ఎల్బీనగర్, సెప్టెంబర్ 24 : జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సిందేనంటూ నిరుద్యోగులు కదం తొక్కారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీని నిలబెట్టుకోవాలంటూ నిరాహార దీక్ష చేస్తున్న అశోక్‌కు మద్దతుగా వేలాది మంది యువతీయువకులు హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. యువత రోడ్డెక్కడంతో దిల్‌సుఖ్‌నగర్‌లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీని నిలబెట్టుకోవాలని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిరుద్యోగులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ తమకు న్యాయం చేయాలని యువత డిమాండ్ చేసింది. దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరాహరదీక్ష చేస్తున్న అశోక్ బ్యానర్‌తో పాటుగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటూ సీఎం, డిప్యూటీ సీఎంల ఫోటోలతో కూడిన బ్యానర్లను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దిల్సుఖ్నగర్ ప్రాంతంలోని వివిధ స్టడీ సెంటర్లు, కాలేజీలకు చెందిన యువతీయువకులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, రెండు లక్షల ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2024 అక్టోబర్‌లో ప్రకటించిన విధంగా విద్యుత్ సంస్థలో ఏఈ, ఎస్ఈ, జేఎల్ఎం పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని, జీవో ఎంఎస్ నంబర్ 108 స్థానంలో కొత్త జీవోను ప్రకటించాలని కోరారు. నిరాహారదీక్ష చేస్తున్న అశోక్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.