హైదరాబాద్ : తెలంగాణ ఐటీ పాలసీ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని పార్లమెంటరీ ఐటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శశిథరూర్ అన్నారు. రాష్ట్ర ఐటీ రంగ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ కమిటీ ముందు ఇచ్చిన ప్రజెంటేషన్ అద్భుతంగా ఉన్నదని ప్రశంసించారు. రాష్ట్రంలో ఐటీ వృద్ధి, వివిధ రంగాల్లో ఎమర్జింగ్ టెక్నాలజీస్ వినియోగం, వాటితో ప్రజలకు అందుతున్న సౌకర్యాలపై మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని బృందం బుధవారం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
దీనిపై ఎంపీ శశిథరూర్ గురువారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘మంత్రి కేటీఆర్, ఆయన బృందం ఇచ్చిన ప్రజెంటేషన్ అద్భుతంగా ఉన్నది. విదేశాంగ విధానం మాదిరిగానే రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జాతీయ ఐటీ పాలసీపై దృష్టి పెట్టాల్సి ఉన్నదని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఐటీ రంగ ఫలాలను అందించడంలో మంత్రి కేటీఆర్ తెలంగాణను ఒక ఉదాహరణగా నిలుపుతున్నారు. ఈ ఐటీ పాలసీ ద్వారా మనం ఎంతో నేర్చుకోవచ్చు’ అంటూ శశిథరూర్ ట్వీట్ చేశారు.
Hugely impressive presentation by @KTRTRS &his team. I said that as with foreign policy,we need to look beyond political divides on IT policy. If @ministerktr is setting an example in Telengana that the rest of us can benefit from, we can all gain from a forward-looking IT policy https://t.co/q2Lx25IQIG
— Shashi Tharoor (@ShashiTharoor) September 9, 2021