నిజామాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ ప్రజల మేలుకోసం, రైతుల మేలు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడటానికి అవసరమైతే దేవుడితోనైనా కొట్లాడుతామని పేర్కొన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామ గ్రామంలో కాంట్రాక్టర్ తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి రూ.6 కోట్లతో 2.75 ఎకరాల్లో నిర్మించిన ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవన సముదాయాన్ని మంత్రులు సబితాఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం కామారెడ్డి జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి సమావేశంలో ప్రసంగించారు.
పరిపాలనా సౌలభ్యం కోసం 33 జిల్లాలు చేసుకొన్నామని.. వాటిలో కామారెడ్డి కూడా ఉన్నదని కేటీఆర్ గుర్తుచేశారు. కొత్త మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామాలను ఏర్పాటుచేసుకొన్నామని.. ఇవన్నీ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, పేదల ముఖంలో సంతోషం చూడటానికేనని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో అమలుచేస్తున్న పథకాలు ఏ రాష్ట్రంలోనూ అమలు కావడంలేదని చెప్పారు.
సరిహద్దులోని కర్ణాటకలోని రాయచూర్ ప్రాంత ఎమ్మెల్యే శివకుమార్, ఆ రాష్ట్ర బీజేపీ మంత్రిని వేలమంది ప్రజ ల సాక్షిగా నిలదీశారని, చేతనైతే పక్కనున్న తెలంగాణలో అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలుచేయాలని, లేకపోతే రాయచూర్‌ను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కర్ణాటకలోని బీజేపీ నేతలకు కనిపిస్తున్న అభివృద్ధి.. మన రాష్ట్రంలోని నేతలకు కండ్లున్నా కనిపించడం లేదన్నారు.
వెకిలిమాటలు మాట్లాడేవాళ్లు తెలంగాణలో ఎక్కువైనారని మండిపడ్డారు. బాండ్ పేపర్లపై సంతకాలు పెట్టి, మోచేతికి బెల్లం పెట్టి ఆశచూపిన వాళ్లు ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారని, రెండు ఫీట్లున్నోడు కూడా ఎగిరెగిరి పడుతున్నాడని పేర్కొన్నారు. కెమెరాలు పెట్టి, ఫ్లెక్సీలు కట్టగానే లీడర్లు అయిపోయినట్టు కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
ఒక ప్రాంతీయ పార్టీ ఇరవై ఏండ్లు విజయవంతంగా నిలదొక్కుకొని, లక్ష్యాన్ని సాధించి, రెండుసార్లు అధికారంలోకి రావడం మామూలు విషయం కాదని కేటీఆర్ తెలిపారు. ‘ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు పట్టం కట్టరు. 1969 తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో 360 మంది యువకులను కాంగ్రెస్ పార్టీ కాల్చి చంపింది. 14 పార్లమెంట్ సీట్లకు ఎన్నికలు జరిగితే తెలంగాణ ప్రజాసమితి అనే పార్టీని 11 సీట్లలో ప్రజలు గెలిపించారు.
గెలిచినవారంతా తెలంగాణ కోసం అడిగితే.. అది తప్ప ఏదైనా అడగాలని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తిప్పి పంపారు. అప్పుడు కాంగ్రెస్‌కు తిరుగులేకుండే. తెలంగాణ జెండా ఎత్తిన ప్రతిసారీ ఏదోవిధంగా ఉద్యమం చల్లబడింది. చాలా మంది రాజకీయ నాయకులు వచ్చారు. వెళ్లారు. ఈ రోజు వినిపిస్తున్న మూడక్షరాల కేసీఆర్ అనే పేరు ఆనాడు ఎవరికీ తెలియదు. ఇరవైఏండ్ల క్రితం చంద్రశేఖర్‌రావు మాత్రమే. రాష్ట్రమంతా తెలిసిన నాయకుడు కాదు. కేసీఆర్‌గా పాపులర్ కాలేదు.
ముఖేశ్ అంబానీయో, సినిమా యాక్టరో కాదు. మీడియా పవర్, మజిల్ పవర్ ఉన్నోడు కాదు. ఇట్లాంటి పరిస్థితుల్లో పార్టీ పెట్టడమే సాహసం. 46 ఏండ్లకే మంత్రి పదవి, డిప్యూటీ స్పీకర్ చేసినోడు. ఒక్కడిగా బయలుదేరి ఇంతింతై వటుడింతై అన్నట్లుగా 2001లో ఉద్యమానికి ఊపిరిలూదారు. అనేక వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో ఉద్యమాన్ని నడిపి ఒక దశలో ప్రాణాలకు తెగించి దీక్షకు దిగి తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేయించిన ధీరుడు కేసీఆర్. ఒక్కో మెట్టు ఎక్కుతూ, ఒక్కొక్కరినీ మెప్పిస్తూ ఇంతదూరం వచ్చినం. సావు నోట్లో తలపెట్టి ఆమరణదీక్షకు దిగి తెలంగాణ తెచ్చిండు కేసీఆర్’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.
ప్రతిఒక్కరూ పుట్టిన ఊరు, చదివిన పాఠశాల రుణం తీర్చుకునేందుకు మంచి ఆలోచనతో ముందుకురావాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. బీబీపేటలో తిమ్మయ్యగారి సుశీల-నారాయణరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని సొంత డబ్బుతో నిర్మించిన సుభాష్‌రెడ్డి కుటుంబసభ్యులను ఆయన అభినందించారు. సుభాష్‌రెడ్డి స్ఫూర్తితో తన నాయనమ్మ సొంతూరైన దోమకొండ మండలం కోనాపూర్‌లోని ప్రాథమిక పాఠశాలను అభివృద్ధి చేస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో విపక్షాలు నోటికొచ్చినట్టు మొరుగుతున్నాయని రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈట్‌కా జవాబ్ పత్తర్ సే దేనా అన్నట్లుగా టీఆర్ఎస్ శ్రేణులంతా సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. కేసీఆర్, కేటీఆర్‌ను తిడితే ఇకపై చూస్తూ ఊరుకొనేది లేదని హెచ్చరించారు. అబద్ధాలతో ప్రజలను మోసంచేసి రాజకీయంగా లబ్ధి పొందాలనుకొనే వారికి బుద్ధి చెప్పాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జాజాల సురేందర్, జడ్పీ చైర్మన్లు దఫేదార్ శోభ, దాదన్నగారి విఠల్‌రావు పాల్గొన్నారు.
మనది దేశాన్ని సాదుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటని భారత రిజర్వు బ్యాంక్ స్వయంగా ప్రకటించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక్కడి బీజేపీ నేతలు చిత్ర విచిత్రమైన మనుషులని, దేనికీ సక్కగా జవాబు చెప్పరని ఎద్దేవాచేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మిషన్ కాకతీయ కట్టలపై నడుస్తూ.. కేసీఆర్ ఇచ్చిన చేపలను పట్టుకొని ఫొటోలు దిగిండని, కేసీఆర్ పంచిన గొర్రెలను పట్టుకొని, కేసీఆర్ నిర్మించిన రైతు వేదికల్లో పండుకొన్నడని అన్నారు. పచ్చని పొలాల మధ్య తిరుగుతూ తెలంగాణ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడని సోషల్ మీడియాలో ప్రజలు సెటైర్లు వేస్తున్నారని చెప్పారు. రైతుకు కేసీఆర్ చేసినంత దేశంలో ఎవరూ చేయలేదని, ఏ ప్రధాని, ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా రైతుబంధు,
రైతుబీమా తీసుకొచ్చారన్నారు.