హైదరాబాద్, ఫిబ్రవరి 2 : రాష్ట్ర ప్రభుత్వం నూతన మార్చురీ విధానానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 61 దవాఖానల్లో మార్చురీల ఆధునీకరణకు బుధవారం రూ.32.54 కోట్లు విడుదల చేసింది. టీచింగ్ దవాఖానల్లోని మార్చురీల ఆధునీకరణకు రూ.11.12 కోట్లు, వైద్య విధాన పరిషత్ పరిధిలో 51 దవాఖానల్లో ఆధునీకరణకు 21.42 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో అవసరమైన పరికరాలు, ఫ్రీజర్లు, అదనపు గదుల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధంచేసింది. హైదరాబాద్‌లోని ఉస్మానియా, ఫీవర్, చెస్ట్ దవాఖానలతోపాటు మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేట, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్‌లోని బోధనా దవాఖానలు ఇందులో ఉన్నాయి.
త్వరలో మరో 16 వాహనాలు
గతంలో ఎవరైనా దవాఖానల్లో మరణిస్తే వారి పార్థివదేహాలను సొంతూరికి తీసుకెళ్లడం సమస్యగా మారేది. వారి అవసరాన్ని ఆసరాగా చేసుకొని ప్రైవేట్ వాహనదారులు ఇష్టమొచ్చినట్టు డబ్బులు డిమాండ్ చేసేవారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకొన్న ప్రభుత్వం మృతదేహాలను తరలించేందుకు ప్రత్యేక వాహనాలను సమకూర్చింది. ప్రస్తుతం 50 వాహనాలు ఉన్నాయి. త్వరలో మరో 16 వాహనాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నది. మార్చురీల వద్ద మృతుల కుటుంబ సభ్యుల కోసం మౌలిక సదుపాయాల కల్పనకు ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్రంలోని అన్ని మార్చురీల్లో ఫోరెన్సిక్ నిపుణులను నియమిస్తున్నది. ఇందుకుగాను వైద్య విధాన పరిషత్ దవాఖానలకు 102 పోస్టులు మంజూరుచేసింది. ఇందులో 63 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 20 డీసీఎస్, 19 సీఎస్ పోస్టులు ఉన్నాయి.
మరణించిన తర్వాత కూడా గౌరవించాలనే..
మనిషి బతికున్నప్పుడే కాదు.. మరణించిన తర్వాత కూడా సరైన గౌరవం అందించాలన్న సీఎం కేసీఆర్ ఆలోచనతోనే ప్రభుత్వం మార్చురీల ఆధునీకరణకు నిర్ణయం తీసుకొన్నది. పార్థివదేహాలను నిల్వచేసే మార్చురీల నుంచి అంతిమసంస్కారాలు నిర్వహించే వైకుంఠధామం వరకు అన్నీ గౌరవంగా సాగేలా సర్కారు చర్చలు తీసుకొంటున్నది. – హరీశ్‌రావు, వైద్యారోగ్యశాఖ మంత్రి