కీసర, జనవరి 19; తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు ప్రజారంజకంగా ఉన్నాయని జమ్ముకశ్మీర్ రాష్ట్ర అధికారుల బృందం కితాబిచ్చింది. జమ్ము కశ్మీర్‌లోని లద్దాఖ్ బ్లాక్ డెవలప్మెంట్ చైర్మన్, బీడీవోల బృందం ఎన్ఐఆర్డీ అధికారులతో కలిసి గురువారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసరలోని మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించింది. రాజేంద్రనగర్‌కు చెందిన ఎన్ఐఆర్డీ ప్రొఫెసర్ హేమంత్ కుమార్ జమ్ముకశ్మీర్‌కు చెందిన 12మంది ప్రతినిధుల బృందాన్ని అక్కడికి తీసుకొచ్చారు. మండలంలో ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తి, జడ్పీ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, కీసర ఎంపీడీవో రమాదేవి వివరించారు. ఇక్కడి పనులు తమ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలతో పోల్చుకొని అనంతరం గోధుమకుంట గ్రామ పంచాయతీలో జమ్ము కశ్మీర్ బృందం అభివృద్ధి పనులను నేరుగా పరిశీలించింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగున్నాయని కొనియాడారు. ఇక్కడ చేపట్టిన అభివృద్ధి పనులను తమ రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో జమ్ము కశ్మీర్ బృందంలో కోన్చాక్ పన్చాక్, జిగ్మట్ ఔంటన్, సిరింగ్ వాంగ్కాక్, స్టెయిన్ గ్యాసో, సేవంగ్ పాల్డన్, సేరియా బనో, రిగ్జిల్ చోరల్, స్కైగ్జింగ్ డార్జో, లాబ్జంగ్ గ్యాటో, గులమ్ హైదర్, చెర్రింగ్ పాన్చాక్ ఉన్నారు. కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరాలక్ష్మీనారాయణ, ఎంపీడీవో రమాదేవి, ఎంపీవో మంగతాయారు, ఎంపీటీసీలు వెంకట్‌రెడ్డి, పండుగ కవితాశశికాంత్, కో-ఆప్షన్ సభ్యులు బషారత్ ఆలీతో పాటు పలువురు పాల్గొన్నారు.