రామవరం, సెప్టెంబర్ 02 : సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుదలకై కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం కొత్తగూడెం ఉపాధ్యక్షుడు గూడెల్లి యాకయ్య అన్నారు. మంగళవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని ఎస్ టి పి లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.20 వేల బోనస్ చెల్లించాలని, రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలని, పండుగలు, పర్వదినాల్లో వేతనంతో కూడిన సెలవు దినాలుగా ఇవ్వాలన్నారు. ఇలా అనేక సమస్యల పరిష్కారం కోసం ఏర్పడినటువంటి జేఏసీలో ఉన్న యూనియన్లు ఈ నెల 12న పిలుపునిచ్చిన చలో ప్రజాభవన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు.
ఈఎస్ఐ కోసం కృషి చేసిన టీబీజీకేస్ సెంట్రల్ కమిటీ మెంబర్, కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షుడు, దివంగత రాసూరి శంకర్ కృషి మరువలేనిదన్నారు. ఈఎస్ఐ హాస్పిటల్ సేవలు త్వరలో కాంట్రాక్ట్ కార్మికులకు అందేలా చూడాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం కొత్తగూడెం సెంట్రల్ కమిటీ సభ్యుడు తాండ్ర విజయకుమార్, వాటర్ సప్లై చిన్ని, యాల ఓదెలు, ఆదాము, చిట్టిబాబు, మంద శ్రీనివాస్, సూపర్వైజర్ మహబూబ్ పాషా, మురళి, స్వరూప, డ్రైవర్స్ విభాగం రామచందర్, నవీన్ పాల్గొన్నారు.