రవీంద్రభారతి/ముషీరాబాద్, అక్టోబర్ 10 : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations) ఇస్తామన్న కాంగ్రెస్.. చెల్లని జీవో ఇచ్చి ద్రోహం చేసిందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, పల్లె రవికుమార్, చెరుకు సుధాకర్, రాములుయాదవ్తో కలిసి సిరికొండ మాట్లాడారు. 75 ఏండ్లుగా ఆధిపత్య కులాలు దామాషాప్రకారం బీసీలకు రావాల్సిన వాటా రాకుండా అడ్డుపడుతున్నాయని, పాలకవర్గాలు, అగ్రవర్ణ కులాలు బీసీలను మోసం చేస్తూనే ఉన్నాయని చెప్పారు. దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించిన పార్టీలు బీసీలకు వాటా దక్కకుండా అడ్డుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. న్యాయస్థానాల్లో బీసీల వాణి లేదని అందుకే స్టే ఇచ్చారని తెలిపారు. ఈ దయనీయ స్థితికి కారణం బీసీల్లో ఐక్యత లేకపోవడమేనని వాపోయారు. బీసీ సమాజం పార్టీలకతీతంగా ఏకమై పోరాటం చేసి మన వాటా మనం దక్కించుకోవాలని, విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో రిజర్వేషన్లు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. చరిత్రాత్మక పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారని, బీసీలు కూడా అదే స్ఫూర్తితో పోరాటం చేసి వాటాలను దక్కించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. రాజ్యాంగ సవరణతోనే బీసీలకు రిజర్వేషన్ల పెంపు సాధ్యమన్న విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి విస్మరించారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను నమ్మించి గొంతు కోసిందని ఆవేదన వ్యక్తంచేశారు. బీసీ కోటాకు రాష్ట్రంలో అన్ని పార్టీలు మద్దతు తెలిపితే ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ పట్టించుకోలేదని, పార్లమెంట్లో ఏనాడూ ప్రస్తావించలేదని విమర్శించారు. కానీ బీహార్‌లో బీసీల ఓట్ల కోసం కాంగ్రెస్ దీన్ని వాడుకున్నదని, 42 శాతం బీసీ కోటా అంశం కోర్టుల్లో నిలవదని తెలిసినా మభ్యపెడుతూ వచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. షెడ్యూల్ 9లో చేర్చితేనే చట్టబద్ధత సాధ్యమని తెలిసినా మోసపూరిత డ్రామాలను రక్తికట్టించిందని మండిపడ్డారు.
బీసీల ఆత్మగౌరవాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దెబ్బతీశారని, కుట్రప్రకారమే బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా రెడ్డి జాగృతితో పిటిషన్లు వేయించి స్టే ఇప్పించారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. కోటాపై చెల్లని జీవోతో బీసీల నోటికాడి బుక్కను కాంగ్రెస్ లాక్కున్నదని, ఆ పార్టీ అంతమే తమ పంతంగా బీసీలు రగిలిపోతున్నారని స్పష్టంచేశారు. మండల్ కమిషన్ తరహాలో ఉద్యమం చేపడుతామని చెప్పారు. ఈ నెల 14న రాష్ట్ర బంద్ నిర్వహిస్తున్నామని, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, కులసంఘాలు, విద్యార్థులు, మేధావులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలను వాయిదా వేయడాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని 56 శాతం బీసీల హక్కులకు విఘాతం కలిగిస్తుందని చెప్పారు. 30 బీసీ సంఘాల నేతలు ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యారని, వారి వాదన ఒక్కటీ వినకుండా ఏకపక్షంగా స్టే ఇవ్వడం బాధాకరమని వాపోయారు. ఆర్టికల్ 243 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు అమలు చేయవచ్చని స్పష్టంగా ఉన్నదని, బీసీలకు రిజర్వేషన్లు అంటే సీలింగ్ సాకు చెప్తున్నారని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేసినప్పుడు ఆ సీలింగ్‌ను పక్కన పెట్టి, బీసీలకు మాత్రమే సిలింగ్ ఎందుకని నిలదీశారు. బీసీ రిజర్వేషన్లను పెంచిన ప్రతిసారీ వ్యతిరేకులు కోర్టులను వేదికగా చేసుకొని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. కోర్టులు కూడా బీసీలకు న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ కోరాలని డిమాండ్ చేశారు. కోర్టు ఇంకా విచారణ చేపట్టాల్సి ఉండెనని, ఎందుకు ఆదరాబాదరాగా స్టే విధించాల్సి వచ్చిందని ప్రశ్నించారు.
బీసీ సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని, ఈ జీవోలు చెల్లవని తెలిసే సీఎం రేవంత్‌రెడ్డి బీసీలను దగా చేశారని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. తెలంగాణలో అనేక ఉద్యమాలు వచ్చాయని, అలానే బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమం ఉధృతంగా వచ్చిందని గుర్తుచేశారు. ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి 42 శాతం రిజర్వేషన్లను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. బీసీ బిల్లుపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే నాటకాలు కట్టిపెట్టి ఢిల్లీకి కదలాలని, వెంట వచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమని ప్రకటించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, జిల్లపల్లి అంజి, చెరుకు మణికంఠ, రాజునేత, పగిల సతీశ్, రాందేవ్, నిఖిల్, నాగుల శ్రీనివాస్‌యాదవ్, అనంతయ్య, రామ్‌కోఠి, రాంమూర్తి, రాజు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం తీరని అన్యాయం. జీవో-9 అమలుపై హైకోర్టు స్టే ఇవ్వడంపై సీఎం రేవంత్‌రెడ్డి నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలి. బీసీల నోటికాడి ముద్ద ను లాగేశారు. రాష్ట్ర ప్రభుత్వ తొందరపాటుతోనే మాకు అన్యాయం జరిగింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తూనే ఉన్నది. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి నాటకాలాడారు.
కామారెడ్డి డిక్లరేషన్‌లో భాగంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్స హామీ ఇచ్చింది. ఇచ్చిన రిజర్వేషన్లను నిలబెట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్‌కు లేదా..? ఇదంతా ముందస్తు ప్రణాళికతో ఆడిన డ్రామా. బీసీల ఓట్లు దండుకుని కేంద్రంలో అధికారంలోకి రావాలన్నదే కాంగ్రెస్ ఎత్తుగడ. చట్టబద్దంగా రిజర్వేషన్లు కల్పించాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు లేదు. ఉంటే కోర్టులో ఎందుకు నిలబెట్టుకోలేక పోయింది?.