హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఓపెన్ యాక్సెస్ విద్యుత్తు వినియోగదారులకు నైట్ అలవెన్స్ రద్దుచేసిన రాష్ట్ర ప్రభుత్వం.. అడిషనల్ సర్‌చార్జ్ రూపంలో వారిపై మరో భారాన్ని మోపేందుకు సిద్ధమైంది. ఒక్కో యూనిట్‌పై రూ.0.59 చొప్పున అదనపు సర్‌చార్జ్ విధించేందుకు అనుమతించాలని కోరుతూ విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)లు రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలికి పిటిషన్లు సమర్పించాయి. ఈఆర్సీ అనుమతిస్తే ఓపెన్ యాక్సెస్ వినియోగదారులపై 2026-27 ప్రథమార్ధం(జనవరి నుంచి జూన్) వరకు అదనపు భారం పడుతుంది. ఓపెన్ యాక్సెస్ వినియోగదారులు డిస్కంతో సంబంధం లేకుండా మార్కెట్లో విద్యుత్తును కొనే వెసులుబాటు ఉండటంతో ఎక్సేంజీలో తక్కువ ధరకు దొరికినప్పుడు కొనుక్కుంటున్నారు.
డిస్కం నుంచి సరఫరా అయ్యే విద్యుత్తును వారు వాడుకోవడంలేదు. దీంతో డిస్కంలు నష్టపోతున్నాయి. పవర్ప్లాంట్లను బ్యాక్‌డౌన్ చేయాల్సి వస్తున్నది. డిస్కంలు ఫిక్స్డ్ చార్జీల రూపంలో జనరేటర్లకు చెల్లించాల్సి వస్తుండటంతో ఆర్థికంగా అవి దెబ్బతింటున్నాయి. ఆ నష్టాలను పూడ్చుకునేందుకు ఇప్పుడు డిస్కంలు సర్‌చార్జ్ రూపంలో వినియోగదారులపై భారం మోపేందుకు డిస్కంలు సిద్ధమయ్యాయి. పిటిషన్లపై ఈ ఆర్సీ జనవరి 21న విచారణ జరపనున్నది.