నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 16: కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 45 రోజులవుతున్నా కొనే దిక్కులేదు. ఒక వేళ కాంటా పెట్టినా తరలించేందుకు లారీలు వస్తలేవు. అతికష్టం మీద గోదాము, మిల్లులకు తరలించినా అక్కడ దించుకునేందుకు హమాలీలు లేరు. ఇలా రైతులు పంటను అమ్ముకొనేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు శనివారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. గన్నీ బ్యాగుల కొరత తీర్చాలని డిమాండ్ చేస్తూ రైతులు శనివారం సంగారెడ్డి జిల్లా కందిలోని పీఎసీఎస్ కొనుగోలు కేంద్రం ప్రధాన గేటును మూసివేసి అక్కడే బైఠాయించారు.
కొనుగోలు కేంద్రానికి సకాలంలో లారీలను పంపించి ధాన్యాన్ని తరలించాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా కౌడిపల్లిలో మెదక్-హైదరాబాద్ జాతీయ రాస్తారోకో చేశారు. లారీలను పంపిస్తామన్న అధికారుల హామీతో ఆందోళన విరమించారు. కేంద్రాలకు వడ్లు తెచ్చి 47 రోజులైనా గింజ కూడా కొనలేదంటూ రామన్నపేట మండలం ఇంద్రపాలన నగరం గ్రామస్తులు యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. రోడ్డుపై ధాన్యం పోసి నిరసన తెలిపారు. ఏసీల్లో కూర్చుండే వారికి రైతుల బాధ ఏం తెలుస్తుందని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం, బస్తాల తరలింపులో జాప్యంపై రైతులు కన్నెర్రజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతారంలో రోడ్డెక్కారు.
ధాన్యం బస్తాలను రోడ్డుపై వేసి ధర్నా చేశారు. రెండు వేల బస్తాలు తూకం వేసి నాలుగు రోజులైనా లారీలు రాకపోవడంతో కేంద్రాల్లోనే మగ్గుతున్నాయని, వర్షాలు పడి తడిసిపోతే బాధ్యులెవరని ప్రశ్నించారు. కొనుగోలు చేసిన ధాన్యం మిల్లుకు తరలించేందుకు లారీలు లేకపోవడంపై పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి రైతులు పొత్కపల్లి-సుల్తానాబాద్ రహదారిపై అడ్డుగా ధాన్యం బస్తాలు వేసి రాస్తారోకో చేశారు. లారీలను సమకూర్చుతామని అధికారుల హామీతో ఆందోళన విరమించారు. లారీల కొరత తీర్చాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మెదలో రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. పంట కోసి 20 రోజులు దాటినా కాంటా వేస్తలేరని మండిపడ్డారు.
లారీల కొరత తీర్చాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కొట్టాల్ క్రాసింగ్ వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. లింగంపేట మండలంలోని ఐదు గ్రామాలకు చెందిన రైతులు ఎల్లారెడ్డి-కామారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించారు. పౌరసరఫరాల డీఎం శ్రీకాంత్ ఫోన్లో హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. మక్క జొన్నకు కాంటా వేయడంలో జాప్యం జరుగుతుండటంతో రైతులు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు సొసైటీ గోదాము వద్ద పడిగాపులు కాస్తున్నారు. వందకు పైగా ట్రాక్టర్లు మకజొన్న బస్తాల లోడ్‌తో బారులు తీరాయి. హమాలీలు లేక ట్రాక్టర్ల నుంచి ధాన్యం దిగుమతి కాకపోవడంతో రైతులు చెట్ల నీడన, ట్రాక్టర్ల కింద సేదతీరుతున్నారు.
మక్కలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రోటిగూడ రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. నెల రోజుల కింద మక్కలు తీసుకొచ్చామని, ఇప్పటి వరకూ కొన్నది లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. మండలానికి చెందిన పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, రైతులు కొనుగోలు కేంద్రం వద్దకు వచ్చి కేంద్రం ఇన్చార్జి నాగరాజును నిలదీశారు. ఈ క్రమంలో పలువురు రైతులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజులు దాటినా కొనుగోళ్లు పూర్తి కాలేదని మండిపడ్డారు.
ఎంతో కష్టపడి మకజొన్న పండించిన. పంటను మహబూబా బాద్ జిల్లా తొర్రూరు వ్యవసాయ మారెట్‌కు తీసుకొచ్చిన. నెలన్నర దాటిన తర్వాత కాంటా వేశారు. లారీల కొరత ఉన్నదని అధికారులు మమ్మల్ని ప్రైవేటు వాహనాలు పెట్టుకుని గోదాము దగ్గరకు తరలించుకోవాలని చెప్పారు. బస్తాకు ఎనిమిది రూపాయలు ఇస్తామని చెప్తున్నా, ప్రైవేటు వాహనానికి అదనంగా రూ.5 వేల వరకు ఖర్చు అవుతున్నది. అంత ఖర్చు పెట్టి వాహనంలో లోడు తీసుకొచ్చినా, గోదాము వద్ద దిగుమతి చేయడానికి హమాలీలు లేక రెండు రోజులుగా ఇకడే పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.
-నాగలబోయిన యాకన్న, రైతు చింతలపల్లి (మహబూబాబాద్ జిల్లా)

కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మెదలో జాతీయ రహదారిపై బైఠాయించిన రైతులు

మక్కలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా జన్నారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న రోటిగూడ రైతులు

సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని రైస్ మిల్లు వద్ద ధాన్యం అన్‌లోడింగ్‌పై యజమానిని అడిగి తెలుసుకుంటున్న పోలీసులు

కొనుగోలు చేసిన ధాన్యం మిల్లుకు తరలించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తిలో రాస్తారోకో చేస్తున్న రైతులు

లారీల్లో ధాన్యాన్ని తరలించాలని మెదక్ జిల్లా కౌడిపల్లిలో మెదక్-హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించిన రైతులు

గన్నీల కొరత తీర్చాలని సంగారెడ్డి జిల్లా కంది కొనుగోలు కేంద్రం ఎదుట ధర్నా చేస్తున్న రైతులు

వడ్లు తెచ్చి 47 రోజులైనా గింజ కూడా కొనలేదంటూ యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్న రైతులు

ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతారంలో రోడ్డెక్కిన రైతులతో మాట్లాడుతున్న ఎస్సై అశోక్