AP News | విధి వంచించిన ఓ యువకుడిని సొంతవాళ్లే మోసం చేశారు. అంతా బాగున్నప్పుడు విదేశాలకు వెళ్లి లక్షలు సంపాదించి పంపిస్తే.. వీల్‌చైర్‌లో పడితే ట్రీట్మెంట్ కోసం డబ్బులు కట్టాల్సి వస్తుందని కనీసం ఇంట్లోకి కూడా రానివ్వలేదు. కన్నతండ్రితో కలిసి తోడబుట్టిన అన్నదమ్ముళ్లే బయటకు గెంటేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరుకు చెందిన తాడిశెట్టి నాగేశ్వరరావుకు ముగ్గురు కుమారులు. వారిలో రెండో కుమారుడు నాగ త్రినాథ్ ఉపాధి కోసం 2018లో సింగపూర్ వెళ్లాడు. అక్కడే ఓ కంపెనీలో పనిచేస్తూ.. ప్రతి నెల రూ.60 వేలను తన తండ్రి, తమ్ముడి బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేసేవాడు. 2024 జూలైలో స్వగ్రామానికి వచ్చేశారు. ఆ సమయంలో తమ్ముడి పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. దీనిపై తండ్రితో అతనికి చిన్న గొడవ జరిగింది. ముందుగా తనకే పెళ్లి చేయాలని నాగత్రినాథ్ డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో నాగత్రినాథ్కు సింగపూర్‌లో మళ్లీ ఉద్యోగావకాశం ఇచ్చింది.
మళ్లీ ఉద్యోగం రావడంతో సింగపూర్‌కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా నాగత్రినాథ్ ప్రమాదానికి గురయ్యాడు. 2024 డిసెంబర్ 31వ తేదీన బైక్ నుంచి జారిపడటంతో నడుముకు గాయమై రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. దీంతో వైజాగ్‌లోని ఓ హాస్పిటల్లో ఫిజియోథెరపీ వైద్యం చేయించుకుంటున్నాడు. దీనికోసం రూ.6లక్షల వరకు ఖర్చయ్యింది. ఇందులో తన దగ్గర ఉన్న రూ.4 లక్షలను ట్రీట్మెంట్కు చెల్లించాడు. మిగిలిన రెండు లక్షలను చెల్లిస్తేనే వైద్యం చేస్తామని హాస్పిటల్ నిర్వాహకులు చెప్పారు. దీంతో ఆ సొమ్ము కోసం సోమవారం ఉదయం వేల్పూరులోని ఇంటికి వచ్చాడు. ఈ విషయం తెలిసి నాగత్రినాథ్ను తండ్రి నాగేశ్వరరావు, అన్న నాగశ్రీను, తమ్ముడు నాగరాజు ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో సాయంత్రం వరకు ఇంటి ఎదుటే రోడ్డుపైనే వీల్‌చైర్‌లోనే ఉండిపోయారు. ఈ ఘటనతో నిర్ఘాంతపోయిన శ్రీనాథ్ తన ఆవేదనను వెల్లగక్కాడు. సింగపూర్‌లో సంపాదించిన సొమ్మంతా మీ బ్యాంక్ అకౌంట్లలోనే జమ చేశా.. ఇప్పుడు నన్నే ఇంట్లోకి రానివ్వరా అంటూ కంట తడిపెట్టుకున్నాడు. ఇది చూసి స్థానికులు చెల్లించిపోయారు.