ఖమ్మం సిటీ, సెప్టెంబర్ 24: వ్యాధుల నివారణ చర్యల్లో భాగంగా ముందస్తుగా హెల్త్ కేర్ సర్వీస్ ప్రొవైడర్స్‌కు వ్యాక్సినేషన్ చేస్తున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ కళావతీబాయి తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆదేశాల మేరకు బుధవారం ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన హెపటైటిస్-బీ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రిన్సిపాల్ డాక్టర్ టి.శంకర్‌తో కలిసి ఆమె ప్రారంభించారు. మెడికల్ కాలేజీ విద్యార్థులు, ఆఫీస్ సిబ్బందికి దగ్గరుండి టీకాలు వేయించారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ హెపటైటిస్-బీ అనేది కాలేయాన్ని ప్రభావితం చేసే ప్రమాదకరమైన వైరల్ వ్యాధి అని, రక్తం, శరీర ద్రవాలతో ప్రత్యక్ష సంబంధం కారణంగా హెల్త్ కేర్ వర్కర్స్ ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతుంటారని తెలిపారు. అందుకోసం అత్యంత సురక్షితమైన, ప్రభావవంతమైన టీకాను అందిస్తున్నామని చెప్పారు. మొత్తం 811 మందికి హెపటైటిస్-బీ వ్యాక్సిన్ ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్‌వో పి.వెంకటరమణ, డాక్టర్ రాజేశ్వరరావు, డాక్టర్ సరిత, డాక్టర్ కేసగాని సృజనగౌడ్, డాక్టర్ రమాదేవి, డాక్టర్ సమతారాణి, డాక్టర్ ప్రీతి పాల్గొన్నారు.
ఖమ్మం నగరంలోని పలు ప్రభుత్వ ఆసుపత్రులను డీఎంహెచ్‌వో డాక్టర్ బి.కళావతీబాయి తనిఖీ చేశారు. ముస్తఫా నగర్‌లోని యూపీహెచ్సీ, పాత మున్సిపాలిటీ వద్ద ఏర్పాటు చేసిన సెంటర్‌ను ఆమె సందర్శించారు. ఆయా కేంద్రాల్లోని ఓపీ రికార్డులు, ల్యాబ్, ఫార్మసీ, ఇతర రిజిస్టర్లతోపాటు ఆరోగ్య కేంద్రం సేవలు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. వివిధ సేవల నిమిత్తం వచ్చిన రోగులతో మమేకమై అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది దవాఖానకు వచ్చే రోగులతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. సెల్‌ఫోన్స్ వినియోగం తగ్గించి రోగులతో నేరుగా మాట్లాడి నాణ్యమైన సేవలు అందించాలన్నారు. సీజనల్ వ్యాధులు, డెంగ్యూ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సీనియర్ సిటిజన్స్, గర్భిణులను జాగ్రత్తగా చూడాలని ఆదేశించారు.