలంగాణ మొదటిస్థానంలో ఉన్నదని ప్రభుత్వం చెప్తున్నదని గుర్తు చేశారు. పరస్పర విరుద్ధంగా నివేదిక రూపొందించారని, ఇందులో ఏది నిజమో కాంగ్రెస్ నేతలే చెప్పాలని డిమాండ్ చేశారు.
రాబడులకు లోబడే అప్పులు
‘బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు రెవెన్యూ రిసీట్స్‌లో లోబడే ఉన్నాయి. రెవెన్యూ సర్ప్లెస్ ఉన్నా.. సొంత వనరుల వినియోగంలోనూ తెలంగాణ టాప్‌లో ఉన్నదనే విషయాన్ని గుర్తించాలి’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ‘నికర అప్పు రూ.6.71 లక్షల కోట్లు ఉందనేది పచ్చి అబద్ధం. ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం లేనివాటిని కూడా అప్పుల్లో చేర్చారు. ఇది అత్యంత దారుణం. మా హయాంలో మొత్తం నికర అప్పు రూ.3.85 లక్షల కోట్లే’ అని స్పష్టంచేశారు. బయట ఏం మాట్లాడినా.. సభలో అబద్ధాలు చెప్పొద్దని హితవు పలికారు. తెలంగాణ అప్పులతో దివాలా తీసిందంటే ఒక్క వ్యాపారైనా పెట్టుబడి పెట్టడానికి వస్తాడా? అని ప్రశ్నించారు. అప్పులు తీసుకొని మంచినీళ్లు, తాగునీరు, సాగునీరు ఇచ్చామని తెలిపారు. విద్యారంగాన్ని అభివృద్ధి చేశామని, హెల్త్‌కేర్ ఇచ్చామని తెలిపారు. అప్పులు తెచ్చి పప్పుకూడు తినలేదని, సంపద సృష్టించామని తెలిపారు. దేశంలోనే తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న మొదటి రాష్ట్రం తెలంగాణ అని సగర్వంగా చెప్పగలనని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి వెనుకబడిన జిల్లా కూడా భారతదేశ సగటుకంటే ముందున్నదని స్పష్టంచేశారు. నీతి ఆయోగ్ విడుదల చేసిన ‘నో పావర్టీ ఇండెక్స్’లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందంటే బీఆర్ఎస్ పరిపాలన గొప్పతనమని చెప్పారు.
ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలి
మా ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ అమలు చేస్తే నాడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉచితంగా చేయాలని డిమాండ్ చేశారు.. ‘నో ఎల్ఆర్ఎస్- నో టీఆర్ఎస్’ అని స్లోగన్ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే డబ్బులు వసూలు చేస్తున్నారు. 25 లక్షల దరఖాస్తుదారులకు గతంలో ఇచ్చిన మాట ప్రకారం
ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయాలి.
–కేటీఆర్
ప్రజలు మాకు బుద్ధి చెప్పే రోజులొస్తే : సీతక్క
ఉద్యోగాల కల్పనపై కేటీఆర్ మాట్లాడుతుంటే.. మధ్యలో సీతక్క ఉద్యోగాలు, పెన్షన్ల రికవరీ గురించి కలుగజేసుకున్నారు. పెన్షన్ల రికవరీ తమ దృషికి రాలేదని, అధికారులు చేస్తున్నారేమోనని తెలిపారు. ‘ఇంకా మాకు సమయం ఉన్నది. అంతా చేస్తాం. ఆరు నెలల్లో కొన్ని సాధ్యం కాలేదు. ప్రజలు మాకు బుద్ధి చెప్పేటప్పుడు చెప్తారు కానీ, మీరు విమర్శలు ఆపండి’ అని వ్యాఖ్యానించారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. ‘మంత్రులకు ఓపిక ఉండాలి. ప్రజల తరఫున అడగటమే మా ధర్మం. మిమ్మల్ని వందరోజుల్లోనే ఇచ్చిన హామీలు పూర్తి చేయాలని గడువు ప్రజలు అడిగారా? మీరు ఓట్ల కోసం అడ్డగోలు మాటలు చెప్పారు. అడిగితే కంగారు ఎందుకు పడుతున్నారు’ అని ప్రశ్నించారు.
రెవెన్యూ రాబడుల్లోనూ ముందంజ
సొంత రెవెన్యూ రాబడులతో ఎవరి మీద ఆధారపడకుండా బతుకుతున్న రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ స్పష్టంచేశారు. 84% సొంత రాబడులతో దేశంలోనే మొదటి మూడు స్థానాల్లో తెలంగాణ ఉన్నదని చెప్పారు. కేంద్ర పన్నుల్లో వాటా, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, సబ్సిడీలు వంటివి కలిపితే.. మనది లోటు బడ్జెట్ రాష్ర్టామా? మిగులు బడ్జెట్ రాష్ర్టామా? అనేది తేలిపోయిందని చెప్పారు.
నాడు తెలంగాణ రెవెన్యూ రూ.46 వేల కోట్లు అని.. పదేండ్ల బీఆర్ఎస్ పరిపాలనలో రూ.1.60 లక్షల కోట్లు అని గుర్తుచేశారు. సొంత రాబడుల్లో నేటికీ తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన ఉన్నదని స్పష్టంచేశారు. ‘2014లో రెవెన్యూ సర్ప్లస్ రూ.369 కోట్లతో మాకు అప్పగిస్తే.. రూ.5,944 కోట్ల రెవెన్యూ సర్ప్లెస్తో మీకు ఇచ్చాం’ అని పేర్కొన్నారు. ఈ బడ్జెట్లో కూడా రెవెన్యూ మిగులు రూ.297 కోట్లుగా చూపించారని పేర్కొన్నారు. ‘రెవెన్యూ రిసీట్స్లోంచి రెవెన్యూ ఎక్స్పెండేచర్ను తీసేస్తే మిగిలిందే కదా రెవెన్యూ సర్ప్ల్లస్. రాష్ట్రం అప్పులపాలైందని ఊదరగొడితే ఎలా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. 2021 వరకు జీతాలు ఒకటో తేదీన ఇచ్చామని, కరోనా సృష్టించిన ఆర్థిక సంక్షోభం వల్ల 2021 నుంచి 2023 వరకూ జీతాలు ఇవ్వడంలో ఆలస్యమైందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో ఇప్పటికీ చిరుద్యోగులకు, వైద్యశాఖలోని కాంట్రాక్ట్ సిబ్బందికి నెలలుగా జీతాలు అందడం లేదని చెప్పారు.
సంక్షేమంపై దృష్టి సారించండి కేటీఆర్ డిమాండ్