హైదరాబాద్ సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ)/జగద్గిరిగుట్ట/మేడ్చల్: మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌ను ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నార్సింగిలోని పోలీసు అకాడమీ వద్ద శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో భగీరథ్‌ను అరెస్టు చేసినట్టు సైబరాబాద్ పోలీసు కమిషనర్ రమేశ్‌రెడ్డి వెల్లడించారు. దీంతో 9 రోజుల హైడ్రామాకు తెరపడింది. తన మైనర్ కుమార్తెను బండి భగీరథ్ లైంగిక వేధింపులకు గురిచేశారని ఆరోపిస్తూ ఆమె తల్లి ఈ నెల 8న పేట్‌బషీరాబాద్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేయడంలో జాప్యం చేశారు.
నిందితుడిని అరెస్టు చేయాలని ఓవైపు ప్రజలు, మహిళా, ప్రజా సంఘాల నుంచి డిమాండ్ పెరుగుతుండగా.. భగీరథ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. ఈలోగా కాల్ డాటా (సీడీఆర్) ఆధారంగా పోలీసులు భగీరథ్‌ను పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని పేర్కొంటూ ఈ నెల 13న కరీంనగర్‌లోని అతడి మేనమామకు నోటీసులు అందజేశారు. అయితే ఆ రోజున విచారణకు హాజరుకాని భగీరథ్.. తనకు రెండు రోజుల సమయం ఇస్తే పూర్తి ఆధారాలతో మే 15న హాజరవుతానంటూ పోలీసులకు ఒక మెయిల్ పంపించాడు. అయితే దీనిని పరిగణనలోకి తీసుకోని పోలీసులు నిందితుడికి మరో నోటీసు జారీచేశారు.

మరోవైపు హైకోర్టు సైతం అతడికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ నెల 13 నుంచే భగీరథ్ కోసం గాలింపు ప్రారంభించిన పోలీసులు, అతడు దేశం దాటి పారిపోకుండా 16న లుక్అవుట్ నోటీసు జారీచేశారు. నిందితుడి బంధువులు, స్నేహితులు, పరిచయస్తుల ఇండ్లపై నిఘా పెట్టిన పోలీసులు శనివారం బంజారాహిల్స్, కరీంనగర్‌లోని తండ్రి, బంధువుల ఇండ్లలో సోదాలు చేయడంతో భగీరథ్ చుట్టూ ఉచ్చు బిగుసుకుపోయింది. ఎట్టకేలకు శనివారం రాత్రి సైబరాబాద్ పోలీసులు నార్సింగిలోని అప్పా జంక్షన్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
భగీరథ్‌ను తానే పోలీసులకు అప్పగించామని కేంద్రమంత్రి బండి సంజయ్ ఓ ప్రకటనలో వెల్లడించగా.. పోలీసులు మాత్రం తామే అరెస్టు చేశామని చెప్పడం గమనార్హం. భగీరథ్‌ను శనివారం రాత్రి అతని 9.30 గంటల తర్వాత పేట్‌బషీరాబాద్ ఠాణాకు తరలించారు. అక్కడే ప్రత్యేక దర్యాప్తు అధికారి డీసీపీ రితిరాజ్ గైక్వాడ్ రెండు గంటలపాటు నిందితుడిని విచారించారు. నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు మేడ్చల్ పీహెచ్సీ వైద్యాధికారిని ఠాణాకు పిలిపించారు. విచారణ అనంతరం వైద్యపరీక్షలు నిర్వహించి, భగీరథ్‌ను అర్ధరాత్రి సమయంలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. మేడ్చల్ జిల్లా జడ్జి భగీరథ్‌కు ఈ నెల 29 వరకు రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.
ఈ కేసులో మైనర్ బాధితురాలిని పోలీసులు మేడ్చల్ కోర్టు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. బాధితురాలు, ఆమె తల్లి మేజిస్ట్రేట్ ఎదుట తమ వాంగ్మూలం ఇచ్చారు. సుమారు 40 నిమిషాలపాటు వారిద్దరు ఇచ్చిన వాంగ్మూలాలను రికార్డు చేశారు. పోలీసులు బాధితురాలి వాంగ్మూలాలను ఇప్పటికే రెండుసార్లు రికార్డు చేశారు.
పొక్సో కేసులో నిందితునిగా భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో అతడు శనివారం పోలీసుల ఎదుట లొంగిపోనున్న ట్టు ఉదయం వదంతులు వ్యాపించాయి. దీనికితోడు పేట్‌బషీరాబాద్ పోలీసుస్టేషన్, స్థానికంగా ఉన్న పీహెచ్‌సీతోపాటు మేడ్చల్ కోర్టు వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించడంతో వదంతులకు మరింత బలం చేకూరింది. మధ్యాహ్నం సమయంలో నిందితుడు సైబరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో లొంగిపోయాడని, లేదు పీఎస్‌లో సరెండర్ అయ్యాడని, అదీ కాదు నేరుగా న్యాయస్థానంలో లొంగిపోతున్నాడని సోషల్ మీడియాలో రకరకాల వదంతులు వ్యాపించా యి.
దీంతో మీడియా సిబ్బంది అన్ని వైపులా పరుగులు పెట్టక తప్పలేదు. చివరికి శనివారం రాత్రి.. తన కుమారుడిని ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో పోలీసులకు అప్పగించినట్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ సోషల్ మీడి యా ద్వారా ప్రకటించగా మరోవైపు తామే స్వయంగా పట్టుకొని అరెస్టు చేశామంటూ సైబరాబాద్ పోలీసు కమిషనర్ రమేశ్ వెల్లడించడం ఈ హైడ్రామాకు కొసమెరుపు.

కరీంనగర్: కరీంనగర్‌లోని జ్యోతినగర్‌లో ఉన్న భగీరథ్ అమ్మమ్మ ఇంట్లో శనివారం కరీంనగర్ టూటౌన్ సీఐ సృజన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీ చేశారు. భగీరథ్ కోసం ఇటు హైదరాబాద్, అటు కరీంనగర్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు అందులో భాగంగా జ్యోతినగర్‌లోని అతడి అమ్మమ్మ ఇంటికి కూడా వచ్చారు. టూటౌన్ సీఐ సృజన్‌కుమార్ ఆధ్వర్యంలో 10 మంది పోలీసుల బృందం ఆ ఇంటిలోని అన్ని గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. కాగా, భగీరథ్ నానమ్మ శకుంతల రెండు రోజుల కింద గుండెపోటుకు గురికావడంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు హైదరాబాద్‌కు తరలించారు. దీంతో కుటుంబమంతా హైదరాబాద్‌లోని దవాఖానలో ఉన్నారని ఆ ఇంటి వద్ద ఉన్న వ్యక్తులు పోలీసులకు వివరించారు.