మినీ సిరిసిల్లగా పేరు పొందిన గర్శకుర్తిలో చేనేత కార్మికులు మళ్లీ ఉపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధి లేక పొట్ట చేతబట్టుకుని విదేశాలకు, ముంబై, భీవండి వంటి ప్రాంతాలకు వెళ్లి అష్టకష్టాలు పడ్డారు. స్వరాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బతుకమ్మ చీరెల ఆర్డర్‌తో ఉపాధిని కల్పించి కార్మికుల్లో వెలుగులు నింపారు. పదేండ్ల పాటు ఎలాంటి చింతాలేకుండా నేతన్నలంతా ఉన్న ఊరిలోనే ఉపాధి పొందారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మ చీరెల ఉత్పతి పూర్తిగా నిలిచిపోయి ఆగమయ్యారు. ఏడాది కాలంగా పనులు లేక అవస్థలు పడుతున్నారు.
గంగాధర, సెప్టెంబర్ 24 : గంగాధర మండలంలోని గర్శకుర్తి గ్రామంలో 1400 ఇండ్లు ఉండగా 800 పద్మశాలీ కుటుంబాలున్నాయి. మొత్తం 7 వేల జనాభా ఉండగా, ఇందులో చేనేత కుటుంబాల జనాభానే నాలుగు వేల వరకు ఉంటుంది. గ్రామంలో దాదాపు 1500 వరకు వపర్ లూమ్స్ ఉండగా, 600 మంది కార్మికులు పని చేస్తున్నారు. 2014లో స్వరాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రణాళిక చేశారు.
బతుకమ్మ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున బతుకమ్మ చీరెలు ఇవ్వాలని సంకల్పించారు. గర్శకుర్తిలోని పవర్ లూమ్స్‌కు 52 లక్షల మీటర్ల చీరెల తయారీ ఆర్డరు ఇవ్వడంతో ఇక్కడి కార్మికులకు చేతి నిండా పని దొరికింది. వీటితోపాటు 2 లక్షల 13 వేల మీటర్ల స్కూల్ యునీఫాం, 24 వేల మీటర్ల రంజాన్ వస్ర్తాలకు ఆర్డర్ ఇచ్చారు. దీంతో పదేళ్ల పాటు ఎలాంటి కష్టం లేకుండా ఉపాధి పొందినట్లు కార్మికులు తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో పనుల్లేక అవస్థలు
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మ చీరెల తయారీ నిలిచిపోయింది. దీంతో ఉపాధి లేక కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యామ్నాయంగా కలర్ చీరెలు తయారు చేసి ఉపాధి పొందడానికి ప్రయత్నిస్తుండగా, వాటిని నేయడమే నేరమన్నట్టు నాలుగు దశాబ్దాల కిందటి జీవోతో విజిలెన్స్ అధికారులు పవర్‌లూమ్స్‌పై దాడులు చేస్తూ, కార్మికులపై కేసులు నమోదు చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారు.
అటు ఉపాధిలేక, ఇటు విజిలెన్స్ దాడులతో తమ బతుకులు ఆగమవుతున్నా పట్టించుకునే దిక్కు లేదని చేనేత కార్మికులు ఆరోపిస్తున్నారు. రెండు నెలల క్రితం 29లక్షల మీటర్ల ఇందిరమ్మ చీరెలకు సంబంధించి ఆర్డర్లు ఇచ్చినా.. మెటీరియల్ ఆలస్యం కావడంతో పని లేకుండా పోయిందని వాపోతున్నారు. ఏడాది కాలంగా మరమగ్గాలు నడువక పోవడంతో ఇప్పుడు వాటిని మరమ్మతు చేయాల్సి వస్తున్నదని ఆవేదన చెందుతున్నారు.
నాలుగు దశాబ్దాల కిందటి జీవో అమలు
నాలుగు దశాబ్దాల క్రితం రాష్ర్టాల్లో విరివిగా చేనేత మగ్గాలు ఉండడంతో వీటిపై రంగు రంగుల చీరెలు, వస్ర్తాలు తయారు చేసేవారు. చేనేత మగ్గాలపై ఉత్పతైన చీరెలు, గుడ్డకు మార్కెట్లో డిమాండు తగ్గకూడదన్న ఉద్దేశంతో అనాటి ఎంపీ ప్రగడ కోటయ్య పవర్‌లూమ్స్‌పై కలర్ చీరెలు, వస్ర్తాల తయారీని నిషేధించాలని కోరడంతో 1985లో హ్యాండ్లూమ్ రిజర్వేషన్ ఆఫ్ 1985 ఆర్టికల్ ఫర్ ప్రొడక్షన్ జీవోను ఆనాటి కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది.
నాలుగు దశాబ్దాల క్రితం జీవో జారీ కాగా, నేటికీ అదే జీవోతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పవర్ లూమ్స్‌పై దాడులు చేస్తూ చేనేత కార్మికులను బెంబేలెత్తిస్తున్నారు. కాలక్రమేణా చేనేత మగ్గాలు ఉనికిని కోల్పోయి వాటి స్థానంలో పవర్ లూమ్స్ వచ్చాయని, ఆనాటి కాలానికి అనుగుణంగా తీసిన జీవోను చూపుతూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇప్పుడు దాడులు చేయడంపై కార్మికులు మండిపడుతున్నారు.
బతుకమ్మ చీరెల తరహాలో ఆర్డర్లివ్వాలి
కేసీఆర్ ఉన్నప్పుడు పవర్‌లూమ్స్‌పై ఎప్పుడూ విజిలెన్స్ దాడులు జరగలేదు. రంది లేకుంట ధీమాగా పని చేసుకున్నం. బతుకమ్మ చీరెల తయారీ నిలిచిపోవడంతో పొట్టతిప్పల కోసం ప్రత్యామ్నాయంగా చీరెలను తయారు చేస్తే మళ్లీ అధికారులు దాడులు చేస్తున్నరు. అటు చీరెల తయారీ లేక, ఇటు అధికారుల దాడితో ఏం చేయాలో అర్థం కావడం లేదు. బతుకమ్మ చీరెల తరహాలో ప్రభుత్వం చీరెల తయారీకి ఆర్డుర్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి.
– బుధారపు గంగాధర్, చేనేత కార్మికుడు
బతుకమ్మ చీరెలతో ఉపాధి
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ సారు బతుకమ్మ చీరెలకు అవకాశం ఇచ్చి మాకు ఉపాధి కల్పించిన్రు. పదేళ్లపాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవితం గడిచిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక బతుకమ్మ చీరెల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నం. నాకు 8 సాంచెలు ఉంటే వాటన్నింటి మీద బతుకమ్మ చీరెలు తయారు చేసిన. ప్రస్తుతం కేవలం రెండే నడుస్తున్నయ్. 6 సాంచెలు ఖాళీగా ఉంటున్నయ్.
– దూస అనిల్, చేనేత కార్మికుడు
జీవోను రద్దు చేయాలి
ఎప్పుడో నలభై ఏండ్ల కింద ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఇచ్చిన జీవోను అధికారులు ఇప్పటి వరకు కొనసాగించడం హేయమైన చర్య. నలభై ఏండ్ల కింద ఉన్నన్ని చేనేత మగ్గాలు ఇప్పుడు లెవ్వు. కాలానికి అనుగుణంగా జీవోలో మార్పులు తీసుకురావాలి. ఇప్పుడు చాలా వరకు మరమగ్గాలే ఉన్నయ్. ఆనాటి జీవోను ఇప్పటికీ కొనసాగిస్తే ఎలా..? ప్రభుత్వం జీవోను రద్దు చేసి, బతుకమ్మ చీరెల తరహాలో ఏటా ఆర్డర్లు ఇస్తూ ఉపాధి కల్పించాలి.
– మిట్టపెల్లి సత్తయ్య, చేనేత కార్మికుడు
కేసులు ఎత్తివేయాలి
పదిహేను రోజుల కిందట విజిలెన్స్ అధికారులు మా ఊరి పవర్ లూమ్స్‌పై దాడులు చేసిన్రు. కలర్ చీరెలు నేస్తున్నామన్న నెపంతో కేసులు నమోదు చేసిన్రు. నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వచ్చి చేనేత జౌళీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్‌తో మాట్లాడిన్రు. కేసులు ఎత్తివేయిస్తామని చెప్పిన్రు. కానీ, పోలీసులు మళ్లీ పోలీస్ స్టేషన్‌కు పిలిపించుకుని సంతకాలు పెట్టించుకున్నరు. ప్రభుత్వం, ఎమ్మెల్యే స్పందించి కార్మికులపై పెట్టిన కేసులను పూర్తిగా ఎత్తివేయించాలి.
– మిట్టపెల్లి వెంకటేశం, చేనేత కార్మికుడు