Aaron Finch : పొట్టి ఫార్మాట్లో కెప్టెన్సీ ఎల్లప్పుడూ సవాలే. సంచలనాలకు కేరాఫ్ అయిన టీ20ల్లో.. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో సారథ్యం వహించడం కత్తిమీదసాము లాంటిది. ఫ్రాంచైజీ యాజమాన్యం నుంచి ఒత్తిడి.. మైదానంలో ఆటగాళ్లను సమన్వయం చేసుకోవడం అప్పుడప్పుడు తలనొప్పిగా మారుతాయి. చాలామందిలానే తనకు కూడా ఐపీఎల్లో కెప్టెన్‌గా ఉండడం చాలా కష్టంగా తోచిందని అంటున్నాడు ఆరోన్ ఫించ్ (Aaron Finch). ఐపీఎల్లో తొమ్మిది జట్లకు ఆడిన ఈ ఆస్ట్రేలియా మాజీ సారథి మెగా టోర్నీ అనుభవాలను పంచుకున్నాడిలా.
‘ఐపీఎల్ కెప్టెన్సీ చాలా కష్టం. ఎందుకంటే తక్కువ సమయంలోనే పరిస్థితులను, ఆటగాళ్లను అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. నేను పుణే వారియర్స్‌కు సారథిగా ఉన్నప్పుడు ఇదే పరిస్థితి ఎదుర్కొన్నాను. అప్పుడు నన్ను ఒకరి స్థానంలో తీసుకున్నారు. ఆ తర్వాతి రెండు మూడు మ్యాచ్‌లకే కెప్టెన్‌గా ఎంపికయ్యాను. స్క్వాడ్‌లోని వాళ్లను అర్ధం చేసుకోవడానికి తగినంత సమయం లభించలేదు. నాకైతే చాలా ఇబ్బందిగా అనిపించింది’ అని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో ఫించ్ వెల్లడించాడు.
A record nine IPL teams – fair enough from Aaron Finch 😅
Read more: https://t.co/Si6CosW0c3 | #TalkingCricket pic.twitter.com/Euze5QvwR7
— ESPNcricinfo (@ESPNcricinfo) September 1, 2025
‘ఆస్ట్రేలియాకు కెప్టెన్సీ వహించడం ఎల్లప్పుడూ సులవుగానే ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లు ఉంటారు. అందుకే.. ఆసీస్ జట్టును నడిపించడంలో నాకు ఇబ్బందులేవీ ఎదురవ్వలేదు. జట్టలోని ప్రతి ఒక్కరికి తమ బాధ్యతలు ఏంటో తెలుసు. అదే ఐపీఎల్ విషయానికొస్తే నేను కెప్టెన్‌గా గొప్ప ప్రదర్శన చేయలేదు. స్క్వాడ్‌పై అంచనాకు రావడం.. వ్యూహాలు అమలు చేయడం వంటివి సవాల్‌గా అనిపించేవి’ అని ఫించ్ పేర్కొన్నాడు. ఓపెనర్‌గా పరుగుల వరద పారించే ఫించ్ సారథ్యంలోనే ఆసీస్ 2021లో పొట్టి వరల్డ్ కప్ ఛాంపియన్‌గా అవతరించింది.
ఐపీఎల్లో తన 12 ఏళ్ల కెరీర్లో ఫించ్ తొమ్మిది జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తంగా 92 మ్యాచుల్లో 25.19 సగటుతో 2,091 పరుగులు సాధించాడు. బౌరల్లపై విరుచుకుపడుతూ 15 హాఫ్ సెంచరీలు బాదాడీ హిట్టర్. ప్రస్తుతం కామెంటేటర్‌గా ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాడీ మాజీ సారథి.
రాజస్థాన్ రాయల్స్(2009-10), ఢిల్లీ డేర్‌డెవిల్స్(2010-11), పుణే వారియర్స్ ఇండియా (2013), సన్‌రైజర్స్ హైదరాబాద్ (2014), ముంబై ఇండియన్స్ (2015), గుజరాత్ లయన్స్ (2016-17), కింగ్స్ లెవన్ పంజాబ్ (2018), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (2020), కోల్‌కతా నైట్ రైడర్స్ (2022) జట్ల జెర్సీతో మైదానంలోకి దిగాడీ డాషింగ్ బ్యాటర్.