హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): వివిధ ప్రాజెక్టుల డీపీఆర్‌లకు సంబంధించిన వ్యవహారాల్లో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారమే నడుచుకోవాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)కు తెలంగాణ ప్రభుత్వం స్పష్టంచేసింది. రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన వివిధ ప్రాజెక్టుల డీపీఆర్‌లను కేంద్ర జల సంఘానికి వెంటనే నివేదించాలని డిమాండ్ చేసింది. జీఆర్ఎంబీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌కు బుధవారం తెలంగాణ సాగునీటి పారుదలశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ ఘాటుగా లేఖ రాశారు.
ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకొస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సీతారామ లిఫ్ట్, పీవీ నర్సింహారావు సుజల స్రవంతి (తుపాకులగూడెం), ముక్తీశ్వర (చిన్న కాళేశ్వరం) ఎత్తిపోతల పథకం, మోడికుంటవాగు ప్రాజెక్టు, చౌట్పల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకం, చనాకా-కొరాట బరాజ్‌కు సంబంధించిన పూర్తి నివేదికలను జీఆర్ఎంబీకి రెండు నెలల క్రితమే సమర్పించింది. ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 85 (8)డీ ప్రకారం రివర్ బేసిన్లో కొత్తగా ఏదైనా సాగునీటి ప్రాజెక్టును చేపట్టినప్పుడు ఆ ప్రాజెక్టు వల్ల ట్రిబ్యునల్ అవార్డుల మేరకు ఇతర రాష్ర్టాల నీటి హక్కులకు ఏమైనా భంగం కలుగుతుందా? అనే అంశా న్ని మాత్రమే రివర్ బోర్డులు పరిశీలించాల్సి ఉంటుంది.
ఆ తర్వాత సాంకేతిక అనుమతుల కోసం ఆయా డీపీఆర్‌లను కేంద్ర జల సంఘానికి నివేదించాల్సి ఉంటుంది. ఇదే పద్ధతిని కృష్ణా నదీ యాజమాన్య మండలి (కేఆర్ఎంబీ) అనుసరిస్తున్నది. జీఆర్ఎంబీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. తన పరిధిలో లేని సాంకేతిక అంశాలను కూడా అడుగుతూ తెలంగాణ సర్కారు ఇచ్చిన డీపీఆర్‌లను సీడబ్ల్యూసీకి పంపకుండా తాత్సారం చేస్తున్నది. ఈ విషయమై గతనెల 26 న తెలంగాణ సర్కారు జీఆర్ఎంబీకి ఓ లేఖను రా సింది. అయినా డీపీఆర్‌లను సీడబ్ల్యూసీకి పంపకుండా మెలిక పెట్టింది. డీపీఆర్‌లను పరిశీలించే అంశాన్ని బోర్డ్ మీటింగ్‌లో చర్చించి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని కొత్త వాదాన్ని తీసుకొచ్చింది. దీనిపై సర్కారు అభ్యంతరం తెలిపింది.
అనుమతులిచ్చే అధికారం కేంద్రానిదే
జీఆర్ఎంబీ రాసిన లేఖను తెలంగాణ సర్కారు తీవ్రంగా ఆక్షేపించింది. గెజిట్ ప్రకారం ఆరునెలల్లోగా ఆయా ప్రాజెక్టులు ఆమోదం పొందాల్సి ఉన్నదని తెలిపింది. ఉమ్మడి ఏపీలో కేటాయించిన 967.94 టీఎంసీల నీటి కేటాయింపుల పరిధిలోనే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులున్నాయని, వాటివల్ల ఏపీ ప్రాజెక్టుల నీటి కేటాయింపులకు ఏ నష్టం వాటిల్లబోదని స్పష్టంచేసిం ది. తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌లకు సంబంధించిన ప్రాజెక్టులన్నీ ఉమ్మడి రాష్ట్రం లో చేపట్టినవేనని, 2010 నుంచే పురోగతిలో ఉన్నాయని, అవేవీ కొత్తవి కావని తేల్చిచెప్పింది. ఆ ప్రాజెక్టుల డీపీఆర్‌లలో ఇరిగేషన్ ప్లానింగ్, నీటి లభ్యత తదితర సాంకేతిక అంశాలను పరిశీలించే అధికారం ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం జీఆర్ఎంబీకి లేదని నొక్కిచెప్పింది. డీపీఆర్‌లకు ఆమోదం తెలుపుతామని గతంలో కేంద్ర జలశక్తిశాఖ హామీ ఇచ్చిందని గుర్తుచేసింది.