హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటాపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.ఏపీలో ఎంబీబీఎస్ చేసిన విద్యార్ధులకు కూడా ఆర్టికల్ 371(డీ) ప్రకారం తెలంగాణలో స్థానికత కోటాలో పీజీ సీట్లు కేటాయించాలని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇటీవల హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆర్టికల్ 371(డీ) ప్రకారం రాయలసీమ, ఆంధ్ర రీజియన్లో ఎంబీబీఎస్ చదివిన వారు కూడా తెలంగాణలో పీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోటా కింద అర్హులని తీర్పు ఇచ్చింది.
హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అయితే దేశవ్యాప్తంగా పీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోటా చెల్లదంటూ ఇటీవల జస్టిస్ సుధాంశు దులియా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ పిటిషన్పై విచారణను విసృ్తత ధర్మాసనానికి బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీనిపై జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. తదుపరి విచారణ ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా వేసింది.