హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 మెయిన్స్ కేసులో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)కు హైకోర్టు ఊరటనిచ్చింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష పేపర్లను పునఃమూల్యాంకనం చేయాలని, లేనిపక్షంలో తిరిగి మెయిన్స్ పరీక్షలను నిర్వహించాలని సింగిల్ జడ్జి వెలువరించిన తీర్పుపై హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం బుధవారం స్టే విధించింది. ఈ ఉత్తర్వుల తరువాత టీజీపీఎస్సీ గ్రూప్-1 నియామకాల ప్రక్రియ చేపడితే, అవి తాము వెలువరించే తుది తీర్పుకు లోబడి ఉంటాయని షరతు విధించింది. తదుపరి విచారణను అక్టోబర్ 15వ తేదీకి వాయిదా వేసింది.
ఈ లోగా ప్రతివాదులు తమ వాదనలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ నోటీసులను జారీచేసింది. సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయాలని కోరుతూ టీజీపీఎస్సీ, గ్రూప్ -1 పోస్టుకు అర్హత సాధించిన షగుప్తా ఫిరౌషీ అనే అభ్యర్థి, ఇతరులు వేర్వేరుగా దాఖలు చేసిన పలు అప్పీల్ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. పరీక్షల నిర్వహణలో లోపం, పేపర్ల లీకేజీ, మాస్ కాపీయింగ్.. వంటి తీవ్రమైన అభియోగాలు, వాటికి ఆధారాలు ఉన్నప్పుడు ఉద్యోగ నియామక ప్రక్రియలో కోర్టుల జోక్యానికి ఎకువ అవకాశం ఉంటుందని స్పష్టంచేసింది.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ వ్యవహారంలో అభ్యర్థులకు రెండు హాల్ టికెట్లు జారీ చేశారని, పరీక్షా కేంద్రాలు పెరిగాయని, తదితర ఆరోపణలనే సింగిల్ జడ్జి వద్ద పిటిషనర్లు లేవనెత్తారని, వీటిపై వెలువరించిన తీర్పు అమలును నిలిపివేస్తూ మధ్యంతర స్టే ఆదేశాలు ఇస్తున్నట్టు స్పష్టం చేసింది. తొలుత టీజీపీఎస్సీ తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి, సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్‌రెడ్డి, అర్హత పొందిన అభ్యర్థుల తరఫున సీనియర్ న్యాయవాదులు దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి, కే లక్ష్మీనరసింహ, ఎస్ మురళీధర్ వాదనలు వినిపించారు. విచారణ సమయంలో ధర్మాసనం సింగిల్ జడ్జి తీర్పులోని అంశాలపై పలు ప్రశ్నలు వేసింది.
ఈ నేపథ్యంలో అర్హులైన అభ్యర్థుల తరఫు న్యాయవాదులు కల్పించుకుని సింగిల్ జడ్జి తీర్పు అమలును నిలిపివేస్తూ స్టే ఇవ్వాలని కోరారు. గ్రూప్-1 మెయిన్స్ పేపర్లను శాస్త్రీయ పద్ధతిలో మూల్యాంకనం చేశారని చెప్పారు. ఒకరికి తెలియకుండా మరొకరు రెండుసార్లు మూల్యాంకనం చేశారని, వీరి మధ్య మారులు 15 శాతం వ్యత్యాసం ఉంటే మూడోసారి మూల్యాంకనం జరిగిందని తెలిపారు. నోటిఫికేషన్ నిబంధనల్లో రీకౌంటింగ్‌కు మాత్రమే అవకాశం ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా తిరిగి మూల్యాంకనం చేయాలని, లేనిపక్షంలో తిరిగి పరీక్ష నిర్వహించాలని సింగిల్ జడ్జి తీర్పు చెప్పడాన్ని తప్పుపట్టారు.
ఈ తీర్పు వల్ల కొత్త సమస్యలు తెలుత్తుతాయని చెప్పారు. తెలుగులో రాస్తే తకువ మంది, ఇంగ్లిషులో రాసిన వాళ్లు ఎకువ మంది ఉత్తీర్ణత సాధించడాన్ని సింగిల్ జడ్జి ప్రామాణికంగా తీసుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. మాస్ కాపీయింగ్/పేపర్‌లీకేజీ/మోసం జరిగాయనే అభియోగాలు లేకపోయినప్పటికీ సింగిల్ జడ్జి జోక్యం చేసుకోవడం చెల్లదని తెలిపారు. అసాధారణ పరిస్థితుల్లోనే పరీక్షలకు వీలుంటుందని, పశ్చిమ బెంగాల్ వర్సెస్ బైషాకి భట్టాచార్య కేసులో పరీక్ష రద్దు విషయంలో వెలువరించి మార్గదర్శకాలకు విరుద్ధంగా తీర్పు ఉన్నదని చెప్పారు.