ఇల్లెందు, సెప్టెంబర్ 24: తమ అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంక్షేమ శాఖలోని వివిధ విభాగాల్లో డెయిలీ వైజ్, ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారం నాటికి 13వ రోజుకు చేరింది. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కార్మికులు ఇల్లెందు పాత బస్టాండ్ సెంటర్ నుంచి బతుకమ్మలతో జగదాంబ సెంటర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఆటపాటలతో నిరసన తెలిపారు. వీరికి సంఘీభావంగా భద్రాచలం మాజీ ఎంపీ మిడియం బాబూరావు ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరకొర వేతనాలతో ఏళ్లతరబడి పనిచేస్తున్న కార్మికుల జీతాలను తగ్గిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడం సిగ్గుచేటన్నారు. కార్మికుల్లో ఎక్కువగా ఆదివాసీ గిరిజనులే ఉన్నారని, వారి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్మికులకు పాత పద్ధతిలోనే జీతాలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని, సమస్యను ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు కారం పుల్లయ్య, దుగ్గి కృష్ణ, వజ్జ సురేశ్, కోడెం బోస్, అబ్దుల్ నబి, తాళ్లూరి కృష్ణ, భద్రయ్య, ముత్తయ్య, నాగేశ్వరరావు, స్వామి, మంగ, లక్ష్మణ్, పాపారావు, రఘు, జయ, లాలయ్య, రాజు, నాగులు తదితరులు పాల్గొన్నారు.