IAS Shiva Shankar | ఐఏఎస్ అధికారి లోతేటి శివశంకర్‌ను తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది. కేంద్ర పరిపాలన శాఖ ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
లోతేటి శివశంకర్ 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన సొంతూరు విజయనగరం జిల్లాలోని ధర్మవరం. ఆయన హైదరాబాద్ ( రంగారెడ్డి జిల్లా పరిధి) మామగారి ఇంట్లో ఉండి సివిల్ సర్వీసెస్ చదివేవారు. యూపీఎస్సీ దరఖాస్తులో తన శాశ్వత చిరునామాగా దాన్నే పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కేడర్‌ను నిర్ణయించేటప్పుడు చిరునామా ఆధారంగా ఆయన్ను తెలంగాణకు కేటాయించారు. దీనిపై ఆయన అప్పట్లో క్యాట్‌ను ఆశ్రయించారు.
ఐఏఎస్‌కు ఎంపికైన తర్వాత యూపీఎస్సీకి, ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి అకాడమీలో సమర్పించిన వివరాల్లో తాను విజయనగరం వాసిని అని, సొంత రాష్ట్రం ఏపీ అని స్పష్టంగా పేర్కొన్నానని క్యాట్‌కు శివశంకర్ తెలిపారు. దీన్ని ఖండేకర్ కమిటీ, డీవోపీటీలు దీన్ని పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. శివశంకర్ పిటిషన్‌పై విచారణ జరిపిన క్యాట్.. ఆయన్ను ఏపీకి కేటాయిస్తూ ఫిబ్రవరి 28న తీర్పునిచ్చింది. నాలుగు వారాల్లో అమలు చేయాలని ఆదేశించింది. అయినప్పటికీ డీఓపీటీ నుంచి స్పందన లేకపోవడంతో..మళ్లీ జూన్ 5వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే శివశంకర్ హైకోర్టును ఆశ్రయించగా.. ఏపీకి బదిలీ చేయాలని జూలై 3వ తేదీన ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ శివశంకర్‌ను ఏపీకి కేటాయించకపోవడంతో ఇప్పుడే నేరుగా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. తక్షణమే శివశంకర్‌ను రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర పరిపాలన శాఖ ఆదేశించింది. శివశంకర్‌ను ఏపీకి కేటాయించాలన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.